Telangana Crime News: అక్కడ కాసులిస్తేనే లెక్క.. లేకుంటే పెండింగ్‌ పక్కా!
Sakshi News home page

అక్కడ కాసులిస్తేనే లెక్క.. లేకుంటే పెండింగ్‌ పక్కా!

Published Fri, Jan 5 2024 1:28 AM | Last Updated on Fri, Jan 5 2024 9:55 AM

- - Sakshi

కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలోనే ఉన్నా..
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల నుంచి వివిధ శాఖల పరిధిలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు అన్నీ ట్రెజరీ ద్వారానే జరుగుతాయి. అలాంటి ప్రధానమైన విభాగంపై నిఘా కరువైంది. నూతన కలెక్టరేట్‌ భవనంలో కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలోనే జిల్లా ఖజానా కార్యాలయం ఉన్నా.. పర్యవేక్షణ కొరవడడంతో అవినీతికి అలవాటు పడిన అధికారులు, సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.

ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు తప్ప..ఏరియర్స్‌, డీఏ, సరెండర్‌ లీవ్‌లు, జీపీఎఫ్‌ విత్‌డ్రాలు, గ్రామపంచాయతీ చెక్కుల వంటి అన్ని రకాల చెల్లింపులకు ఎవరైనా సరే పర్సంటేజీ ప్రకారం ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.

బిల్లులో ఐదు శాతం..
ట్రెజరీ కార్యాలయానికి సమర్పించిన బిల్లులు నెలల కొదీద్‌ కోకొల్లలుగా వెయిటింగ్‌ లిస్టులో ఉన్నాయి. ట్రెజరీ కార్యాలయం నుంచి బిల్లులు పాస్‌ చేసి ఈ–కుబేర్‌కు పంపాక క్యూలైన్‌లో ఉండాల్సిందే. అందరికీ ఇక్కడే ట్విస్ట్‌ ఎదురవుతోంది. చేసిన బిల్లులో ఐదు శాతం పర్సంటేజీ రూపంలో ఇస్తేనే బిల్లు అకౌంట్‌లో పడుతోంది.

ఈ తతంగం తెలిసిన వారు ముందుగానే ఇచ్చి పనులు చేయించుకుంటున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఇదంతా తెలవని వారు అయోమయానికి గురవుతూ అధికారుల వద్దకు పరుగెడుతున్నారు. వారు అయితదని సమాధానం ఇచ్చి తప్పించుకుంటున్నారు. ముడుపులు ఇచ్చుకోలేని వారు నిత్యం ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు.

ఇద్దరు వసూలు.. ఆ తర్వాత పంపకాలు
ముడుపుల బాగోతానికి సంబంధించి ట్రెజరీ కార్యాలయంలో ఓ ఇద్దరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కిందిస్థాయి కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఓ సెక్షన్‌ క్లర్క్‌ అన్నీ తామై వసూలు చేస్తున్నట్లు సమాచారం. వసూలు చేసిన మొత్తాన్ని లెక్కగట్టి.. ఇదివరకు నిర్ణయించుకున్న మేరకు వాటాల రూపంలో పంపకాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఈ మేరకు కొందరు కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, గ్రామ పంచాయతీ బిల్లులకు సంబంధించిన వ్యక్తులు ‘సాక్షి’తో మాట్లాడారు. ట్రెజరీ కార్యాలయంలో డబ్బులు ముట్టజెబితే మళ్లీ తిరగాల్సిన పని లేదని, ఇవ్వకుంటే పని కాదని, ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తమ పేరును గోప్యంగా ఉంచాలని కోరారు.

బిల్లులు.. పెండింగ్‌..
జిల్లాలోని మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర ఎస్టీఓల పరిధిలో గెజిటెడ్‌ కేడర్‌ నుంచి క్లాస్‌–4 వరకు మొత్తం 7,632 మంది ఉద్యోగులు ఉన్నారు. వారికి ప్రతి నెలా వేతనాల కింద రూ.12,63,01,928 చెల్లిస్తున్నారు. ఇందులో పెన్షనర్లకు రూ.6.40 కోట్లు చెల్లిస్తారు. ఈ ఏడాదిలో ఉద్యోగులకు చెందిన 6,668 సప్లిమెంటరీ బిల్లులకు రూ.41.55 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పెండింగ్‌లో ఉన్నాయి.

దీంతో పాటు ఇతర రకాల 2,160 బిల్లులకు గాను రూ.73.34 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇవేకాకుండా డీటీఓ నుంచి ఈ–కుబేర్‌కు పంపిన 33,307 బిల్లులకు రూ.835 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.

ఓ ఉద్యోగ సంఘం నేత హవా..
ఉద్యోగులకు పీఆర్సీ ఏరియర్స్‌ను 2020 నుంచి లెక్కించి 18 కిస్తుల రూపంలో ప్రతి నెలా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరు నెలల క్రితమే బిల్లులు చేసి ఆయా శాఖల నుంచి జిల్లా ట్రెజరీకి వచ్చాయి. అక్కడ బిల్లులు పాసై ఈ–కుబేర్‌కు వెళ్లాయి. అయితే ఎవరైతే కాసులు ముట్టజెప్పుతారో వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా కిస్తీల రూపంలో చెల్లిస్తున్నారు.

ముట్టజెప్పని వారిని పెండింగ్‌లో పెడుతున్నారు. జిల్లాలోని ఓ ఉద్యోగ సంఘం నాయకుడితో పాటు పలువురు ఈ–కుబేర్‌ అధికారులు, సిబ్బందితో కుమ్మకై ్క హవా నడిపిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లోనూ ఆయనే రాయబారాలు నడుపుతుండగా ముడుపుల బేరం మూడు పువ్వులు, ఆరు కాయల్లా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగంపై జిల్లా ఖజానా శాఖ డీడీ శ్రీనివాస్‌ను పలుమార్లు ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

భాధితుల గోడు ఇలా!
హన్వాడ మండలకేంద్రంలో ఓ పాఠశాల భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు 2023 ఫిబ్రవరి 8న జనరేట్‌ అయింది. పీడీ అకౌంట్‌ చెక్కును ఓ వ్యకి అదే రోజు ట్రెజరీ కార్యాలయంలో జమ చేశారు. ఇప్పటి వరకు బిల్లు చెల్లించకపోవడంతో సదరు వ్యక్తి ఆ కార్యాలయానికి 11 నెలలుగా తిరుగుతూనే ఉన్నారు. ఈ చెక్కు తర్వాత సమర్పించిన వాటికి బిల్లులు చెల్లింపులు పూర్తయ్యాయి. ట్రెజరీ కార్యాలయంలో లంచం ఇచ్చిన వారికి మాత్రమే పనిచేసి పెడుతున్నారని సదరు వ్యక్తి వాపోతున్నాడు.

ఓ తహసీల్దార్‌కు కిరాయికి కారు పెట్టినా. బిల్లులు ప్రతి నెలా చేసి పంపినా. ఎస్టీఓలో చెల్లింపు చేసినట్లు చూపుతున్నా.. ఈ – కుబేర్‌లో చెల్లింపు కావడం లేదు. మాతో పాటు చేయించుకున్న కొందరికి బిల్లులు వచ్చాయి.

కానీ నాకు 10 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మా పరిస్థితి బాగోలేదని, త్వరగా చెల్లించాలని కోరినా పట్టించుకోవడం లేదు. బిల్లులో 5 శాతం లంచం ఇచ్చుకుంటే గానీ పని కాదని తేల్చిచెబుతున్నారు. నెలల పాటు బిల్లు రాకపోవడంతో బండి డీజిల్‌కు కూడా ఇబ్బంది అయితాంది.

...ట్రెజరీ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పలువురు ఉద్యోగులు, సిబ్బంది ధనదాహం, పట్టించుకోని ఉన్నతాధికారులు వెరసి సర్కారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రభుత్వ అధికారులకు వాహనాలను అద్దెకు పెట్టిన వారు, గ్రామ పంచాయతీ వర్కర్లు, కాంట్రాక్టర్లు తదితరులు నానా తంటాలు పడుతున్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనంలోని ట్రెజరీ కార్యాలయంలో జరుగుతున్న ముడుపుల బాగోతంపై ‘సాక్షి’ ఫోకస్‌..  – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement