మునగాల,న్యూస్‌లైన్ : ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాం తంలో అంతర్భాగమై ఉన్న మునగాల పరగణాను విడదీస్తే ఊరుకునేది లేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. ‘మునగాల పరగణా ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమే’ అనే అం శంపై గురువారం మునగాలలో మండల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మునగాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రా ప్రాంతంలో విలీనం చేయాలని సీమాంధ్రనాయకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని తె లంగాణ వాదులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు ప్రజల ఆకాంక్ష మేరకే చేపట్టాలని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సరిహద్దులు నిర్ణయించాల్సిన పాలకవర్గాలు అందుకు భిన్నంగా స్వార్థ రాజకీయాలతో విభజించి పాలించాలనుకోవడం అనైతిక చర్య అని పేర్కొన్నారు. 1956కు పూర్వం మునగాల పరగణా ఆంధ్రా ప్రాంతంలో ఉన్నప్పటీకీ ఈ ప్రాంత ప్రజల సంప్రదాయాలు, సంస్కృతి, భాషా తెలంగాణలోనే మమేకమయ్యాయని, ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనచరిత్ర మునగాల పురిటిగ డ్డకు ఉందన్నారు. పరగణా పరిధిలోని గ్రామపంచాయతీలలో ఈ విషయాన్ని ప్రత్యేక తీర్మానాలు చేసి నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ పార్టీల పెద్దలకు అందజేయాలని కోదండరాం ప్రజలకు సూచించారు.
ఇక్కడివారు సంపూర్ణ తెలంగాణ కోరుకుంటున్నారని తెలిపారు. మునగాల, భద్రాచలం ప్రాంతాలతో పాటు, హైదరాబాద్‌పై, వనరులపై సర్వాధికారాలు కావాలనే పట్టుదలతో ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటాల కల ఫలించే సమయం దగ్గర పడిం దన్నారు. కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ ఏనాడూ వ్యతిరేకం కాదన్నారు.
తమ పార్టీ ఇప్పటికే పలు దఫాలుగా లేఖలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మునగాల పరగణాను జిల్లాలో కొనసాగించేందుకు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోరాటం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా రాజకీయ జేఏసీ కన్వీనర్ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంతో ఉద్యమాల చరిత్ర కలిగిన మునగాల పరగణాను విడదీయాలని ప్రయత్నిస్తే జిల్లా వ్యాప్తంగా పోరాటాలు చేపట్టేందుకు జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
మండల జేఏసీ కన్వీనర్ ఉప్పుల మట్టారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బట్టు శ్రీహరి నాయక్, ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కుర్రా జితేంద్రబాబు, జేఏసీ జిల్లా కోకన్వీనర్ వక్కం తుల కోటేశ్వరరావు, సీపీఐ నాయకులు బద్ధం భద్రారెడ్డి, కందిబండ సత్యనారాయణ, టీడీపీ,బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు సుంకర అజయ్‌కుమార్, బొలిశెట్టి కృష్ణయ్య, టి. శ్రీనివాస్ గౌడ్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామనర్సయ్య, మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ నాయకులు బాదె రాము, వక్కంతుల ప్రభాకర్, కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్ నియోజకవర్గాల జే ఏసీ కన్వీనర్లు రాయిపూడి చిన్ని, పి.ధర్మార్జున్, రంగాచారి, ఓయూ జేఏసీ నాయకులు కందుల మధు, తెలంగాణ అధ్యాపకుల సంఘం జిల్లా నాయకుడు సిరికొండ శ్రీనివాస్, కోదాడకు చెందిన జేఏసీ నాయకులు పందిరి నాగిరెడ్డి, బంగారు నాగమణి తదితరులు పాల్గొన్నారు.
మునగాలను విడదీస్తే ఊరుకోం
Published Fri, Nov 22 2013 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement
Advertisement