ఆ డబ్బుకు అన్ని లెక్కలున్నాయి: పార్థసారధి
తన భార్య వద్ద స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి అన్ని లెక్కలు ఉన్నాయని మాజీ మంత్రి కె.పార్థసారథి వెల్లడించారు. ఆయన శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్సభ అభ్యర్థి రూ. 70 లక్షలు వరకు ఖర్చు చేసుకోవచ్చని వివరించారు. ఎన్నికల ఖర్చు కోసం కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్లో కొంత మొత్తం నగదు జమ చేయాలని, మరి కొంత మొత్తాన్ని సొంతంగా నిర్వహిస్తున్న కనస్ట్రక్షన్ కోసం చేసిన బకాయిలు చెల్లించడానికి తీసుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా పార్థసారథి సతీమణి కమల హైదరాబాద్ నుంచి నగదుతో విజయవాడకు బయలుదేరారు. వనస్థలిపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా కమల వద్ద ఉన్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను వ్యక్తిగత పూచికత్తుపై విడిచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి కె.పార్థసారథి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.