పులిచింతల ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రశ్నించారు.
విజయవాడ: ఏపీ ప్రభుత్వం కేవలం రూ. 170 కోట్లు తెలంగాణకు చెల్లిస్తే, కృష్ణాడెల్టాకు సాగునీటి సమస్య తప్పించే పులిచింతల ఉపయోగంలోకి వచ్చేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి తెలిపారు. పక్క రాష్ట్రానికి చెల్లింపులు జరిపితే, అందులో తమకు ముడుపులు రావనే ఉద్దేశంతోనే చెల్లింపులు జరపడం లేదని ఆయన ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముడుపుల కోసమే పట్టిసీమ చేపట్టారని, పట్టిసీమతో అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు.
చంద్రబాబు సీఎం అయిన తరువాతే కృష్ణా డెల్టా రైతులకు నీళ్లు వచ్చినట్లు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వీలున్న పులిచింతలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మూడేళ్లుగా దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని వివమర్శించారు.