ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్‌లో జరగనున్నాయి. తదుపరి ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేందుకు అమెరికన్లు సిద్ధమవుతున్నారు. అమెరికా ఎన్నికలను ప్రపంచమంతా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? వారి పదవీకాలం ఎంత? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకున్న నేపధ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వం పార్టీ ముందుకు వచ్చింది. ఆమెకు డెమొక్రాట్లలో ఎవరూ పోటీగా నిలవలేదు. దీంతో ఆమె డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. కాగా అధ్యక్ష పదవికి మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. వీరిలో మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ కుటుంబానికి చెందిన రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ కూడా ప్రధానంగా నిలిచారు. అయితే ఆయన ఆగస్టు చివరిలో తన ప్రచారాన్ని విరమించి, ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. డెమొక్రటిక్ పార్టీ అనేది ఉదారవాద రాజకీయ పార్టీ. పౌరహక్కుల పరిరక్షణ, విస్తృత సామాజిక భద్రత, వాతావరణ మార్పులు తదితర అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.
రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్ 5 న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించినవారు 2025 జనవరి నుండి నాలుగు సంవత్సరాలు అమెరికాను పరిపాలించనున్నారు. రాష్ట్ర ప్రైమరీలు, కాకస్ అని పిలిచే ఓటింగ్ విధానం ద్వారా రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నామినేట్ చేస్తాయి. ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించాలనుకునే అభ్యర్థులను పార్టీ సభ్యులు ఎన్నుకుంటారు. రిపబ్లికన్ పార్టీలో మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో దీనిలో విజయం సాధించారు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన అధికారిక రిపబ్లికన్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీ అనేది కన్జర్వేటివ్ రాజకీయ పార్టీ. దీనిని జీఓపీ అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని పిలుస్తారు. స్వల్ప పన్నులు, ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించడం, తుపాకీ హక్కులు, వలసలు, అబార్షన్‌లపై ఆంక్షలు మొదలైన అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.
విజేతల ఎంపిక ఇలా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వారు విజేతలు కాలేరు. దీనికి బదులుగా అభ్యర్థులు మొత్తం 50 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో కనీసం 270 లేదా అంతకుమించి సాధించినవారు విజేతలుగా నిలుస్తారు. రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థికి ఆ రాష్ట్ర ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లన్నీ లభిస్తాయి. చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఎటు మొగ్గు చూపుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇరు పార్టీలకు ఓట్లు వేయవచ్చు. వీటిని స్వింగ్ రాష్ట్రాలని పిలుస్తారు. అభ్యర్థులు ఈ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టిసారిస్తారు. ఒక అభ్యర్థి ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో మెజార్టీ సాధించడంలో విఫలమై, మొత్తంగా ఎక్కువ ఓట్లు సాధించినా (2016లో హిల్లరీ క్లింటన్‌లా) ఎన్నికలలో గెలవలేరు. అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో మెజార్టీ సాధించడమే కీలకమనేది ఇక్కడ గుర్తించాలి.
అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలి ప్రత్యేక అధికారాలు
సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజు రాత్రే విజేతను ప్రకటిస్తారు. కానీ 2020లో మొత్తం ఓట్లను లెక్కించడానికి కొన్నిరోజుల సమయం పట్టింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జనవరిలో వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం మెట్లపై జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కొన్ని చట్టాలను సొంతంగా ఆమోదించే అధికారం అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలికి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రపంచ వేదికపై అమెరికాకు ప్రాతినిధ్యం వహించేందుకు, విదేశాంగ విధానాన్ని అమలు చేసేందుకు ప్రెసిడెంట్‌కు గణనీయమైన స్వేచ్ఛ ఉంటుంది.
ఇంకెవరు ఎన్నికవుతారు?
ఓటర్లు అమెరికా అధ్యక్షనితో పాటు దేశం కోసం చట్టాలను రూపొందించే కాంగ్రెస్ కొత్త సభ్యులను కూడా తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారు. కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ, సెనేట్ అనే రెండు సభలు ఉంటాయి. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. ప్రస్తుతం రిపబ్లికన్‌లు సభను నియంత్రిస్తున్నారు. ఇది వ్యయ ప్రణాళికలను నిర్వహిస్తుంది. ప్రభుత్వంలో కీలక నియామకాలపై ఓటు వేసే సెనేట్‌లో డెమొక్రాట్లు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ రెండు సభలు చట్టాలను ఆమోదిస్తాయి. రెండు సభలలో నియంత్రణ పక్షం ప్రెసిడెంట్‌తో విభేదిస్తే వైట్‌హౌస్ ప్రణాళికలను అడ్డుకోవచ్చు. అమెరికా పౌరులై ఉండి, 18 ఏళ్లు నిండిన వారు అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు.
ఇది కూడా చదవండి: యూఎస్ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష: ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment