
చెట్టు జీవిత చరిత్ర తెలిపేలా క్యూఆర్ కోడ్
ప్రతి చెట్టుకూ ఓ ఆధార్.. జియోట్యాగింగ్‌తో పర్యవేక్షణ
దేశంలో తొలి డిజిటల్ ట్రీ ఆధార్ గ్రామంగా ముఖరా (కె)కు ఖ్యాతి
సాక్షి, ఆదిలాబాద్: దేశంలో ఇప్పుడు ప్రతి పౌరుడికీ ఓ గుర్తింపు ఉంది. అదే ఆధార్.. అలాంటి ఓ గుర్తింపే ప్రతి చెట్టుకు ఉంటే..? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామానికి వెళితే.. ఇలాంటి ప్రత్యేక గుర్తింపు ఉన్న చెట్లు అడుగడుగునా కనిపిస్తాయి. దుకాణాల్లో కనిపించే క్యూఆర్ కోడ్ స్కానర్ల మాదిరే ఈ గ్రామ పరిధిలోని ప్రతి చెట్టుకూ స్కానర్లు కనిపిస్తాయి. వాటిని స్కాన్ చేస్తే ఆ చెట్టు వివరాలన్నీ మనకు ఫోన్‌లో దర్శనమిస్తాయి.
చెట్టు గుర్తింపు నంబర్, అది ఏ రకం, మొక్క నాటిన తేదీ, సంవత్సరం, దాని వయస్సుతో పాటు అది వాతావరణం నుంచి ఎంత కార్బన్‌డయాక్సైడ్ తీసుకున్నదనే సకల వివరాలు కనిపిస్తాయి. దేశంలో చెట్లకు ప్రత్యేక గుర్తింపు నంబర్లు వేసిన తొలి గ్రామంగా ముఖరా (కే) రికార్డు సృష్టించింది.
చెట్ల డేటాబేస్‌ను క్రోడీకరించేందుకు ‘డిజిటల్ ట్రీ ఆధార్’కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ప్రారంభించారు. గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఓ చెట్టుకు స్కానర్‌ను అమర్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గ్రామంలోని ప్రతి చెట్టును జియోట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ కేటాయించారు.
ఆది నుంచి ప్రత్యేకమే..
ఆరేళ్ల క్రితమే ఏర్పడిన ముఖరా (కె) గ్రామపంచాయతీ ఆది నుంచీ ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామ తొలి సర్పంచ్‌గా గాడ్గే మీనాక్షిని ఆ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలోని చెత్త నుంచి వర్మీకంపోస్టును తయారు చేసి విక్రయించగా వచ్చిన రూ.5 లక్షలతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో వీధి దీపాలకు, ప్రభుత్వ భవనాలకు విద్యుత్ బిల్లు జీరోగా మారింది.
బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడం ద్వారా ఓడీఎఫ్ ప్లస్‌లో స్థానం దక్కించుకుంది. గ్రామంలో సామూహిక మరుగుదొడ్లు కూడా నిర్మించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల ద్వారా గ్రామంలో 1,05,624 మొక్కలను ఐదేళ్లలో నాటారు. ప్రస్తుతం ఆ చెట్లు, మొక్కలకు జియోట్యాగింగ్, క్యూఆర్ కోడ్ స్కానర్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ గ్రామానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శక్తికరణ్ పురస్కార్, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, స్వచ్ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డు, గ్రామ ఊర్జాస్వరాజ్ విశిష్ట పంచాయతీ పురస్కార్, డిజిటల్ క్యాష్‌లెస్ విలేజ్ అవార్డులు లభించాయి.
నాటిన ప్రతీ మొక్క బతకాలన్నదే మా తపన
మనం ఎన్ని మొక్కలు నాటాం? ఎన్ని బతికాయి? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే విషయాలు తెలుసుకునేందుకే జియోట్యాగింగ్, క్యూఆర్ కోడ్ స్కానర్ బిగించే కార్యక్రమం చేపట్టాం. మొక్క ఎండిపోతే తిరిగి అక్కడే మరో మొక్క నాటేందుకు జియోట్యాగింగ్ ఉపయోగపడుతుంది. – గాడ్గే మీనాక్షి, మాజీ సర్పంచ్, ముఖరా (కె)
Comments
Please login to add a commentAdd a comment