సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఓడిపోవడంపై పొలిటికల్ విశ్లేషణ జరగాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సీట్ల సర్దుబాటు, ప్రచారం ఆలస్యం కావడం, ప్రచారవ్యూహం లేకపోవడం వల్లే కూటమి ఓడిపోయిందని పేర్కొన్నారు. తమ నాలుగేళ్ల శ్రమ వృథాగా పోయిం దన్నారు. ఎన్నికల్లో ఇంటింటికీ ప్రచారం చేయలేదని, మంచి ఎజెండా ఉన్నా ప్రజలకు చెప్పుకోలేక పోయామన్నారు. తాను కేసీఆర్‌తో పదేళ్లపాటు కలసి పని చేశానని, కేసీఆర్ ప్రచారశైలి గురించి ఎన్నిసార్లు కూటమి పార్టీ నేతలకు హెచ్చరించినా ఉత్తమ్, ఎల్.రమణ వినిపించుకోలేదన్నారు.
కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం ఉండాలని తాను చెప్పానని, కానీ 15 రోజుల ప్రచా రం చాలని ఉత్తమ్, మూడు వారాలు సరిపోతుందని రమణ పేర్కొన్నారని వెల్లడించారు. టీజేఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. కూటమిలోని కొంతమంది నేతల అతి ఆత్మవిశ్వాసం కారణంగా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఓటమికి ఈవీఎంల ను బూచిగా చూపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఈవీఎంలపై తప్పు నెట్టడంలో అర్థం లేదన్నారు. అసలు కారణాలను సమీక్షించకుండా ఉత్తుత్తి కారణాలను విశ్లేషిం చడం వల్ల లాభం లేదన్నారు. కూటమి ఓడిపోవడానికి కారణాలను జన సమితి విశ్లేషణ చేస్తుందన్నారు.
సర్దుబాటు ఆలస్యంతోనే నష్టం
రాజకీయపరమైన వైఫల్యాలను చర్చించకుండా సమీక్షలు జరపడం సరికాదన్నారు. సీట్ల సర్దుబాటులో ఆలస్యం కావడం నష్టం చేకూర్చిందని కోదండరాం అన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబ పాలనను, కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లో సరిగా ఎండగట్టలేకపోయామన్నారు. కేసీఆర్ రాజకీయ చతురతను అంచనా వేసి ఎదుర్కోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ తనపై ఉన్న రాజకీయ వ్యతిరేకతను చల్లబరుచుకోగలిగారన్నారు. కేసీఆర్ చంద్రబాబు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, ఏం గిఫ్ట్ ఇస్తారో చూడాలన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అర్థం లేని పని అని, అది సక్సెస్ కాదని అభిప్రాయపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కావాలంటే రెండు కారణాలు ఉంటాయన్నారు. ఒకటి దేశాన్ని ప్రభావితం చేసేలా ఒక రాష్ట్రం సమస్యలను లేవనెత్తాలని, నాలుగైదు రాష్ట్రాలు కలిపి సమస్యలను లేవనెత్తాలని పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ దగ్గర నిర్దిష్టమైన సమస్యలు ఏమున్నాయని ప్రశ్నించారు. ఇంతవరకు ప్రధాన సమస్య ఇదంటూ కేసీఆర్ గుర్తించలేదన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనక ఎవరు ఉన్నారో చూస్తామన్నారు. లోక్‌సభకు తాను పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నానన్న వార్త అవాస్తవమని కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నిలకు మధ్య వ్యత్యాసం ఉంటుందన్నారు. ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోవడానికి తాము సిగ్గుపడట్లేదని, ఓటమి వల్ల తాము విశ్వాసం కోల్పోలేదన్నారు. గ్రామ, మండల స్థాయి నుంచి తెలంగాణ జనసమితిని బలోపేతం చేయటానికి ప్రణాళికలు రచిస్తున్నామని, రానున్న పార్లమెంటు ఎన్నికలపై త్వరలోనే సమావేశమై చర్చిస్తామని, కూటమి ఆ ఎన్నికల్లో కొనసాగుతుందని నమ్ముతున్నామన్నారు. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, నిరుద్యోగ సమస్య, జీఎస్టీ లాంటి అంశాలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్నారు. రాష్ట్రాల నిధుల అంశం కూడా జాతీయస్థాయిలో కీలకం కానుందన్నారు. ఉద్యోగాల్లో బీసీలకు 25 శాతం ఇస్తున్నప్పుడు ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేకపోయారన్నారు. మొత్తం పంచాయతీల్లో బీసీలకు కల్పించింది 18.5 శాతం పంచాయతీలేనన్నారు. బీసీలకు కనీసం 25 శాతం పంచాయతీలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొనుగోలు, అమ్ముడు పోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు.
సొంతంగానేపంచాయతీ ఎన్నికల్లో పోటీ
పంచాయతీ ఎన్నికల్లో తాము సొంతంగానే పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పార్టీ పేరుతో కాకుండా అభ్యర్థులవారీగానే పోటీ ఉంటుంది కాబట్టి టీజేఎస్ తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతుందని వెల్లడించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో పొత్తు నిర్ణయం ఉండదన్నారు. మంగళవారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉన్న గ్రామపంచాయతీలను గుర్తించే పనిని ప్రారంభిస్తామన్నారు. పార్టీని ప్రారంభించిన సమయంలోనే అనేకమంది యువత వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చి పార్టీలో నేరుగా చేరడమే కాకుండా ఆన్‌లైన్ ద్వారా పార్టీలో చేరినవారు ఉన్నారన్నారు.
ఇప్పుడు వాటినన్నింటిని క్రోడీకరించి, ఎక్కడెక్కడ తమ పార్టీ బలంగా ఉందో గుర్తించి ముందుకు సాగుతామన్నారు. గ్రామం కోసం పని చేసేవారిని, గ్రామాభివృద్ధికి పాటుపడేవారికి ప్రాధాన్యం ఇచ్చి ఎన్నికల్లో నిలబెడతామన్నారు. యువత, రిటైర్డ్ ఉద్యోగులను ప్రోత్సహించి పార్టీ తరఫున పోటీలో నిలిపేందుకు కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా, ఏదైనా గ్రామంలో పొత్తు అవసరం అనుకుంటే జిల్లా పార్టీ కమిటీలే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో అవసరమైన చోట పొత్తు పెట్టుకునే అంశాన్ని జిల్లా పార్టీ నేతలు చూసుకుంటారన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పార్టీల కంటే గ్రామాభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులనే ప్రజలు చూస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment