పచ్చని పొలాలే కావాలా?
రాజధాని భూ సేకరణ తీరుపై వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి ధ్వజం
* 80 శాతం మంది అంగీకరిస్తేనే భూ సేకరణ జరపాలి
* లేదంటే వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది
సాక్షి, హైదరాబాద్: పంటలు అంతగా పండని నాసిరకం భూములు అందుబాటులో ఉన్నా ఏడాది పొడవునా పచ్చని పంటలతో కళకళలాడే పొలాలనే రాజధాని నిర్మాణం కోసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పొలాలను రైతుల నుంచి లాక్కుంటే వాటిపై ఆధారపడిన వేలాది మంది కూలీలు, కౌలు రైతులు, మత్య్సకారులు, కల్లు గీత కార్మికుల జీవనోపాధి ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు.
మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల రైతులు తమ భూములు పోతాయేమోనని తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ఉన్నారని, తమకు అన్నం కూడా సహిం చడం లేదని, రాత్రిపూట నిద్ర కూడా కరవైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతులు, కౌలు రైతులు, కూలీలు తమవద్ద వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలని వివరించారు.
భూములు లాక్కోవడానికి చట్టం తెస్తారా?
2014 నుంచి అమలులోకి వచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం 80 శాతం మంది రైతులు సమ్మతిస్తే గాని ప్రభుత్వం భూసేకరణ చేయడానికి వీల్లేదని, దానినే ఇక్కడ అమలు చేయాలని పార్థసారథి డిమాండ్ చేశారు. భూసేకరణకు ప్రస్తుతమున్న చట్టాన్నే అమలు చేస్తారా లేక తమ భూములను లాక్కోవడానికి చంద్రబాబు మళ్లీ ఏదైనా కొత్త చట్టం తెస్తారా! అని రైతులు హడలి పోతున్నారని ఆయన అన్నారు. ‘రైతులు అత్యాశకు పోతున్నారు.. అవసరమైతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించైనా భూములను తీసుకోవాల్సి వస్తుంది’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే బెదిరించడం రైతులను భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన అన్నారు. రైతులకు నచ్చజెప్పి వారిని సంతృప్తిపర్చే విధంగా ప్యాకేజీలు ఇచ్చి భూసేకరణ చేయాలే తప్ప వారి హక్కులను, ప్రయోజనాలను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే వైసీపీ వారికి అండగా నిలబడి పోరాడుతుందని పార్థసారథి హెచ్చరించారు.