సాక్షి,ఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్‌ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, సురేష్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్ ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల ముందు కవిత అరెస్టు జరిగిందన్నారు.
నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమను సరెండర్ చేసుకునేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టాలనే అనే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఎంపీ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని చీల్చేందుకు ఉద్యమ సమయంలో కూడా ఇవే ప్రయత్నాలు చేశారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ సాధించామని, ఇప్పుడు కూడా కేసుల నుంచి క్లీన్‌గా బయటపడతామని చెప్పారు.
ఎంపీ వద్దీరాజు రవిచంద్ర మాట్లాడుతూ కవిత బాధితురాలే తప్ప, నిందితురాలు కాదన్నారు. ఆమె కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవితను అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ చర్యలను ప్రజలు ఎన్నికల్లో తిప్పి కొట్టడం ఖాయమన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను దొంగల్లా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment