సాక్షి, నాగర్‌కర్నూల్: దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం ఉన్న ఉమ్మడి పాలమూరులోని సీనియర్ రాజకీయ నేతలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల పాటు ఎన్నికల పోరులో తలపడుతూ వచ్చిన పలువురు రాజకీయ ఉద్దండులు అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. మారిన పరిస్థితులకు అనుగుణంగా వీరంతా ఎన్నికల్లో పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు మద్దతుగా ఉంటూ ప్రచారం సాగిస్తున్నారు.
గద్వాల ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ
గద్వాల ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన డీకే అరుణ ఈసారి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోగా.. సమజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా 2004 ఎన్నికల్లో బరిలో నిలిచి గెలుపొందారు. అనంతరం 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, అనంతరం బీజేపీలో చేరారు. ఆపార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొ నసాగుతున్నారు. అయితే అ నూహ్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆమె దూ రంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇ ప్పుడు బరి నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
చివరి నిమిషంలో జిల్లెల చిన్నారెడ్డి
ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్న జిల్లెల చిన్నారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. వనపర్తి నియోజకవర్గం నుంచి 1989, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో సైతం ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించినా చివరి నిమిషంలో అభ్యర్థిత్వంలో మార్పు చేసింది. ఆయన స్థానంలో మరో నేత మేఘారెడ్డికి టికెట్ ఖరారు చేసింది. దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో వెలుగొందిన నేతలు ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్యంగా బరి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కందనూలు పోరుకు నాగం వీడ్కోలు..
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 1983 నుంచి సుమారు 40 ఏళ్లుగా ఎన్నికల బరిలో నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. 1983లో వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగం కందనూలుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. టీడీపీ అభ్యర్థిగా 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2012 ఉపఎన్నికలోనూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు తప్పలేదు.
ఈ అనూహ్య పరిణామానికి కలత చెందిన నాగం కాంగ్రెస్‌ను వీడి, బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కొల్లాపూర్‌లో మరో కాంగ్రెస్ నేత చింతలపల్లి జగదీశ్వరరావు ఈసారి ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. 2009లో టీడీపీ నుంచి బరిలో ఉన్న ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై 1508 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2012 ఉప ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించగా, జూపల్లి కృష్ణారావుకు టికెట్ కేటాయించడంతో జగదీశ్వరరావు పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment