సాక్షి, హైదరాబాద్: శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభం, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, వేల సంఖ్యలో కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ‘ఎమ్మెల్యేలకు ఎర’, రాష్ట్ర మంత్రులు లక్ష్యంగా ఐటీ దాడులు లాంటి పరిణామాలూ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వైపు మొగ్గుకు కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెలుగు చూడటంతో బీజేపీ బాగా ఇరకాటంలో పడిందనే భావన టీఆర్‌ఎస్ అధిష్టానంలో ఉందని ఆ వర్గాలంటున్నాయి. రాష్ట్ర మంత్రులపై కక్షపూరితంగా జరుగుతున్న ఐటీ దాడులు ఉపకరిస్తాయన్న ఉద్దేశం కూడా ఉండొచ్చ ని చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టనుండటాన్ని ప్రస్తావిస్తున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికల అంచనాతోనే బీజేపీ, కాంగ్రెస్ వంటి విపక్ష పారీ్టలు కార్యాచరణకు సిద్ధమవుతున్నాయనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం.
అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి
మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాపరమైన అంశాల్లో వేగం పెంచారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల మరమ్మతు, ఆ«ధునికీకరణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో వచ్చే ఏడాది మార్చిలోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడం, సొంత జాగాలో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంపైనా ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయడంతో పాటు యూనిట్ల మంజూరును కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అభివృద్ధి పనులన్నీ మార్చిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
సెక్రటేరియట్‌కు సంక్రాంతి ముహూర్తం?
సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ సంక్రాంతిని ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలిసింది. సెక్రటేరియట్‌కు ఎదురుగా నిర్మాణంలో ఉన్న అమరుల స్మారకాన్ని పూర్తి చేసి అదేరోజు ప్రారంభించేలా చూడాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్ ఘాట్ పక్కనే వచ్చే నెల్లోనే ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కొలువుల భర్తీకి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. తాజాగా శుక్రవారం ఏకంగా 9,168 గ్రూపు–4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. టీఎస్‌పీఎస్‌సీతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వరుసబెట్టి కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు
డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లా కలెక్టరేట్ల భవనాలను వరుసగా ప్రారంభించేలా అధికారులు సీఎం పర్యటన షెడ్యూలు సిద్ధం చేస్తున్నారు. సీఎం జిల్లాల పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా జరుగుతాయని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌పై కేంద్రం విధిస్తున్న ఆంక్షలు, తదితరాలపై చర్చించనున్నారు. కేంద్రం కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై రెండు రోజులుగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఈ కసరత్తులో కీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం.
నియోజకవర్గాలపై స్పెషల్ నజర్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల బాట పట్టారు. ఓ వైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే సొంత నియోజకవర్గాన్ని, క్షేత్ర స్థాయిలో సంస్థాగత లోపాలను చక్కదిద్దుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మండలాల వారీగా పార్టీ కేడర్‌తో ఆతీ్మయ సమ్మేళనాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిల కోసం జాబితాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే..?
వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎదురయ్యే అనుకూల, వ్యతిరేక పరిణామాలతో పాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సంపూర్ణంగా కసరత్తు చేశారని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ పేరు భారత్ రాష్ట్ర సమితిగా మారే అంశంపై డిసెంబర్ మూడో వారంలో ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: Hyderabad: జనవరిలో నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్
Comments
Please login to add a commentAdd a comment