‘అప్పుడు అవమానించి గొంతు నులిమే ప్రయత్నాలు చేశారు’ | CM KCR Key Comments On The Occasion Of BRS Party Inauguration | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం: సీఎం కేసీఆర్‌

Published Sat, Dec 10 2022 1:01 AM | Last Updated on Sat, Dec 10 2022 1:33 AM

CM KCR Key Comments On The Occasion Of BRS Party Inauguration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘భారత్‌ రాష్ట్ర సమితి అనే వెలుగు దివ్వెను దేశం నలుమూలలా విస్తరింప చేద్దాం. భరతమాత సంతృప్తి పడేలా తెలంగాణ కీర్తి కిరీటాన్ని ఆమె పాదాల వద్ద పెట్టి దేశ ప్రతిష్టను ద్విగుణీకృతం చేద్దాం. భారత్‌ రాష్ట్ర సమితితో మన ప్రయాణం కొనసాగించి భరతమాత సంతృప్తిని కళ్లారా చూద్దాం. కొత్త రాజకీయ శక్తి అవిర్భవించినపుడు పాత శక్తులు రకరకాలుగా విమర్శలు చేస్తాయి. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు కూడా చాలామంది అవమానించి గొంతు నులిమే ప్రయత్నాలు చేశారు. అవన్నీ అధిగమించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. ఇప్పుడు కూడా కొంతమంది బాధలు, ఇబ్బందులు పెడతారు. పిరికితనం లేకుండా ముందుకు సాగుదాం. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం కాబట్టే తెలంగాణ సాధించాం. అదే స్ఫూర్తితో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్తే ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం..’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చాలనే వినతికి కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో భారతదేశ చిత్ర పటంతో కూడిన గులాబీ జెండాను కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ, లెజిస్లేచర్‌ పార్టీ, ఇతర ముఖ్య నేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ గడ్డ నుంచి బీఆర్‌ఎస్‌ పతాకం ఎగురవేయడం ఆషామాషీగా అలవోకగా, ఆవేశంలో చేస్తున్న పని కాదన్నారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటు వెనుక ప్రబల కారణముందని, ఇది ఒక ప్రారంభం మాత్రమే అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

తెలంగాణ అభివృద్ధి.. తిరోగామి స్థితిలో భారత్‌ 
‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లక్ష్యంగా పిడికెడు మందితో టీఆర్‌ఎస్‌ ప్రారంభమైంది. అనేక ఛీత్కారాలు, అవహేళనలు ఎదుర్కొంటూ చిత్తశుద్ధి, అంకిత భావం, త్యాగాలతో ప్రజల దీవెనలు అందుకుంటూ ఉప్పెనలా విజృంభించి తెలంగాణ సాధించాం. 60 లక్షల మంది సభ్యులతో ఈ రోజు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వేలాది మంది ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని సౌష్టవంగా నిర్మించుకుని క్రమ శిక్షణతో ప్రభుత్వాన్ని నడిపి అద్భుత ఫలితాలు సాధించాం. ఎడారిలా, మంచినీరు లేని ప్రాంతంలా పేరుపడిన తెలంగాణ ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధిని సాధిస్తే.. రత్నగర్భగా అపార మానవ సంపద కలిగిన భారత్‌ మాత్రం తిరోగామి స్థితిలో ఉంది. 41 కోట్ల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి, 70 వేల టీఎంసీల నదీ జలాలు, 109 కోట్ల మంది పనిచేసే జనం, జనాభాలో 52 శాతం యువత ఉన్నా.. దేశం దుస్థితిలో ఉంది.

ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ఉగ్రవాదం లాంటివెన్నో సాగుతున్నాయి. చెన్నై వంటి చారిత్రక నగరాలు గుక్కెడు తాగునీటి కోసం విలవిల్లాడుతున్నాయి. దేశ యువతను మతోన్మాదులు నిరీ్వర్యం చేస్తూ ఉంటే మనం గుడ్లప్పగించి చూస్తున్నాం. తెలంగాణ లాంటి ప్రయత్నమే దేశ మంతటా జరిగితే అమెరికాను తలదన్నే ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపుదాలుస్తుంది. ఇందుకు నాందీ ప్రస్తావన మన నుంచి జరగడం సంతోషం. దేశానికి అన్ని విషయాలు వివరించి తెలంగాణ ఉద్యమ తరహాలో పరివర్తన చూస్తాం. దేశంలో గుణాత్మక మార్పు, ఆర్థిక పరిపుష్టి కోసం అంకిత భావంతో ముందుకు సాగుదాం. బీఆర్‌ఎస్‌ తొలి నినాదం అబ్‌ కీ బార్‌..కిసాన్‌ సర్కార్‌. భారత్‌లో మన ప్రభుత్వం వస్తే మారుమూల గ్రామాలు, తండాల్లో 24 గంటలు కరెంటు ఇస్తాం. ఏడాదికో 25 లక్షల కుటుంబాలకు దళితబంధుతో పాటు రైతుబంధు పథకాలు అమలు చేస్తాం..’ అని కేసీఆర్‌ ప్రకటించారు. 

కొత్త విధానాల రూపకల్పనపై కసరత్తు 
‘దశాబ్దాలుగా సాగుతున్న నీటి పంచాయితీలు, ఆర్థిక పురోగతికి అవాంతరాలు, రైతాంగ సమస్యలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని దేశంలో అనేక రంగాల్లో కొత్త విధానాల రూపకల్పన జరగాల్సి ఉంది. వాటర్‌ పాలసీ, ఎకనామిక్‌ పాలసీ, పవర్‌ పాలసీ, అగ్రికల్చర్‌ పాలసీ, ఎన్విరాన్‌మెంట్‌ పాలసీ, వీకర్‌ సెక్షన్‌ అప్‌లిఫ్ట్‌మెంట్‌ పాలసీలు కొత్తగా రూపొందించుకునేందుకు నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు, ఆర్థికవేత్తలతో మాట్లాడాం. ఈ పాలసీలను కొద్ది రోజుల్లో దేశ ప్రజల ముందుపెడతాం. అలాగే బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలపై కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా నూతన ఆలోచన, కొత్త ఒరవడి ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేలా అద్భుత ప్రగతికి బాటలు వేసే ఆలోచనలను మేల్కొలుపుతాం. సమాఖ్య స్ఫూర్తిని పెంచేలా బీఆర్‌ఎస్‌ పనిచేస్తుంది..’ అని సీఎం తెలిపారు. 

కుమారస్వామి కోసం కష్టపడి పనిచేస్తాం 
‘కర్ణాటక రైతులు తెలంగాణ ప్రభుత్వ పథకాల అమలును చూస్తున్నారు. కర్ణాటక భావి ముఖ్యమంత్రిగా కుమారస్వామిని చూస్తున్నాం. కుమారస్వామి కోసం కష్టపడి పనిచేయడంతో పాటు కర్ణాటక రైతులకు ఇక్కడి పథకాలను వివరిస్తాం. తెలంగాణ పోరాటానికి దేవెగౌడ మద్దతు ఇచ్చారు. గతంలో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బెంగళూరుకు వెళ్లా. ప్రగతిశీల నాయకుల వెంట ఉంటాం. కన్నడ భాష తెలిసిన ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, షిండే, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వంటి నేతలు కర్ణాటకలో కుమారస్వామిగా మద్దతుగా ప్రచారం చేస్తారు..’ అని కేసీఆర్‌ చెప్పారు. 

పండుగలా కార్యాలయం ప్రారంభం 
‘ఈ రోజు దివ్యమైన ముహూర్తం ఉంది కాబట్టే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ నెల 14న ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించుకునేందుకు ఓ రోజు ముందే చేరుకునేలా పార్టీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. టీఆర్‌ఎస్‌ ఏర్పాటు ఆనాటి అవసరం కాగా.. దేశం కోసం బీఆర్‌ఎస్‌గా మారుతున్నాం. పార్టీ సొంత కార్యాలయం పనులు వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తవుతాయి..’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement