సాక్షి, విజయవాడ సిటీ: బీసీలంటే సీఎం చంద్రబాబుకు ఎంత అలుసో మరోసారి తేటతెల్లమైందని.. ఆయన నిజస్వరూపం బయటపడిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. బీసీలు, దళితులు హైకోర్టు జడ్జీలుగా పనికిరారంటూ చంద్రబాబు తప్పుడు నివేదికలు పంపారంటూ జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆధారాలతో సహా చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనే విషయాన్ని వైఎస్సార్‌సీపీ ఎప్పట్నుంచో చెబుతోందన్నారు. చంద్రబాబులో కులతత్వం ఏ స్థాయికి చేరుకుందో జస్టిస్ ఈశ్వరయ్య డాక్యుమెంట్లతో సహా నిరూపించారన్నారు. బీసీ వర్గానికి చెందిన జడ్జీలపై తప్పుడు ఆరోపణలు చేసి.. వారికి చెందాల్సిన అవకాశాలను చంద్రబాబు ఏ వి«ధంగా కాలరాశారో ఈశ్వరయ్య సవిరంగా వివరించారని చెప్పారు. బీసీలైన అమర్‌నాథ్‌గౌడ్, అభినవకుమార్‌తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులపై తప్పుడు నివేదికలు ఎందుకు పంపారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జడ్జీల నియామకాల్లో చంద్రబాబు పోషించిన పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీల్లో ఎవరినైనా ప్రిన్సిపల్ సెక్రటరీలుగా గానీ, డిపార్ట్‌మెంట్ హెడ్‌లుగా గానీ నియమించావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్‌లోని ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని మండిపడ్డారు. బీసీలంటే బాబు గారి క్లాస్ అని.. అందులో లోకేశ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు, ఎల్లో మీడియా మాత్రమే ఉంటాయన్నారు.
కాగా, ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలతో సమావేశమైతే దానిపై ఎల్లో మీడియా దుష్పచారం చేసిందని పార్థసారథి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ వార్తలను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ అంశంపై న్యాయపరంగా పోరాటం చేస్తామని పార్థసారథి తెలిపారు. ఇది ఏరకమైన జర్నలిజమని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment