ajmeera rekha nayak
-
మీకోసం ఢిల్లీలో సైనికుడిలా ఉంటా: రాహుల్ గాంధీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడూ ఒక్కటే. వీరంతా కలిసి పనిచేస్తారు. ఢిల్లీలో, లోక్‌సభలో బీజేపీకి బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుంది. తెలంగాణలో బీజేపీ, ఎంఐఎంలు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచి్చనా ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి సాయపడుతోంది. ఈ ముగ్గురి లక్ష్యం కేవలం ప్రజాధనం దోచుకోవడం మాత్రమే. నేను బీజేపీతో పోరాటం చేస్తున్నందుకు నాపై కేసులు పెడుతున్నారు. నా లోక్‌సభ సభ్యత్వం రద్దు చేసి నా ఇంటిని లాక్కున్నారు. నేను సంతోషంగా ఇంటిని అప్పగించాను. అసలు నాకు ఇల్లే అక్కర్లేదు. మొత్తం ఇండియానే నా ఇల్లు. తెలంగాణలో ప్రతి పల్లె, పట్టణం నా ఇల్లే. కోట్లాది ప్రజల హృదయాల నుంచి నన్ను దూరం చేయలేరు. ఢిల్లీలో, కేంద్రంలో ఇందిర, రాజీవ్, సోనియాల తరహాలోనే రాహుల్ గాంధీ అనే మీ సైనికుడు అక్కడ ఉంటాడు. మీకు ఎప్పుడు అవసరమైనా వెంటనే వచ్చేస్తాడు..’ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు కులగణన తొలి అడుగు అని పేర్కొన్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, పసుపు మద్దతు ధర రూ.15 వేలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణలో ఇసుక, భూ, లిక్కర్ మాఫియాలను కేసీఆర్ కుటుంబమే నడుపుతోందన్నారు. కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర మూడోరోజు శుక్రవారం.. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ పర్యటించారు. జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్ పట్టణాల్లో జరిగిన కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. మోదీ రహస్య ఒప్పందం.. ‘ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక కుటుంబమే రాజ్యమేలుతోంది. ఒకే కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించుకుందాం. సోనియాగాంధీ ప్రజా తెలంగాణను ఆకాంక్షించి రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచి్చన కేసీఆర్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వనరులను, ప్రజలను విచ్చలవిడిగా దోచుకుంటోంది. దేశంలో ప్రతిపక్ష సీఎంలను వెంటాడుతున్న మోదీ.. కేసీఆర్ విషయంలో మాత్రం రహస్య ఒప్పందంతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ తనకు తెలియకుండానే దెబ్బతింది. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు వరుస కడుతున్నారు. బీఆర్ఎస్ కారు టైరు వారికి తెలియకుండానే పగిలింది. కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజా తెలంగాణ సాధ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల తలుపులు ప్రజల కోసం నిరంతరం తెరిచి ఉంటాయి. రైతాంగానికి అండగా నిలబడతాం. నిజాం షుగర్స్ తెరిపిస్తాం. వరి తరహాలోనే అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు అదనంగా రూ.500 చెల్లింపు విషయాన్ని ఆలోచిస్తున్నాం. కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బును సంక్షేమం రూపంలో ప్రజలకు పంచుతాం..’అని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ బెబ్బులి పులుల సర్కారు ఏర్పడబోతోంది.. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు చేస్తాం. హక్కులు కల్పిస్తాం. నేను పార్లమెంటులో కులగణన ప్రస్తావన తెస్తే.. ప్రధాని సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక్కడ సీఎం కూడా కులగణనపై ఆసక్తి చూపడం లేదు. దేశంలో శ్రామిక శక్తి ఓబీసీలే. దామాషా ప్రకారం ఓబీసీలకు ఇవ్వాల్సిన హక్కులు ఇచ్చేందుకు వారు సిద్ధంగా లేరు. దేశ జనాభాలో 50% ఓబీసీలే. కానీ కేవలం 5% బడ్జెట్ మాత్రమే ఓబీసీల చేతుల్లో ఉంది. ఈ నిజాన్ని దాచి మీ జేబుల్లోనుంచి డబ్బులు కొట్టేసి అదాని లాంటి వ్యక్తులకు వెళ్లేలా చేస్తున్నారు. కులగణన ఎక్స్‌రే లాంటిది. గాయం ఎక్కడ తగిలిందో ఎక్స్‌రే చెబుతుంది..’అని రాహుల్ అన్నారు. తెలంగాణలో ప్రజల సర్కారు, కాంగ్రెస్ బెబ్బులి పులుల (కార్యకర్తలు) సర్కారు ఏర్పడబోతోందని చెప్పారు. జీవన్‌రెడ్డి అనువాదం బాగుందంటూ..జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డిని, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను అసెంబ్లీకి పంపాలని కోరారు. రాహుల్ వెంట పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తదితరులున్నారు. టీ తాగి..దోశెలు వేసి..తిని మల్యాలలోని వేల్పూర్ మండలం పడిగెల్ క్రాస్‌రోడ్డులోని ఓ హోటల్ వద్ద టీ తాగుతూ రాహుల్ స్థానికులతో మాట్లాడారు. టీ అమ్ముకుంటున్న వృద్ధురాలి సమస్యలను తెలుసుకున్నారు. సోనియమ్మ కొడుకు, ఇందిరమ్మ మనుమడు నువ్వేనా అంటూ రాహుల్‌ను వృద్ధ దంపతులు ఆప్యాయంగా పలకరించారు. అక్కడి చిన్నారులతో సరదాగా సంభాషించిన రాహుల్ వారికి చాక్లెట్లు ఇచ్చారు. కాగా పర్యటన షెడ్యూలులో మార్పుల కారణంగా రాహుల్ గంగాధర, కొండగట్టు పర్యటన రద్దయ్యింది. దీంతో నేరుగా జగిత్యాల వెళుతూ మధ్యలో రాజారంలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఆగారు. దోశెలు ఎలా వేయాలో యజమానిని అడిగి తెలుసుకున్నారు. దోశెలు వేసి కస్టమర్లకు ఇచ్చారు. తాను కూడా రుచి చూసి అద్భుతంగా ఉంది తమ్ముడూ అని అభినందించారు. అక్కడి పిల్లలకు కూడా చాక్లెట్లు ఇచ్చారు. టిఫిన్ తినేందుకు వచి్చన వారితో ముచ్చటించారు. రాహుల్ రాకతో రోడ్డుపై వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. మరిచిపోలేని అనుభూతి వెనుక నుండి వచ్చి, భుజంపై చేయి వేసి, తమ్ముడూ ఎలా ఉన్నావు? అంటూ రాహుల్ గాంధీ పలుకరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిలిచిందని పోతారం గ్రామానికి చెందిన టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు వావిలాల శివగౌడ్ చెప్పాడు. తాను దోశెలు వేసి తినడంతో పాటు తనకు తినిపించారని అన్నాడు. రాహుల్ గాందీని టీవీలో తప్ప నేరుగా ఎప్పుడూ చూడలేదంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఎంతో పెద్ద రాజకీయ నాయకుడు అయినా చాలా సాదాసీదాగా ఉన్నారని వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాస్వామిక తెలంగాణపై చర్చించాం: కోదండరాం ఓ హోటల్లో బస చేసిన రాహుల్ గాందీని శుక్రవారం ఉదయం టీజేఎస్ అధినేత కోదండరాం కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై తమకు ఉన్న సమాచారాన్ని రాహుల్‌తో పంచుకున్నామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి హైదరాబాద్‌లో ప్రకటన విడుదల చేస్తామని, సీట్లు, పొత్తుల విషయం రాహుల్‌తో మాట్లాడలేదని తెలిపారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలి అన్న విషయంపై చర్చించామని, ఈ క్రమంలో తమ మద్దతు అడిగారని వివరించారు. రాజకీయాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల భాగస్వామ్యం పెంచాలని, అందుకోసం కలిసి రావాలని అన్నారని చెప్పారు. -
బీఆర్ఎస్కు రేఖా నాయక్ రాజీనామా.. కేటీఆర్‌పై షాకింగ్ కామెంట్స్
సాక్షి, నిర్మల్: ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తాను అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అలాగే, కేసీఆర్ మాట తప్పారు.. కేటీఆర్ చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, రేఖా నాయక్ శుక్రవారం ఖానాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఒక మహిళకు అన్యాయం జరిగింది. నన్ను మోసం చేశారు. ప్రజలను మోసం చేస్తున్నారు. కేటీఆర్ స్నేహితుడని జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేనేం తప్పు చేశానో చెప్పాలి. నేను భూములు కబ్జా చేశానా?.. అది నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. ఏం లూటీలు చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై ఫైర్.. ఇదే సమయంలో కేటీఆర్.. తన స్నేహితుడు జాన్సన్ కోసం అభివృద్ధి పనులను ఆపేశారు. సీఎం కేసీఆర్ ఖానాపూర్ సదర్ మట్ నిర్మిస్తామన్నారు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ, ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పారు. నా నియోజకవర్గానికి కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మల్, బోథ్‌కు తరలించారు. నా నిధులు ఆపినందుకు నేను పోరాటానికి వెళ్తున్నాను. ఖానాపూర్‌ను అభివృద్ధి చేయలేదని కేటీఆర్ ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ను ఓడించడమే టార్గెట్.. వచ్చే ఎన్నికల్లో పోటీలోనే ఉంటాను. నేను ప్రజలకు చేసిన మంచిని వారికి చెబుతాను. అన్యాయంగా మా అల్లుడిని బదిలీ చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాను. పాదయాత్రకు నేను రెడీ అవుతున్నాను. గ్రామ గ్రామాన పాదయాత్రతో ప్రజలను కలుస్తాను. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తాను. బీఆర్ఎస్ను ఓడించడమే నా లక్ష్యం. జాన్సన్ ఎస్టీ కాదు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఏడుస్తున్నా.. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపిస్తా.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవుల వల.. -
‘ఏపీ ప్రజలను గాలికొదిలేసి.. తెలంగాణలో ప్రచారం’
సాక్షి, ఉట్నూర్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం గీసుకోకుంటే తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాశనం చేసిన తెలంగాణను ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రజలను గాలికి వదిలేసి తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు టీఆర్ఎస్ మేలు చేసిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ 200 రూపాయల పెన్షన్ ఇస్తే.. టీఆర్ఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 రూపాయలు ఇచ్చిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. 12 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్టు హామీ ఇచ్చారు. ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు గుంపులుగా వస్తున్నాయని విమర్శించారు. సంక్రాతికి ముందే గంగిరేద్దులా మహాకూటమి అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 3400 తాండాలు, గూడేలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ఒకప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడేవారని.. కానీ నేడు 35 శాతానికి పైగా ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. మిగతా పార్టీల బాసులు ఢిల్లీలో, అమరావతిలో ఉంటారని.. తమ బాసులు మాత్రం గల్లీల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. -
మాజీ ఎంపీ అనుచిత ప్రవర్తన
పోలీస్‌స్టేషన్ ముందు అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆందోళన ► తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణ ► ‘నీ సంగతి చెబుతా’ అంటూ బెదిరించారని వెల్లడి ► రమేశ్ రాథోడ్‌తో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు ఖానాపూర్: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘నీ సంగతి చెబుతా..’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురువారం పోచంపాడులో సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ఖానాపూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు జిల్లా నేతలు పాల్గొన్నారు. భేటీలో తన పక్కన కూర్చున్న మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల శ్రీనివాస్‌ను రమేశ్ రాథోడ్ చేయి పట్టి పక్కకు లాగారని ఎమ్మెల్యే రేఖా నాయక్ తెలిపారు. ఇదేంటని తాను ప్రశ్నిస్తే.. ‘‘ఎక్కడ్నుంచో బతికేందుకు వచ్చావు.. నీ స్థానంలో నీవు ఉండు.. వీళ్లు వెళ్లిపోయాక నీ సంగతి చెబుతా..’’అని బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. గొడవ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర నాయకులు కలుగచేసుకొని సర్దిచెప్పారన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. రమేశ్ రాథోడ్‌తో తనకు ప్రాణహాని ఉందని, గతంలో కూడా తనపై గన్‌మన్‌ను తోసి దౌర్జన్యానికి దిగారని, మహిళ అని కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. సమావేశంలో గొడవకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు ఉన్నాయన్నారు. వెంటనే రాథోడ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ మేరకు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌కు సైతం రమేశ్ ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు. -
ఖానాపూర్ ఎమ్మెల్యేకు అరుదైన అవకాశం
ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ శాసనసభ్యురాలు అజ్మీరా రేఖానాయక్‌కు అరుదైన అవకాశం లభించింది. గిరిజన ఎమ్మెల్యేగా ఖానాపూర్ నుంచి ఎన్నికైన ఈమెకు అమెరికా విద్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్‌కు ఆహ్వానం అందింది. ఏప్రిల్ 4 నుంచి 24 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.