22 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి విడుదల చేస్తున్న అధికారులు
సాగర్ స్పిల్‌వే మీదుగా 22 గేట్ల నుంచి దుముకుతున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్/దోమలపెంట/సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి భారీగా వరద నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం రాత్రి 20 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు మంగళవారం ఉదయం మరో రెండు గేట్లు తెరిచి మొత్తం 22 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సాగర్ నీటిమట్టం 585.40 అడుగుల వద్ద నిల్వ సామర్థ్యం 298.5890కు చేరడంతో ఆరు గేట్లను ఐదు అడుగుల మేర, 16 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దిగువకు 2,70,920 క్యూసెక్కుల నీరు వదిలారు.
మధ్యాహ్నం 2 గంటలకు వరద మరింత పెరగడంతో 22 గేట్లను పది అడుగుల పైకెత్తి 3,09276 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు ఇన్‌ఫ్లో 3,14,594 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 3,54,663కు పెంచారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుతం 585.10 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం జలాశయంలో 297.7235 టీఎంసీల నీరు ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
కుడి, ఎడమ కాల్వలకు నీటి పెంపు..
సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని పెంచారు. కుడి కాల్వకు 8,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఏఎమ్మార్పీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. చెరువులు నింపేందుకు వరద కాల్వకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా అనుముల మండలం మారేపల్లి వద్ద కాల్వకు గండి పడటంతో మంగళవారం ఉదయం వరద కాల్వకు నీటిని నిలిపేశారు. మరోవైపు ఏఎమ్మారీ్పతో పరిధితోపాటు ఆయకట్టు ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటలు వాగులు ఎండిన నేపథ్యంలో ఏఎమ్మార్పీ కాల్వలకు నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని రైతులు కోరుతున్నారు.
పులిచింతల నుంచి 1.08 లక్షల క్యూసెక్కులు విడుదల
పులిచింతల ప్రాజెక్టు సగం నిండిపోవడం.. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పులిచింతలలోకి 3,71,605 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. ప్రాజెక్టులో 157.48 అడుగుల్లో 22.75 టీఎంసీలను నిల్వ చేస్తూ గేట్లు ఎత్తి దిగువకు 1,08,895 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. పులిచింతల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో.. బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న జలాలను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment