పరీక్షలను రీషెడ్యూల్‌ చేయండి | Bandi Sanjay Letter To CM Revanth On Group1 Exams | Sakshi
Sakshi News home page

పరీక్షలను రీషెడ్యూల్‌ చేయండి

Published Mon, Oct 21 2024 5:54 AM | Last Updated on Mon, Oct 21 2024 5:54 AM

Bandi Sanjay Letter To CM Revanth On Group1 Exams

సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ఉద్యోగాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం కలిగేలా రూపొందిన జీవో 29ను వెంటనే ఉపసంహరించుకోవాలని, గ్రూప్‌–1 పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెల్లవారితే పరీక్ష అని తెలిసి కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారంటే.. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని లేఖలో కోరారు. నిరుద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి, వారి డిమాండ్‌ మేరకు మార్పులు చేయాలన్నారు.

జీవో 29 వల్ల 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారని.. 563 పోస్టులకు గుండుగుత్తగా 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం అన్యాయమని సంజయ్‌ పేర్కొన్నారు. ఓపెన్‌ కేటగిరీలో అర్హత సాధించిన రిజర్వ్‌డ్‌ అభ్యర్థులను.. రిజర్వ్‌ కేటగిరీలో చేర్చడం అన్యాయమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. పరీక్షలను రీషెడ్యూల్‌ చేయని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తుండటాన్ని గుర్తించాలని లేఖలో కోరారు. అసలు రిజర్వేషన్లనే రద్దు చేస్తున్నారన్న చర్చకు ఈ జీవో దారితీసిందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement