జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా విచారణ జరుపుతోందనేందుకు ఆధారాల్లేవు
నివేదిక ఏకపక్షంగా ఇస్తారేమోనని ఊహించి చెప్పడం సరికాదు
కమిషన్ ఏర్పాటు చట్టపరంగానే జరిగింది
మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసిన సీజే ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కమిషన్ ఏకపక్షంగా విచారణ జరుపుతోందనేందుకు ఆధారాలు చూపడంలో పిటిషనర్ విఫలమయ్యారని పేర్కొంది. కమిషన్ ఏర్పాటు చట్టపరంగానే జరిగిందని స్పష్టం చేసింది.
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ.. వాటిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ –1952 కింద జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అసలు పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా.. వద్దా.. అన్న అంశంపై జరిగిన వాదనలు శుక్రవారం పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.
పిటిషనర్‌ను కూడా వివరాలు కోరింది
‘ప్రెస్‌మీట్‌లో ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. విచారణ జరుగుతున్న తీరును మాత్రమే జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి విలేకరులకు వెల్లడించారు. నివేదిక ఏకపక్షంగా ఇస్తారేమోనని ఊహించడం సరి కాదు. కమిషన్ విచారణ పక్షపాతంగా సాగుతోందనడానికి సరైన సాక్ష్యాలను చూపడంలో పిటిషనర్ విఫలమయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఆరోపణలకు సరైన సాక్ష్యాలను చూపాలి. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు గురించిన సమాచారం తెలుసుకోవడంలో భాగంగా పిటిషనర్ నుంచి కూడా కమిషన్ వివరాలు కోరింది.
కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ –1952ని ఉల్లంఘిస్తూ మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్న వాదన కూడా ఆమోదయోగ్యం కాదు. విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై విచారణ జరిపేందుకు కమిషన్‌కు అర్హత ఉంది. ఎస్‌ఈఆర్‌సీ నిర్ణయాలతో విభేదించిన వాళ్లు ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకునే న్యాయపరమైన వెసులుబాటు ఉన్నా.. దానికి విస్తృత పరిధి లేదు. కొనుగోళ్లు భారామా? కాదా? లాంటి అంశాల జోలికి అది వెళ్లదు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పిటిషన్‌లో ఎలాంటి మెరిట్స్ లేవని భావిస్తున్నాం..’ అని హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో తెలిపింది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను తీర్పు కాపీలో పొందుపరిచింది.
కమిషన్ ఏర్పాటులో దాపరికం లేదు
‘జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నియామకమైన నాటి నుంచి ఇప్పటివరకు 15 మందికి పైగా సాక్షులను విచారించింది. ఇదే క్రమంలో కేసీఆర్‌ను కూడా కమిషన్ వివరాలు కోరింది. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ కమిషన్. ఇందులో దాపరికం అంటూ ఏదీ లేదు. ప్రజలకు వివరాలు తెలిస్తే వచ్చే నష్టం కూడా లేదు. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో మాట్లాడారనడం అసంబద్ధం. 8బీ నోటీసులు ఇచ్చే అధికారం కమిషన్‌కు ఉంది..’అని ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదించారు.
విచారణ పూర్తి కాకుండానే మీడియాతో మాట్లాడారు
‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), ఈఆర్‌సీతో పాటు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. పీపీఏలపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఒప్పందం చేసుకున్నాయి. అయితే కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్‌లో విచారణ ఎలా సాగాలో మార్గదర్శకాలు జారీ చేయడం చట్ట వ్యతిరేకం. చట్ట ప్రకారం కమిషన్ ఏర్పాటు చెల్లదు. విచారణ పూర్తి కాకుండానే, వివరాలు పరిశీలించకుండానే.. జస్టిస్ నరసింహారెడ్డి మీడియా భేటీ నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బడుతూ ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వినియోగించే సాంకేతికతతో ప్రభుత్వానికి రూ.250 కోట్లు నష్టం వస్తుందని ముందే తేల్చేశారు. కేసీఆర్ వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లేలా జస్టిస్ నరసింహారెడ్డి మీడియా భేటీలో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఇవ్వబోయే నివేదిక ఎలా ఉండనుందో తెలిసిపోతోంది. ఈ కారణాలతోనే ఆయనను ప్రతివాదిగా చేర్చాల్సి వచ్చింది..’అని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోంధీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment