Loans re-scheduled
-
రేటుపైనా వేటు!
వరుస వైపరీత్యాలు.. ఎరువులు, విత్తనాల సమస్యలు.. రుణాలు రీషెడ్యూల్ కాక తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు.. ఇలా ఎన్నో అవరోధాలను అధిగమించి.. ఆరుగాలం శ్రమించి వరి పండించిన ఖరీఫ్ రైతు చివరికి ధర విషయంలోనూ దగాకు గురవుతున్నాడు. ప్రధానంగా లెవీ సేకరణ నిబంధనలను ప్రభుత్వం మార్చేయడం.. ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రాకపోవడం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు చాలాచోట్ల ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కడా లభించడం లేదు. దిగుబడులు తగ్గిన నేపథ్యంలో కనీసం మద్దతు ధరైనా లభిస్తే కొంతలో కొంతైనా గట్టెక్కవచ్చన్న అన్నదాత ఆశలు హరించుకుపోతున్నాయి. శ్రీకాకుళం అగ్రికల్చర్:ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులు మద్దతు ధరకు నోచుకోక దిగాలు పడుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా ఆ రేటు ఎక్కడా లభించడం లేదు. ఎఫ్‌సీఐ లెవీ సేకరణ నిబంధనలు మార్చి 25 శాతం మా త్రమే లెవీగా తీసుకుంటామని ప్రకటించడం రైతు ల పాలిట శాపంగా పరిణమించింది. మిగతా బియ్యం తామెక్కడ అమ్ముకోగలమంటూ మిల్లర్ల మిల్లర్లు చేతులెత్తేస్తుండటంతో రైతులకు మద్దతు ధర లభించడం కష్టంగా మారింది. ఎలా చూసినా నష్టమే ఖరీఫ్ ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాలు రూ. 1400 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. అంటే బస్తా(75కేజీలు)కు రూ. 1050 రావాల్సి ఉంది. అలాగే సాధారణ రకానికి రూ. 1360గా నిర్ణయించడంతో బస్తాకు రూ. 1020 రావల్సి ఉంది. జిల్లా రైతులు ఈ ఏడాది ఎక్కువగా స్వర్ణ, 1001 రకాలు సాగు చేశారు. సాధారణ రకమైన ప్రభుత్వం ప్రకటించిన మేరకు బస్తాకు రూ. 1020 రేటు అందాల్సి ఉండగా.. ప్రస్తుతం పొలం వద్ద రూ. 820కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అదే మిల్లుకు చేర్చితే రూ. 870 వరకు ఇస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ధాన్యంలో 24 శాతం వరకు తేమ ఉంటున్నందునే ధర తగ్గించి కొంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. తేమ 20 శాతం లోపు ఉంటే బస్తాకు మరో రూ. వంద వరకు ఆదనంగా చెల్లిస్తున్నారు. ఇలా అయినా రైతులకు మద్దతు ధర దూరమే. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా బస్తాకు రూ. 200 తక్కువగా లభిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది అమ్మడం మాని ధర పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. వ్యాపారుల ఇష్టారాజ్యం ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాలో 100 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించింది. వరి కోతలు దాదాపు చివరి దశకు చేరుకున్నా ఇప్పటి వరకు సగం కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన కేంద్రాల్లో పాత నిబంధనలనే అమలు చేస్తున్నారు. ప్రధానంగా తేమ 17 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేయాలని, లేకుంటే కేంద్రం నిర్వాహకులు నష్టపోతారని ఉన్నతాధికారులు హెచ్చరించారు. సాధారణంగా ఖరీఫ్ ధాన్యంలో కనీసం 20 శాతం తేమ ఉంటుంది. పైగా తాలుతప్పులు ఒక శాతం మించకూడదనే మరో నిబంధన ఉంది. సుడి దోమ, ఇతర తెగుళ్లు ఆశించడం వల్ల తాలు గింజలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు దాదాపు అసాధ్యమే. ఇదే అవకాశంగా తేమ వంకతో ధాన్యం వ్యాపారులు మద్దతు ధరను గాలికి వదలి, ఇష్టారాజ్యంగా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఆది నుంచీ ఒడిదుడుకులే.. ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆది నుంచి ఒడిదుడుకులతోనే సాగుతోంది. వర్షాభావం వల్ల సాగు ఆలస్యమైంది. పంట చేతికందే సమయంలో హుద్‌హుద్ తుపాను, ఆ వెంటనే సుడిదోమ తెగులు నిలువునా ముంచేశాయి. వీటన్నింటి వల్లా రైతులు ఎకరాకు 10 నుంచి 15 బస్తాల వరకు దిగుబడి కోల్పోయారు. జిల్లాలో సగటు దిగుబడి 28 బస్తాలు కాగా.. చాలా చోట్ల 10 నుంచి 15 బస్తాలకే పరిమితమవుతోంది. అంటే పరిస్థితి ఎంత నిరాశాజనకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడి కూడా ఈ ఏడాది రెట్టింపైంది. దోమ, తెగుళ్ల అదుపునకు రైతులు వేలాది రూపాయలు వెచ్చించారు. చివరికి ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా రాకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. -
రీషెడ్యూలును అడ్డుకుంటున్నట్లు పదిరోజుల్లో నిరూపించండి
ఏపీ మంత్రులకు వైఎస్సార్సీపీ నేత పార్థసారథి సవాల్ నిరూపించకుంటే పదవి నుంచి తప్పుకోవాలి ఇష్టం వచ్చిన ఏజెన్సీలతో విచారణ జరిపించండి రుణమాఫీ కోరినందుకు జగన్ బొమ్మలు తగులబెడతారా! వ్యవసాయ రుణాల రీషెడ్యూలును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నట్లు ఆరోపిస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు పది రోజుల్లో ఆ విషయాన్ని నిరూపించాలని, లేకుంటే ఆరోపణలు చేస్తున్న మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాలని పార్టీ సీనియర్ నేత కె.పార్థసారథి సవాలు విసిరారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రిజర్వు బ్యాంకుకు జగన్మోహన్రెడ్డి తప్పుడు సమాచారం పంపుతున్నారని ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసంబద్ధమైన ఆరోపణలు చేశారని, నిజంగా వారికి దమ్మూ, ధైర్యం ఉంటే వాటిపై వారికి ఇష్టం వచ్చిన ఏజెన్సీలతో విచారణ జరిపించి పది రోజుల్లోగా నిరూపించాలన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీలు, చేసిన సంతకాలు నిలబెట్టుకోలేక ఇపుడు జగన్‌పై నెపం వేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఏపీ మంత్రులతో మరిన్ని అబద్ధాలను చెప్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల రుణమాఫీపై ప్రతిపక్షనాయకుడుగా జగన్ ప్రశ్నిస్తుంటే.. అధికారపక్షం ఎదురుదాడికి దిగుతోందన్నారు. సమావేశంలోని మరిన్ని విషయాలు ఆయన మాటల్లో.. ► కేంద్రంలో ఉన్నది టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే, జాతీయ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేసేవే కనుక నిజంగా జగన్ కలెక్టర్ నివేదికల పేరిట సమాచారం పంపి ఉంటే నిరూపించాలి. ► రైతులకు పెట్టుబడులు కావాల్సిన ప్రస్తుత తరుణంలో పాత రుణాలు చెల్లిస్తే గానీ బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వబోమంటున్నాయి. ఇదే విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా తాము ప్రస్తావిస్తే మాపై అభాండాలు వేస్తారా? ► రుణమాఫీకి జగన్ అడ్డుపడుతున్నారని అనంతపురం జిల్లాలో చంద్ర దండు పేరుతో కొందరు బొమ్మలు ఎందుకు తగులబెడుతున్నారు. రుణమాఫీ చేయాలని జగన్ చెప్పడం తప్పా? ► అప్పులు కట్టొద్దని ఎన్నికల్లో టీడీపీ చేసిన ప్రచారం ఫలితంగానే ఈరోజు రైతులు రుణాలు చెల్లించలేదు. ఆరోజు ఇచ్చిన అబద్ధపు హామీ ఫలితంగానే ఈరోజు రైతులు రుణాలు దొరక్క ఇక్కట్ల పాలవుతున్నారు. రుణమాఫీ అని ఎన్నికల్లో చెప్పి ఇపుడు రీషెడ్యూలు గురించి మాట్లాడ్డం వింతగా ఉంది. ► రీషెడ్యూలు చేస్తే రైతుల బంగారం, డాక్యుమెంట్లు వారి చేతికి వెనక్కి వస్తాయా? వాస్తవానికి రీషెడ్యూలు మూడేళ్లు ఉంటుంది. ఏడాదికి 12 శాతం చొప్పున 36 శాతం వడ్డీ ఆ రుణంపై పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తానంటున్న లక్షన్నర రూపాయల రుణంపై ఏడాదికి రూ. 18 వేలు వడ్డీ అవుతుంది. అది మూడేళ్లకు రూ. 54 వేలవుతుంది. ఈ వడ్డీ ఎవరు కడతారు, ప్రభుత్వమా? రైతులా? తన పోరాటం వల్లే గతంలో యూపీఏ రుణాలు మాఫీ చేసిందని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఇపుడు ఏన్డీఏ ప్రభుత్వంపై ఎందుకు పోరాడటం లేదు. ► నారుమళ్లు వేసుకోవడానికే నీరు ఇవ్వలేని స్థితిలో ఉన్న చంద్రబాబు ఇక వ్యవసాయాన్ని పండుగ చేస్తాననడం హాస్యాస్పదమే. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా డెల్టాకు జూన్, జూలై మాసాల్లోనే సాగునీరు ఇచ్చే వారని, ఇపుడు ఆగస్టు పదోతేదీ వస్తున్నా సాగునీరు వదిలే దిక్కు లేకుండా పోయింది. ► సాగునీటి మంత్రిగా ఈ విషయమై సిగ్గుపడాల్సింది పోయి ఆషాఢభూతిలాగా ఆరోపణలు చేస్తున్నారు. రుణ మాఫీ సంగతి తేల్చండి అధికారంలోకి వచ్చాక మీరు చేయాల్సిన పని చేయకుండా తమ పార్టీపై విమర్శలు చేయడమేంటని పార్థసారథి బాబును ప్రశ్నించారు. ‘ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా రుణ మాఫీ చేయండి. రుణ మాఫీ చేయకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? మధ్యలో ఈ ఆర్బీఐ గొడవెందు కు? ఆర్బీఐ ఒప్పుకుంటేనే రుణ మాఫీ చేస్తామనో, కేంద్రం ఒప్పుకుంటేనే రుణ మాఫీ చేస్తామనో ఎన్నికల ముందు చెప్పలేదే? మీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలే ఎక్కడా చెప్పలేదే? ఎన్నికలకు ముందు ఈ షరతులేమీ చెప్పలేదే? ఇప్పుడు మాఫీ సంగతి మాట్లాడకుండా ఈ డొంకతిరుగుడు వ్యవహారమెందుకు? రాష్ట్రంలో రూ.87,612 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలుండగా, 35 కోట్ల మేరకే మాఫీ చేస్తామని చెప్పిందెవరు? మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని స్వయంగా మీరే కదా ప్రకటించింది. వైఎస్సార్సీపీ ఏదో ఫ్యాక్స్‌లు చేసిందని పచ్చి అబద్ధపు మాట లు చెప్పి ఎందుకు రైతులను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు? అబద్ధపు ప్రచారాలతో కాలం వెళ్లబుచ్చుతూ నమ్మి ఓట్లేసిన రైతులందరినీ నట్టేట ముంచుతారా’ అని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పూర్తి వివరాలు ఇవ్వండి: ఆర్బీఐ
* రుణాల రీ షెడ్యూల్‌పై మరింత సమాచారం కోరిన ఆర్బీఐ * ఎస్ఎల్బీసీ సహకారం కోరిన హైదరాబాద్ ఆర్బీఐ శాఖ * ముందు రీషెడ్యూల్కు అనుమతి కోసం ఆర్బీఐకి లేఖ రాయనున్న సీఎం బాబు సాక్షి, హైదరాబాద్: రుణాల రీషెడ్యూలు విషయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రాష్ట్రం నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడింది. గత ఖరీఫ్‌లో కరవు, తుపాను ప్రభావిత మండలాల్లో రుణాల రీ షెడ్యూల్‌ను ప్రభుత్వం కోరుతుండగా.. ఆ మండలాల్లో రుణాల రీ షెడ్యూల్‌ను అనుమతించడంపై ఆర్బీఐ(ముంబాయి) మరిన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ వివరాలను పంపాల్సిందిగా హైదరాబాద్‌లోని ఆర్బీఐ శాఖను కోరింది. మండలాల వారీగా రుణాల మంజూరు వివరాలతో పాటు.. సాగు చేసిన పంటలు, వాటికి మంజూరు చేసిన రుణాలు, ఆ పంటల దిగుబడి.. తదితర వివరాలను అందించాల్సిందిగా స్థానిక ఆర్బీఐ శాఖను కోరింది. దాంతో ఆ వివరాలు అందివ్వాల్సిందిగా స్థానిక ఆర్బీఐ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ)ని కోరడంతో వారు రాష్ట్రంలోని వివిధ బ్యాంకు బ్రాంచీలను ఆ సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రెండు మూడు మండలాలకు చెందిన రుణాల మంజూరు వివరాలు మాత్రం ఉన్నాయని బ్రాంచీలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా మంజూరు చేసిన రుణాల వివరాలను మాత్రం ఇవ్వగలమని, మండలాల వారీగా ఆ వివరాలివ్వలేమని బ్యాంకర్ల కమిటీ హైదరాబాద్‌లోని ఆర్బీఐకి లేఖ రాసింది. ముందు అనుమతివ్వండి! మండలాల వారీగా రుణాల మంజూరు సమాచారం అందే వరకు ఆర్బీఐ నుంచి రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దీంతో మండలాల వారీ సమాచారం అంతా ఇవ్వాలంటే చాలా సమయం పడుతుందని, తొలుత రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్బీఐకి లేఖ రాయాలని భావిస్తున్నారు. గత ఖరీఫ్‌లో కరవు, తుపాను ప్రభావిత ప్రాంతాలుగా 572 మండలాలను ప్రకటించామని, అయితే 90 రోజుల దాటిన తరువాత జీవో విడుదల చేశామని, ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదని, ఇదే సమయంలో ఒరిస్సాలో కూడా తుపాను వచ్చిందని, అక్కడ రుణాలు రీ షెడ్యూల్ చేశారని ఆర్బీఐకి రాయనున్న లేఖలో సీఎం వివరించనున్నారు. రుణాలు రీ షెడూల్‌కు అనుమతిం చాలని, 572 మండలాల్లో రుణాలు 10,500 కోట్ల రూపాయలున్నాయని బాబు వివరించనున్నారు.