కవిత అరెస్ట్‌, ఫోన్‌ ట్యాపింగ్‌పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

కవిత అరెస్ట్‌, ఫోన్‌ ట్యాపింగ్‌పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Mar 26 2024 3:05 PM

KTR Sensational Words On Kavitha Arrest And Phone Tapping Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. 

అధికార కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కవితను అరెస్ట్ చేయలేదు. కాబట్టి  బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే అంటూ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. నేడు పగబట్టి కవితను అరెస్ట్‌ చేశారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటది ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే అంటూ కాంగ్రెస్‌ చేసిన  దుష్ప్రచారాన్ని హైదరాబాద్‌లో  ఎవరూ నమ్మలేదని అన్నారు.

దానం అవకాశవాది
పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్‌ పార్టీ మారి తప్పు చేశాడని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడని, ఆయనకు ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రెండు పడవల మీద నడవడం మంచిది కాదని హితవు పలికారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దానంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అనర్హత వేటు వేయకపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయన్ను అనర్హుడిగా ప్రకటింపజేస్తామని చెప్పారు.

మనకు పోటీ బీజేపీతోటే..
‘సికింద్రాబాద్ లో మనకి పోటీ బీజేపీతోనే. కాంగ్రెస్ మనకు పోటీ కాదు. కిషన్ రెడ్డి సికింద్రబాద్‌లో ఎంపీగా ఉండి చేసిందేమీ లేదు. అంబర్ పేటలో పోటీ చేయకుండా భయపడి వెళ్ళాడు. ఈ సారి కిషన్ రెడ్డికి సానుభూతి లేదు. కరోనా సమయంలో కుర్ కురేలు పంచాడు. అతన్ని చాలామంది కిషన్ రెడ్డి అనటం లేదు. కుర్ కురె రెడ్డి అంటున్నారు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే కిషన్ రెడ్డి మాత్రం రైల్వే స్టేషన్‌లో లిఫ్టులు ప్రారంభం చేస్తున్నాడు. అంబర్ పేట ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్‌లు పూర్తి చేయించలేని పరిస్థితిలో కిషన్ రెడ్డి ఉన్నాడు . 

బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ఇక్కడి నుంచే మళ్లీ ప్రారంభం
సికింద్రాబాద్‌లో విఫలమైన ఎంపీ కిషన్ రెడ్డి, ఎటు అధికారం ఉంటే అటు పోయే దానం నాగేందర్, వ్యక్తిత్వం, సాయపడే గుణం ఉన్న పద్మారావు పోటీలో ఉన్నారని కేటీఆర్‌ తెలిపారు. కిషన్‌ రెడ్డిని ఓడించి ప్రధాని మోదీకి స్పష్టమైన సందేశం పంపాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. పద్మారావు గౌడ్‌ గెలుపుతో బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని చెప్పారు.. 

కాంగ్రెస్‌కు 40 కూడా రావు..
బీజేపీ, మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యం. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా.. బీజేపీనా అర్థం కావడం లేదు. చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటే.. రేవంత్ బడే భాయ్ అంటారు. నరేంద్ర మోదీ చోటా భాయ్ రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్‌ను పొగుడుతారు. రేవంత్ బీజేపీ పాట పాడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావు. 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డినే. జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటా అని సీఎం ఎందుకు చెప్పడం లేదు? లంకెబిందెల కోసం అర్ధరాత్రి దొంగలు తిరగతారు. పేగులు మెడలో వేసుకుంటా అంటారు.. ముఖ్యమంత్రివా, బోటీ కొట్టేవారా? జేబులో కత్తెర పెట్టుకొని తిరిగే వాళ్ళు పక్కా జేబు దొంగలు. జేబులో కత్తెర ఉంటే ఏమైనా అయితే జాగ్రత్త. 

భయపడేవాళ్లు లేరు
లిక్కర్‌ స్కాంలో అన్ని బయట పెడతామని కిషన్ రెడ్డి అంటున్నారు... కోర్టుకు ఇవ్వండి ఎవరు వద్దన్నారు? పనిచేయ చేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారు. అధికారంలో ఉన్నారు, తప్పు జరిగితే విచారణ చేసి చర్యలు తీసుకోండి. భయపడే వాళ్లు లేరు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు రూ 2,500 కోట్లు సిద్దం చేశారు. అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు అపారు? హైదరాబాద్ లో 8 లక్షల కుటుంబాలకు మంచినీటి బిల్లుల భారం మోపారు... బీఆర్‌ఎస్‌ తరపున పోరాడతాం. కాంగ్రెస్ నమ్ముకొన్నది అబద్దాల ప్రచారం మాత్రమే. జై శ్రీరాం ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ, రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం భావ్యం కాదు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement