మాజీ ఎంపీ అనుచిత ప్రవర్తన
పోలీస్‌స్టేషన్ ముందు అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆందోళన
► తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణ
► ‘నీ సంగతి చెబుతా’ అంటూ బెదిరించారని వెల్లడి
► రమేశ్ రాథోడ్‌తో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు
ఖానాపూర్: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘నీ సంగతి చెబుతా..’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురువారం పోచంపాడులో సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు జిల్లా నేతలు పాల్గొన్నారు. భేటీలో తన పక్కన కూర్చున్న మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల శ్రీనివాస్‌ను రమేశ్ రాథోడ్ చేయి పట్టి పక్కకు లాగారని ఎమ్మెల్యే రేఖా నాయక్ తెలిపారు. ఇదేంటని తాను ప్రశ్నిస్తే.. ‘‘ఎక్కడ్నుంచో బతికేందుకు వచ్చావు.. నీ స్థానంలో నీవు ఉండు.. వీళ్లు వెళ్లిపోయాక నీ సంగతి చెబుతా..’’అని బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
గొడవ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర నాయకులు కలుగచేసుకొని సర్దిచెప్పారన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. రమేశ్ రాథోడ్‌తో తనకు ప్రాణహాని ఉందని, గతంలో కూడా తనపై గన్‌మన్‌ను తోసి దౌర్జన్యానికి దిగారని, మహిళ అని కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. సమావేశంలో గొడవకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు ఉన్నాయన్నారు. వెంటనే రాథోడ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ మేరకు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌కు సైతం రమేశ్ ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.