‘హోదా’పై పోరాడుతోంది జగన్ మాత్రమే
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు బదులిచ్చిన వైఎస్సార్‌సీపీ
* మా అధ్యక్షుడు ప్రధాని, హోం, ఆర్థిక మంత్రులను కలిశారు
* ప్రత్యేకహోదాకోసం మంగళగిరిలో నిరసనదీక్ష చేశారు
* మా పోరాటాలవల్లనే కొందరికైనా న్యాయం దక్కింది
* ప్రత్యేకహోదా, పోలవరంపై మీరేం చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం చూస్తే...
ఆయనకు రాజకీయం తెలియకపోయుండాలి లేదా దురుద్దేశమైనా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారధి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తోందని రాహుల్ చేసిన విమర్శలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై రాహుల్‌గాంధీ, చంద్రబాబు ఎవరూ పట్టించుకోలేదు. ఏడాది కాలంలో ఒక్క అడుగు ముందుకు పడకున్నా మౌనముద్ర దాల్చారు.
రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పోరాడింది మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన ఇప్పటికి రెండుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారు. మూడు నాలుగుసార్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీనీ కలిసి విన్నవించారు. మంగళగిరిలో నిరసన దీక్ష చేపట్టారు. కేంద్రంలో మిత్రపక్షమే అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా ఎం దుకు సాధించలేకపోతున్నారని ముఖ్యమంత్రిని అనేకసార్లు ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా సాధన కోసం వెంటనే కేంద్రం నుంచి టీడీపీ మంత్రులను వైదొలగాలని డిమాండ్ చేశారు’’ అని వివరించారు. ప్రత్యేక హోదాపై పార్లమెం ట్‌లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఏం పోరాటం చేసిందని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఒకసారైనా ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
చంద్రబాబు వైఫల్యాలపై మాట్లాడరేం?
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్రానికొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రైతు ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు గురించి ఒక్కమాట మాట్లాడకుండా వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంద ని పార్థసారధి తప్పుపట్టారు. ‘‘బీజేపీ పెద్దల అవినీతి అంశాలపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలు మాత్రం రాహుల్‌కు కనిపించడం లేదు.
ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటి ‘ఓటుకు కోట్లు’ కేసులో కూరుకుపోయిన చంద్రబాబు గురించి ఒక్కమాట మాట్లాడలేదు. పట్టిసీమ ప్రాజెక్టు అవినీ తి కంపుకొడుతున్నా రాహుల్ కు కనబడలేదు.బాబు కారణంగానే పుష్కరాల్లో 30 మంది చనిపోయారని జాతీయ మీడియా కోడైకూసినా, 22 మంది తమిళులను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపినా రాహుల్‌గానీ, సోనియాగానీ పార్లమెంట్‌లో ప్రస్తావనే తేలేదు’’ అని దుయ్యబట్టారు.దీన్ని బట్టి ఎన్నికల ముందు టీడీపీతో ఉన్న అక్రమ సంబంధాన్ని రాహుల్ ఇంకా కొనసాగిస్తున్నారని అర్థమవుతోందని విమర్శించారు.
జగన్ పోరాటంతోనే కొందరికైనా న్యాయం
‘‘జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో రైతు దీక్ష చే పడితేగానీ ప్రభుత్వం తొలిదశ రుణమాఫీ డబ్బు విడుదల చేయలేదు. ఆయన అల్టిమేటం జారీ చేస్తేగానీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించలేదు. మంగళగిరిలో దీక్ష చేపడితేగానీ డ్వాక్రా మహిళలకు కనీసం రూ. మూడు వేలైనా సాయం దక్కలేదు’’ అని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోవడంవల్ల ఇలాంటివన్నీ రాహుల్‌కు తెలిసి ఉండకపోవచ్చని పార్థసారధి విమర్శించారు.
అనంతపురం జిల్లాలో వందమంది రైతులు చనిపోతే జగన్ మూడోవిడత భరోసాయాత్ర నిర్వహిస్తుంటే... రాహుల్ 14 నెలల తర్వాత నిద్రలేచారన్నారు. రాహుల్ పరామర్శ యాత్ర ఒక వంక మాత్రమేనన్నారు. సొంత సీఎం, మంత్రులు, నేతలందరూ విభజన వద్దని వారించినా వినని వారికి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో ఒక్కసీటు కూడ గెలవని కాంగ్రెస్, 67 సీట్లు గెలిచిన తమకు పోటీ పార్టీగా అస్సలు భావించడం లేదన్నారు.