అలంపూర్‌లో తమ నామినేషన్ ఉపసంహరించుకుంటున్న స్వతంత్ర అభ్యర్ధిని మేరమ్మ (ఫైల్)
అలంపూర్: మహిళలు మహారాణులు అంటూ కీర్తిస్తుంటాం. పురుషులతో సమానంగా అవకాశం కల్పిస్తాం అంటారు. విద్య, ఉద్యోగాల్లో ప్రస్తుతం మహిళలు రాణిస్తున్నా.. రాజకీయాల్లో మాత్రం వారికి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు. ద్వితీయ శ్రేణి పదువుల్లో మహిళలు అవకాశం దక్కించుకుంటున్నారు. కానీ పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ వంటి చట్టసభలు చేసే కీలక పదవుల్లో మహిళలు రాణించలేకపోతున్నారు.
కొన్ని సార్లు మహిళలు బరిలో నిలిచినప్పటికి ఫలితాలు తక్కువగానే వస్తున్నాయి. ఈ ఏడాది సెప్టంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి వందన్ అధినియమ్ బిల్లును ఏకగ్రీవంగా అమోదించింది. ఈ బిల్లు ఆధారంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం దక్కుతుంది. బిల్లు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలంపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒక్క మహిళా అభ్యర్ధి మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మహిళలు పోటీపడినా రెండవ స్థానానికి పరిమితం అయ్యారు.
ఇలా నామినేషన్.. అలా విత్‌డ్రా
ఈ సారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో అలంపూర్ అసెంబ్లీ స్థానంలో మహిళా అభ్యర్థులు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయదలిచిన అభ్యర్థుల నుంచి నామినేషన్‌లు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు మహిళలు తమ నామినేషన్‌లు దాఖలు చేశారు. అయిజకి చెందిన మేరమ్మ బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా నాలుగు సెట్ల నామినేషన్‌లు దాఖలు చేశారు.
అదేవిధంగా అయిజ మండలం సంకాపురానికి చెందిన ప్రేమలత బీఆర్‌ఎస్, తెలంగాణ రాజ్య సమితి పార్టీ, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదిన జరిగిన నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం మేరమ్మ స్వతంత్ర అభ్యర్ధిగా, ప్రేమలత తెలంగాణ రాజ్య సమితి తరపున వేసిన నామినేషన్‌లు స్వీకరించారు. కానీ అనుహ్యంగా ఈ నెల 15వ తేదిన తమ నామినేషన్‌లను ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు పేర్లు ఎక్కడ కనిపించకుండా పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment