సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిందన్నారు తెలంగాణ జన సమతి చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయన్నారు. కేంద్రం చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.
కాగా, విద్యుత్ కొనుగోళ్లపై నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డితో కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ కొనుగోలుపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అందజేశారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
అనంతరం, కోదండరాం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ప్రజల నెత్తిన నష్టాల భారాన్ని మోపింది. విద్యుత్ శాఖను రూ.80వేల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను ఎలా కాపాడుకోవడం అనేది అనుమానమే. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కేసీఆర్ తొందర పాటు నిర్ణయం వల్ల ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకున్నారు.
వెయ్యి మెగావాట్ల అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గఢ్‌తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తర్వాత ఈ ఒప్పందం రద్దు చేసుకుంది. ఒప్పందం రద్దు కారణంగా ప్రభుత్వంపై రూ.250కోట్ల అదనపు భారం పడింది. విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి ఉందనేది అబద్ధం. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ అనుసరిస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు విద్యుత్ శాఖ అధికారి రఘు మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి అంశాలపై మా వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చాం. కమిషన్ ముందు పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒప్పందం ఎంఓయూ రూట్ కాకుండా కాంపిటేటివ్ రూట్‌కు ఎందుకు వెళ్లారనే సమాచారం ఇచ్చాం. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేయలేదు. ఈ ఒప్పందం వల్ల రూ.2600 కోట్ల నష్టం జరిగింది. వెయ్యి మెగావాట్ల ఒప్పందం జరిగితే సప్లై చేయలేదు. అదనంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం చేసుకున్నారు. తర్వాత తప్పు తెలుసుకుని రద్దు చేసుకోవాలనుకుంటే కుదరలేదు.
ఇరు రాష్ట్రాల డిస్కంల ఒప్పందాల ద్వారా ఎంఓయూ చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందలేదు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదు. బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వంపై సబ్జెక్టుకల్ టెక్నాలజీని రుద్దారు. 2010లో తయారు చేసుకున్న పలు యంత్రాలను టెక్నాలజీని బీహెచ్ఈఎల్.. ప్రభుత్వంపై ఆరేళ్ల తర్వాత బలవంతంగా రుద్దారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావు అని మా అభిప్రాయం. గోదావరిలో ఫ్లడ్ ఎక్కువైతే భద్రాద్రిపై ప్రభావం పడే అవకాశం ఉంది. సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడమే కాదు.. సరైన లొకేషన్ కూడా కాదు.
యాద్రాద్రీ పవర్ ప్లాంట్ లోకేషన్ వల్ల రవాణా చార్జీల భారం ఎక్కువగా పడుతుంది. పర్యావరణ అంశాలను లెక్క చెయ్యకుండా భద్రాద్రి నిర్మాణం మొదలు పెట్టారు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌లో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేది. కానీ అప్పటి ప్రభుత్వం అలా చెయ్యలేదు. 2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. మా అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం అప్పుడే కమిషన్ పీపీఏ చేయమంటే ఏడేళ్లుగా చెయ్యలేదు. ఈ ఒప్పందం వల్ల మూడు రకాల నష్టాలు జరిగాయి. రూ.635 కోట్ల నష్టం వచ్చింది. విద్యుత్ సరిగ్గా సరఫరా చేయనందుకు భద్రాద్రి ప్లాంట్ 25 ఏళ్లలో తొమ్మిది వేలు, యాదాద్రి రవాణా వల్ల రూ.1600 కోట్లకు పైగా నష్టం జరుగుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి ప్లాంట్ మొదలు పెట్టారు’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment