మీకోసం ఢిల్లీలో సైనికుడిలా ఉంటా: రాహుల్‌ గాంధీ | Rahul Gandhi On Telangana Election Campaign | Sakshi
Sakshi News home page

మీకోసం ఢిల్లీలో సైనికుడిలా ఉంటా: రాహుల్‌ గాంధీ

Published Sat, Oct 21 2023 2:27 AM | Last Updated on Sat, Oct 21 2023 4:10 AM

Rahul Gandhi On Telangana Election Campaign - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ‘బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ మూడూ ఒక్కటే. వీరంతా కలిసి పనిచేస్తారు. ఢిల్లీలో, లోక్‌సభలో బీజేపీకి బీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుంది. తెలంగాణలో బీజేపీ, ఎంఐఎంలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచి్చనా ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి సాయపడుతోంది. ఈ ముగ్గురి లక్ష్యం కేవలం ప్రజాధనం దోచుకోవడం మాత్రమే. నేను బీజేపీతో పోరాటం చేస్తున్నందుకు నాపై కేసులు పెడుతున్నారు.

నా లోక్‌సభ సభ్యత్వం రద్దు చేసి నా ఇంటిని లాక్కున్నారు. నేను సంతోషంగా ఇంటిని అప్పగించాను. అసలు నాకు ఇల్లే అక్కర్లేదు. మొత్తం ఇండియానే నా ఇల్లు. తెలంగాణలో ప్రతి పల్లె, పట్టణం నా ఇల్లే. కోట్లాది ప్రజల హృదయాల నుంచి నన్ను దూరం చేయలేరు. ఢిల్లీలో, కేంద్రంలో ఇందిర, రాజీవ్, సోనియాల తరహాలోనే రాహుల్‌ గాంధీ అనే మీ సైనికుడు అక్కడ ఉంటాడు. మీకు ఎప్పుడు అవసరమైనా వెంటనే వచ్చేస్తాడు..’ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నారు.

తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు కులగణన తొలి అడుగు అని పేర్కొన్నారు. ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, పసుపు మద్దతు ధర రూ.15 వేలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఆరోపించారు. తెలంగాణలో ఇసుక, భూ, లిక్కర్‌ మాఫియాలను కేసీఆర్‌ కుటుంబమే నడుపుతోందన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి బస్సు యాత్ర మూడోరోజు శుక్రవారం.. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల్లో రాహుల్‌ పర్యటించారు. జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్‌ పట్టణాల్లో జరిగిన కార్నర్‌ మీటింగుల్లో ప్రసంగించారు.  
 

మోదీ రహస్య ఒప్పందం.. 
‘ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక కుటుంబమే రాజ్యమేలుతోంది. ఒకే కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించుకుందాం. సోనియాగాంధీ ప్రజా తెలంగాణను ఆకాంక్షించి రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచి్చన కేసీఆర్‌ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వనరులను, ప్రజలను విచ్చలవిడిగా దోచుకుంటోంది. దేశంలో ప్రతిపక్ష సీఎంలను వెంటాడుతున్న మోదీ.. కేసీఆర్‌ విషయంలో మాత్రం రహస్య ఒప్పందంతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ తనకు తెలియకుండానే దెబ్బతింది.

ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు వరుస కడుతున్నారు. బీఆర్‌ఎస్‌ కారు టైరు వారికి తెలియకుండానే పగిలింది. కాంగ్రెస్‌ గెలిస్తేనే ప్రజా తెలంగాణ సాధ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల తలుపులు ప్రజల కోసం నిరంతరం తెరిచి ఉంటాయి. రైతాంగానికి అండగా నిలబడతాం. నిజాం షుగర్స్‌ తెరిపిస్తాం. వరి తరహాలోనే అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు అదనంగా రూ.500 చెల్లింపు విషయాన్ని ఆలోచిస్తున్నాం. కేసీఆర్‌ కుటుంబం దోచుకున్న డబ్బును సంక్షేమం రూపంలో ప్రజలకు పంచుతాం..’అని రాహుల్‌ చెప్పారు. 
 

కాంగ్రెస్‌ బెబ్బులి పులుల సర్కారు ఏర్పడబోతోంది.. 
‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కులగణన ఆధారంగానే బడ్జెట్‌ కేటాయింపులు చేస్తాం. హక్కులు కల్పిస్తాం. నేను పార్లమెంటులో కులగణన ప్రస్తావన తెస్తే.. ప్రధాని సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక్కడ సీఎం కూడా కులగణనపై ఆసక్తి చూపడం లేదు. దేశంలో శ్రామిక శక్తి ఓబీసీలే. దామాషా ప్రకారం ఓబీసీలకు ఇవ్వాల్సిన హక్కులు ఇచ్చేందుకు వారు సిద్ధంగా లేరు. దేశ జనాభాలో 50% ఓబీసీలే. కానీ కేవలం 5% బడ్జెట్‌ మాత్రమే ఓబీసీల చేతుల్లో ఉంది. ఈ నిజాన్ని దాచి మీ జేబుల్లోనుంచి డబ్బులు కొట్టేసి అదాని లాంటి వ్యక్తులకు వెళ్లేలా చేస్తున్నారు. కులగణన ఎక్స్‌రే లాంటిది.

గాయం ఎక్కడ తగిలిందో ఎక్స్‌రే చెబుతుంది..’అని రాహుల్‌ అన్నారు. తెలంగాణలో ప్రజల సర్కారు, కాంగ్రెస్‌ బెబ్బులి పులుల (కార్యకర్తలు) సర్కారు ఏర్పడబోతోందని చెప్పారు. జీవన్‌రెడ్డి అనువాదం బాగుందంటూ..జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డిని, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను అసెంబ్లీకి పంపాలని కోరారు. రాహుల్‌ వెంట పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తదితరులున్నారు. 

టీ తాగి..దోశెలు వేసి..తిని 
మల్యాలలోని వేల్పూర్‌ మండలం పడిగెల్‌ క్రాస్‌రోడ్డులోని ఓ హోటల్‌ వద్ద టీ తాగుతూ రాహుల్‌ స్థానికులతో మాట్లాడారు. టీ అమ్ముకుంటున్న వృద్ధురాలి సమస్యలను తెలుసుకున్నారు. సోనియమ్మ కొడుకు, ఇందిరమ్మ మనుమడు నువ్వేనా అంటూ రాహుల్‌ను వృద్ధ దంపతులు ఆప్యాయంగా పలకరించారు. అక్కడి చిన్నారులతో సరదాగా సంభాషించిన రాహుల్‌ వారికి చాక్లెట్లు ఇచ్చారు. కాగా పర్యటన షెడ్యూలులో మార్పుల కారణంగా రాహుల్‌ గంగాధర, కొండగట్టు పర్యటన రద్దయ్యింది.

దీంతో నేరుగా జగిత్యాల వెళుతూ మధ్యలో రాజారంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఆగారు. దోశెలు ఎలా వేయాలో యజమానిని అడిగి తెలుసుకున్నారు. దోశెలు వేసి కస్టమర్లకు ఇచ్చారు. తాను కూడా రుచి చూసి అద్భుతంగా ఉంది తమ్ముడూ అని అభినందించారు. అక్కడి పిల్లలకు కూడా చాక్లెట్లు ఇచ్చారు. టిఫిన్‌ తినేందుకు వచి్చన వారితో ముచ్చటించారు. రాహుల్‌ రాకతో రోడ్డుపై వాహనాలు కిలోమీటర్‌ మేర నిలిచిపోయాయి.  
 

మరిచిపోలేని అనుభూతి 
వెనుక నుండి వచ్చి, భుజంపై చేయి వేసి, తమ్ముడూ ఎలా ఉన్నావు? అంటూ రాహుల్‌ గాంధీ పలుకరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిలిచిందని పోతారం గ్రామానికి చెందిన టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడు వావిలాల శివగౌడ్‌ చెప్పాడు. తాను దోశెలు వేసి తినడంతో పాటు తనకు తినిపించారని అన్నాడు. రాహుల్‌ గాందీని టీవీలో తప్ప నేరుగా ఎప్పుడూ చూడలేదంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఎంతో పెద్ద రాజకీయ నాయకుడు అయినా చాలా సాదాసీదాగా ఉన్నారని వ్యాఖ్యానించాడు.  

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేఖానాయక్‌ 
ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ సభలో రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్‌ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. 

ప్రజాస్వామిక తెలంగాణపై చర్చించాం: కోదండరాం 
ఓ హోటల్‌లో బస చేసిన రాహుల్‌ గాందీని శుక్రవారం ఉదయం టీజేఎస్‌ అధినేత కోదండరాం కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై తమకు ఉన్న సమాచారాన్ని రాహుల్‌తో పంచుకున్నామని చెప్పారు. భవిష్యత్‌ కార్యాచరణకు సంబంధించి హైదరాబాద్‌లో ప్రకటన విడుదల చేస్తామని, సీట్లు, పొత్తుల విషయం రాహుల్‌తో మాట్లాడలేదని తెలిపారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలి అన్న విషయంపై చర్చించామని, ఈ క్రమంలో తమ మద్దతు అడిగారని వివరించారు. రాజకీయాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల భాగస్వామ్యం పెంచాలని, అందుకోసం కలిసి రావాలని అన్నారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement