బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్
విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలి
సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ లేఖ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. రాష్ట్రంలోకి సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలన్నారు. ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్షాలపై సైబర్దాడికి కారకులైన కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులిచ్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు బండి సంజయ్ శనివారం ముఖ్యమంత్రికి బహిరంగలేఖ రాశారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిద్దరూ ఎమ్మెల్యే పదవులకు అనర్హులని, ఈ మేరకు స్పీకర్‌కు సీఎం లేఖ రాయాలన్నారు. విపక్షాలను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని విచారణలో తెలిసినా.. ఇంతవరకు వారికి కనీసం నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు కూడా చేతులు మారినట్లు తెలుస్తోందని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కాపాడే యత్నాలు చేస్తోందనే చర్చతో ప్రజల్లో ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతిన్నదన్నారు.
ఏఐసీసీకి రాష్ట్రం ఏటీఎంగా మారింది
ఏఐసీసీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించి, మెప్పించారు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి వస్తోందని, అందుకే ఆయా కేసుల విచారణ ముందుకు వెళ్లడం లేదన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌ను విలీనం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.
దశాబ్ది వేడుకలకు సోనియాను ఆహా్వనించిన రేవంత్‌రెడ్డి, తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలకపాత్ర పోషించిన బీజేపీ నాయకులను ఎందుకు ఆహా్వనించలేదని ప్రశ్నించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment