ఎంపీ బండి సంజయ్‌కుమార్
8న ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపు
వేములవాడ/సిరిసిల్లటౌన్: ఫోన్ ట్యాపింగ్స్‌లో బీఆర్‌ఎస్.. వీడియోల మార్ఫింగ్స్‌లో కాంగ్రెస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం వేములవాడలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం స్థానికంగా ఓ హోటల్‌లో జరిగింది.
ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ ఈనెల 8న వేములవాడకు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఉదయమే ప్రధాని సభ ఉంటుందని, ఎన్నికల కోడ్ వల్ల ఎలాంటి ఆటంకాలు ఉండకుంటే రాజన్నను తప్పకుండా దర్శించుకుంటారని చెప్పారు. పదేళ్ల కాలంలో రాష్ట్రంలో నీచ రాజకీయాలు జరిగాయని, సభ్యసమాజం తలదించుకునేలా బీఆర్‌ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు.
ఇక కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియోలు తయారు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లను బీజేపీ పక్కాగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ సంజయ్‌తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు బైపాస్‌రోడ్డులోని పలు ఖాళీ స్థలాలను పరిశీలించారు. రెండు రోజుల్లో సభ స్థలాన్ని ఫైనల్ చేస్తామని వారు చెప్పారు.
రేవంతన్నా.. నా గుండుతో నీకేమన్నా..
‘రేవంతన్నా.. నా గుండుతో నీకేం పనన్నా.. నేను ఆరు గ్యారంటీల గురించి అడిగితే గుండు.. అరగుండు’అంటూ అవహేళనగా మాట్లాడుతున్నావని ఎంపీ బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాత్రి సిరిసిల్లకు వచ్చిన బండి గట్టి కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి భాషను చూసి జనాలు అసహ్యించుకుంటున్నారన్నారు. మీరు ఎన్ని అవాకులుచవాకులు మాట్లాడినా కరీంనగర్‌లో తాను భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, గంగాడి మనోహర్‌రెడ్డి, గండ్ర నళిని, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment