కాంగ్రెస్‌లోకి ఫిరాయింపులపై సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్
ఇదేనా మీ పాంచ్ న్యాయ్?.. బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ అడుగులు
బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయడం లేదు
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చూపుతుందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించే ప్రజాప్రతినిధులను అనర్హులను చేస్తామంటూ ‘పాంచ్ న్యాయ్’పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి ఫిరాయింపులపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చేత రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్ చేశారు.పార్టీ ఫిరాయింపులు, అవినీతి, అక్రమాలు, హామీలు అమలు చేయకుండా మోసం చేసే విషయంలో కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌కు తేడా లేదని విమర్శించారు.
బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘మోదీ సర్కార్ వచ్చాక గోకుల్ చాట్ పేలుళ్లు లేవు. లుంబిని పార్కు బాంబు బ్లాస్ట్‌లు లేవు. ఉగ్రవాదుల ఊచకోతలు లేవు. నక్సలైట్ల అర్ధరాత్రి హత్యలు లేవు. దేశం ప్రశాంతంగా ఉంది. దేశ భద్రత మా ప్రథమ కర్తవ్యం.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏది?
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ వాళ్లకు మాత్రం ఉద్యోగాలు దొరికాయి. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వని కాంగ్రెస్ సర్కార్.. మిగతా 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తుందో చెప్పాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకొనందుకే లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయని కాంగ్రెస్ అధిష్టానానికి డౌట్ వచ్చింది. అందుకే కురియన్ కమిటీ వచ్చి హమీల అమలుపై కసరత్తు చేస్తున్నట్టుంది.
బీజేపీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లకు నిధులివ్వరా?
రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదు. నిధుల పంపిణీ బాధ్యతను అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు అప్పగించడం దుర్మార్గం. ఇది ప్రజాతీర్పును, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. రాష్ట్రంలో కాంగ్రెస్ మాదిరిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. రాజకీయాలకు, పారీ్టలకు అతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమాన ప్రాధాన్యత, నిధుల కేటాయింపు జరపాలి.
చిత్తశుద్ధితో పనిచేయాలి
విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నాం. అయితే చిత్తశుద్ధితో ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఇక కొందరు గోతికాడ నక్కలా సీఎంల భేటీని అడ్డుపెట్టుకుని మళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వొద్దు. తెలంగాణ బిడ్డగా నా అభిప్రాయాలు నాకు ఉంటాయి. కానీ భారత ప్రభుత్వ ప్రతినిధిగా నేను రెండు రాష్ట్రాలను సమంగా చూడాల్సి ఉంటుంది. సమస్యల పరిష్కారానికి బాధ్యతతో కృషి చేస్తా.
రేవంత్, ఒవైసీ కుమ్మక్కయ్యారు
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచి్చనా బీజేపీ గెలుపు ఖాయం. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజాసమస్యలను ప్రస్తావించిన బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం నేతల దాడి హేయమైన చర్య. సీఎం రేవంత్‌తో ఒవైసీ కుమ్కక్కై దాడులకు పాల్పడుతున్నారు. బీజేపీ తలచుకుంటే ఎంఐఎం నేతలు బయట తిరగలేరు..’’అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కేకే ఒక్కడితోనే ఎలా రాజీనామా చేయిస్తారు?
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ రాజ్యసభ స భ్యుడు కె.కేశవరావు ఒక్కరితోనే ఎట్లా రాజీనామా చేయిస్తారు? నిజంగా కాంగ్రెస్ ప్రజా పాలన మీద అంత నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. కాంగ్రెస్‌లోకి 26 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వారందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళితే.. ఆ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. బీజేపీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలెవరైనా రాజీనామా చేసి చేరాల్సిందే. గతంలో హుజూరాబాద్, మును గోడు ఎమ్మెల్యేలు రాజీనామా చేశాకే బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment