తిరుపతయ్య (ఫైల్)
జడ్చర్ల టౌన్: ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలోపడి ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల మండలం చిన్న ఆదిరాలలో బుధవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లికి చెందిన తిరుపతయ్య (36) భార్య లావణ్య, కుమారుడు, కుమార్తెతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నాడు.
ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి ఉన్న ఐదెకరాల పొలం, ఓ కారు విక్రయించాడు. సోదరుడు ఇచ్చిన కారు నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఆ కారును సైతం కుదువపెట్టాడు. సంక్రాంతి పండుగకు భార్య, పిల్లలను అత్తగారి ఊరైన కేశంపేట మండలం దత్తాయపల్లికి పంపించి అతడు స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 12న కుమార్తె జన్మదినం ఉండటంతో తెలిసిన వారి వద్ద బుల్లెట్ వాహనం తీసుకొని దత్తాయపల్లికి వెళ్లాడు.
జన్మదిన వేడుకలు ముగిశాక బుల్లెట్‌ను కేశంపేటలోనే రూ.22 వేలకు కుదువపెట్టి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొని ఆ డబ్బులు పోగొట్టుకున్నాడు. మిత్రుడి సాయంతో ఈ నెల 13న సాయంత్రం 4 గంటలకు మసిగుండ్లపల్లికి వచ్చి గ్రామ సమీపంలోని గుట్ట వద్ద ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇంటికి చేరుకోకపోవడంతో భార్య, కుటుంబ సభ్యులు వెదకడం ప్రారంభించి సమీప గ్రామ సర్పంచ్‌లు, తెలిసిన వారికి సమాచారం ఇచ్చారు.
మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం పత్తి చేనులో కూలీకి వెళ్తున్న వారు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి సర్పంచ్‌కు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ పోలీసులు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ నాగరాజు పంచనామా నిర్వహించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment