పథకం ప్రకారమే మహిళ దారుణహత్య! చివరికి.. | - | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే మహిళ దారుణహత్య! చివరికి..

Published Thu, Mar 14 2024 1:00 AM | Last Updated on Thu, Mar 14 2024 12:27 PM

- - Sakshi

 

బల్మూర్‌–అచ్చంపేటరహదారి పక్కన ఘటన

వారం క్రితం హత్య చేసినట్లు అనుమానాలు

పూర్తిగా కుళ్లిపోయిన మృతదేహం.. ఘటన స్థలంలోనే పోస్టుమార్టం

ఆధారాలు సేకరించిన క్లూస్‌ టీం

మహబూబ్‌నగర్‌: ఓ గుర్తు తెలియని మహిళ (40)ని అతి దారుణంగా హత్యచేసి ముళ్లపొదల్లో పడేసిన ఘటన బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారం శివారు వ్యవసాయ పొలంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బల్మూర్‌–అచ్చంపేట రహదారిలోని మైలారం శివారు వీరంరాజ్‌పల్లి స్టేజీకి ఎదురుగా ఉన్న ముళ్లపొదల్లోకి బుధవారం ఉదయం కొండనాగులకు చెందిన ఓ యువకుడు బహిర్భూమికి వెళ్లారు. అక్కడ గులాబీరంగు చీర, జాకెట్‌ ధరించి ఉన్న మహిళ మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. కాళ్లు, చేతులను తాడుతో కట్టేసి తలపై బండరాయితో మోదడంతో పాటు కాళ్లు విరగ్గొట్టడమే కాకుండా మద్యం సీసాలు పగులగొట్టి విచక్షణా రహితంగా కోసి అతి కిరాతకంగా హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ముళ్లపొదలు దట్టంగా ఉండటంతో మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. హత్యచేసి వారం రోజులు కావచ్చని కుళ్లిన మృతదేహాన్ని బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం చేసిన తర్వాతే హత్యచేసి ఉంటారని, లింగాల, తెల్కపల్లి, బల్మూర్‌ మండలాలకు చెందిన మహిళగా అనుమానిస్తున్నారు.

ఘటన స్థలంలో మద్యం సీసాలు..
క్లూస్‌టీం ఘటన స్థలంలోని మద్యం, నీటి సీసాలు, చెప్పులను స్వాధీనం చేసుకుంది. ముందస్తు పథకం ప్రకారమే మహిళను ఇక్కడికి తీసుకొచ్చి మద్యం తాగించి హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పరిశీలించిన డీఎస్పీ..
ఘటనా స్థలాన్ని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్‌ పరిశీలించారు. మైలారం మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు అచ్చంపేట సీఐ రవీందర్‌ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి మృతదేహానికి అక్కడే వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు ఎస్‌ఐ బాలరాజు వివరించారు. ఈ ఘటనతో మండలంలోని మైలారం, బల్మూర్‌, వీరంరాజ్‌పల్లి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి: భర్త వేధింపులు తాళలేక భార్య విషాదం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement