సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: మాజీ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సంజయ్.. బోయిన్‌పల్లి వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్‌ఎస్‌ను మూసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని సవాల్ విసిరారు. సీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరని మండిపడ్డారు. హిందువులను కేసీఆర్ కించపరుస్తున్నారని, ఆయనకు తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.
సిరిసిల్లలో శుక్రవారం బండి సంజయ్ మాట్లాడుతూ.. తనను ఓడిచేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారని అన్నారు. హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తన వెనక 80శాతం హిందువులున్నారని అన్నారు. 20 శాతం ఓట్లు కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా అని మండిపడ్డారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బుద్ది చెప్పాలని తెలిపారు.
'కేటీఆర్ నోటి నుంచి జై శ్రీరాం మాటే రాదు. కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది. ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తవా?. కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరు. రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకునే మోసగాడు. ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చ ర్చకు సిద్ధమా?
తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిన చరిత్ర మోదీదే. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?.చర్చకు సిద్ధమైతే... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆధారాలు నిరూపిస్తాం. కేసీఆర్‌తో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నం. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయ్. ఓటుకు రూ.5 వేలు ఒకరు. రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నయ్. అయినా కరీంనగర్ ప్రజలంతా నావైపే ఉన్నారు..
సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా.. బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా?. విద్యుత్ బిల్లుల్లో, యార్న్ పై సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా? రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది? తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత మాది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసే బాధ్యత నాది. కేటీఆర్ సభలో ప్రశ్నించిన హిందుత్వ వాదుల అరెస్ట్‌ను ఖండిస్తున్నా’ అని మండిపడ్డారు బండి సంజయ్.
Comments
Please login to add a commentAdd a comment