రీషెడ్యూలును అడ్డుకుంటున్నట్లు పదిరోజుల్లో నిరూపించండి | ysrcp leader pardhasaradhi fire on tdp | Sakshi
Sakshi News home page

రీషెడ్యూలును అడ్డుకుంటున్నట్లు పదిరోజుల్లో నిరూపించండి

Published Mon, Aug 11 2014 2:07 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

రీషెడ్యూలును అడ్డుకుంటున్నట్లు  పదిరోజుల్లో నిరూపించండి - Sakshi

రీషెడ్యూలును అడ్డుకుంటున్నట్లు పదిరోజుల్లో నిరూపించండి

ఏపీ మంత్రులకు వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి సవాల్
నిరూపించకుంటే పదవి నుంచి తప్పుకోవాలి
ఇష్టం వచ్చిన ఏజెన్సీలతో విచారణ జరిపించండి
రుణమాఫీ కోరినందుకు జగన్ బొమ్మలు తగులబెడతారా!

 
వ్యవసాయ రుణాల రీషెడ్యూలును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకుంటున్నట్లు ఆరోపిస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు పది రోజుల్లో ఆ విషయాన్ని నిరూపించాలని, లేకుంటే ఆరోపణలు చేస్తున్న మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాలని పార్టీ సీనియర్ నేత కె.పార్థసారథి సవాలు విసిరారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రిజర్వు బ్యాంకుకు జగన్‌మోహన్‌రెడ్డి తప్పుడు సమాచారం పంపుతున్నారని ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసంబద్ధమైన ఆరోపణలు చేశారని, నిజంగా వారికి దమ్మూ, ధైర్యం ఉంటే వాటిపై వారికి ఇష్టం వచ్చిన ఏజెన్సీలతో విచారణ జరిపించి పది రోజుల్లోగా నిరూపించాలన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీలు, చేసిన సంతకాలు నిలబెట్టుకోలేక ఇపుడు జగన్‌పై నెపం వేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఏపీ మంత్రులతో మరిన్ని అబద్ధాలను చెప్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల రుణమాఫీపై ప్రతిపక్షనాయకుడుగా జగన్ ప్రశ్నిస్తుంటే.. అధికారపక్షం ఎదురుదాడికి దిగుతోందన్నారు. సమావేశంలోని మరిన్ని విషయాలు ఆయన మాటల్లో..

► కేంద్రంలో ఉన్నది టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే, జాతీయ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేసేవే కనుక నిజంగా జగన్ కలెక్టర్ నివేదికల పేరిట సమాచారం పంపి ఉంటే నిరూపించాలి.

► రైతులకు పెట్టుబడులు కావాల్సిన ప్రస్తుత తరుణంలో పాత రుణాలు చెల్లిస్తే గానీ బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వబోమంటున్నాయి. ఇదే విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా తాము ప్రస్తావిస్తే మాపై అభాండాలు వేస్తారా?

► రుణమాఫీకి జగన్ అడ్డుపడుతున్నారని అనంతపురం జిల్లాలో చంద్ర దండు పేరుతో కొందరు బొమ్మలు ఎందుకు తగులబెడుతున్నారు. రుణమాఫీ చేయాలని జగన్ చెప్పడం తప్పా?

► అప్పులు కట్టొద్దని ఎన్నికల్లో టీడీపీ చేసిన ప్రచారం ఫలితంగానే ఈరోజు రైతులు రుణాలు చెల్లించలేదు. ఆరోజు ఇచ్చిన అబద్ధపు హామీ ఫలితంగానే ఈరోజు రైతులు రుణాలు దొరక్క ఇక్కట్ల పాలవుతున్నారు. రుణమాఫీ అని ఎన్నికల్లో చెప్పి ఇపుడు రీషెడ్యూలు గురించి మాట్లాడ్డం వింతగా ఉంది.

► రీషెడ్యూలు చేస్తే రైతుల బంగారం, డాక్యుమెంట్లు వారి చేతికి వెనక్కి వస్తాయా? వాస్తవానికి రీషెడ్యూలు మూడేళ్లు ఉంటుంది. ఏడాదికి 12 శాతం చొప్పున 36 శాతం వడ్డీ ఆ రుణంపై పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తానంటున్న లక్షన్నర రూపాయల రుణంపై ఏడాదికి రూ. 18 వేలు వడ్డీ అవుతుంది. అది మూడేళ్లకు రూ. 54 వేలవుతుంది. ఈ వడ్డీ ఎవరు కడతారు, ప్రభుత్వమా? రైతులా?
 తన పోరాటం వల్లే గతంలో యూపీఏ రుణాలు మాఫీ చేసిందని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఇపుడు ఏన్డీఏ ప్రభుత్వంపై ఎందుకు పోరాడటం లేదు.

► నారుమళ్లు వేసుకోవడానికే నీరు ఇవ్వలేని స్థితిలో ఉన్న చంద్రబాబు ఇక వ్యవసాయాన్ని పండుగ చేస్తాననడం హాస్యాస్పదమే.
 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా డెల్టాకు జూన్, జూలై మాసాల్లోనే సాగునీరు ఇచ్చే వారని, ఇపుడు ఆగస్టు పదోతేదీ వస్తున్నా సాగునీరు వదిలే దిక్కు లేకుండా పోయింది.

► సాగునీటి మంత్రిగా ఈ విషయమై సిగ్గుపడాల్సింది పోయి ఆషాఢభూతిలాగా ఆరోపణలు చేస్తున్నారు.
 
రుణ మాఫీ సంగతి తేల్చండి

అధికారంలోకి వచ్చాక మీరు చేయాల్సిన పని చేయకుండా తమ పార్టీపై విమర్శలు చేయడమేంటని పార్థసారథి బాబును ప్రశ్నించారు. ‘ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా రుణ మాఫీ చేయండి. రుణ మాఫీ చేయకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? మధ్యలో ఈ ఆర్‌బీఐ గొడవెందు కు? ఆర్బీఐ ఒప్పుకుంటేనే రుణ మాఫీ చేస్తామనో, కేంద్రం ఒప్పుకుంటేనే రుణ మాఫీ చేస్తామనో ఎన్నికల ముందు చెప్పలేదే? మీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలే ఎక్కడా చెప్పలేదే? ఎన్నికలకు ముందు ఈ షరతులేమీ చెప్పలేదే? ఇప్పుడు మాఫీ సంగతి మాట్లాడకుండా ఈ డొంకతిరుగుడు వ్యవహారమెందుకు? రాష్ట్రంలో రూ.87,612 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలుండగా, 35 కోట్ల మేరకే మాఫీ చేస్తామని చెప్పిందెవరు? మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని స్వయంగా మీరే కదా  ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ ఏదో ఫ్యాక్స్‌లు చేసిందని పచ్చి అబద్ధపు మాట లు చెప్పి ఎందుకు రైతులను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు? అబద్ధపు ప్రచారాలతో కాలం వెళ్లబుచ్చుతూ నమ్మి ఓట్లేసిన రైతులందరినీ నట్టేట ముంచుతారా’ అని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement