పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో 1990 దశకంలో సరళీకృత ఆర్థిక విధానం అమలు చేయటం మొదలు పెట్టగానే అంతవరకు ప్రభుత్వ ఏకస్వామ్య విధానాల వలన రక్షణ పొందిన చాలా రంగాల్లో ప్రైవేట్ రంగ ప్రవేశానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విమానయాన రంగాన్ని కూడా సరళీకరించారు. దానిలో భాగంగా ఆనాడు మోడీ లుఫ్ట్, దమానియా, ఎన్‌ఈపీసీ, జెట్ ఎయిర్‌వేస్ లాంటి విమానయాన సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మూడు నాలుగేళ్లలోనే వాటిలో చాలా సంస్థలు మూతపడినా, జెట్ ఎయిర్‌లైన్స్ మాత్రం అప్పటి నుంచి తన కార్యక్రమాలను సాగిస్తూ, నష్టాల దృష్ట్యా ఒక వారం క్రితం తన విమాన సర్వీసులను నిలిపివేసింది.
జెట్ ఎయిర్‌వేస్‌కు రుణాలు మంజూరు చేసిన సంస్థలు ఉదారంగా కొంత ఆర్థిక సహాయం ఈ సమయంలో అందించి ఉంటే విమాన సంస్థ మూసేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని, పనిచేసే ఉద్యోగులకు ఆసరాగా ఉండేదని, విమానయానంలో ధరలు పెరగకుండా చూడటానికి కూడా తోడ్పడేదని కొందరి వాదన. ఈ వాదన సరికాదు. ఈ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు ఒకరోజు, కొద్ది కాలంలో వచ్చే అంశం కాదు. సంస్థకు ఆర్థిక సమస్యలు చాలాకాలం నుంచే ప్రారంభమై ఉంటాయి. తొలి దశలో రుణాలు మంజూరు చేసిన సంస్థలు సరైన పాత్ర పోషించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడుకునే అవకాశాలు అప్పుడు మెండుగా ఉండేవి. పూర్తిగా మూసివేసే పరిస్థితి వచ్చినప్పుడు రుణ సహాయం చేయడం వల్ల సంస్థ కొన్నాళ్ళు ఆక్సిజన్‌పై బతకడానికి సహాయపడుతుందేమో కానీ సంస్థ పరిస్థితిలో ఎటువంటి మౌలికమైన మార్పు తీసుకొని రావు. ఈనాడు ఇచ్చే సహాయం బూడిదలో పోసిన పన్నీరు గానే మిగిలిపోతుంది. బ్యాంకులు ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని నా భావన.
జెట్ విమానయాన సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధానంగా రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో నిర్వహించిన పర్మిట్ కోటా లైసెన్స్ రాజ్‌లో చాలామంది ఆశ్రిత పక్షపాతం పెట్టుబడిగా ఎదిగిన పెట్టుబడిదారులు ఉన్నారు. రాజకీయ నేతలను, అధికారులను సంతృప్తి పరచడం ద్వారా వారి సహాయ సహకారాలతో వ్యాపార లావాదేవీలు జరిపిన వ్యక్తులు వీరందరూ. వీరు సరళీకృత ఆర్థిక విధానంలో వచ్చే పోటీ పరిస్థితిని తట్టుకుని నిలబడే సామర్థ్యం శక్తి ఉన్న వ్యక్తులు కారు. ఆ కోవకు చెందిన వ్యక్తి జెట్ ఎయిర్‌వేస్ అధినేత. ఇండిగో స్పైస్ జెట్ లాంటి ఆర్భాటం లేని విమానయాన సంస్థల పోటీని ఈయన తట్టుకోలేకపోయారు. ఎక్కువ ధర వెచ్చించి కొన్న సహారా విమాన సంస్థ ఎయిర్ దక్కన్ కింగ్ ఫిషర్ సంస్థకు ఏరకంగా గుది బండ అయిందో జెట్ ఎయిర్‌వేస్‌కీ అట్లాగే అయింది.
వీటన్నిటికీ మించి టికెట్ల అమ్మకం కోసంగా జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఏజెంట్లకు చెల్లించిన రుసుము సంస్థ ఖర్చులలో 12 శాతం ఉంది. ఇండిగో లాంటి సంస్థలకు ఇది రెండు శాతం మాత్రమే. 2017– 18లో రూ.2,826 కోట్లు ఈ పద్దు కింద ఏజెంట్లకు చెల్లించడమైంది. గత నాలుగేళ్లలో ఈ పద్దు కింద కమీషన్‌గా చెల్లించిన మొత్తం రూ. 10 వేల కోట్లు. ఈరోజు ఈ సంస్థ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ మొత్తం కన్నా ఇది ఎక్కువ. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి కంపెనీని ప్రమోట్ చేసిన నరేష్ గోయల్ మాత్రమే కాక మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రధానమైన అంశాన్ని విస్మరించటానికి కారణాలు చెప్పవలసిన బాధ్యత ఆడిటర్లకు, సంస్థలో ఉన్న స్వతంత్ర డైరెక్టర్లకు ఉన్నది. సంస్థ వనరులను కొందరు బినామీలకు బదిలీ చేయటానికి యాజమాన్యం ప్రమోటర్స్ ప్రయత్నం చేశారా అనే విషయం తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.
సరళీకృత ఆర్థిక విధానాలలో పనిచేసే ప్రైవేట్ సంస్థలు అన్నీ విజయవంతం కాకపోవచ్చు. పోటీ విధానంలో సమర్థ సంస్థలే దీర్ఘకాలంలో మనగలగటం జరుగుతుంది. అసమర్థ సంస్థలు మార్కెట్ ఆటుపోటులను ఎదుర్కోలేక మూతపడటం సహజమే. కానీ సంస్థ మూతపడటానికి కారణం ప్రమోటర్లు, యాజమాన్యం చేసిన అవినీతికర కార్యక్రమాలు అయితే ఆ ప్రమోటర్లు యాజమాన్యం దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే నిజమైతే వారిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ విషయంలో మాత్రం సంస్థ మూత పడటానికి మార్కెట్ ప్రేరేపిత కారణాలకన్నా నిర్వహణ లోపాలు అనైతిక విధానాలు ప్రధాన కారణాలని అనిపిస్తున్నాయి. ప్రభుత్వం తప్పకుండా ఈ అంశాలపై దృష్టి సారించి నిజాలు వెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
ఐవైఆర్ కృష్ణారావు
స్వీయ తప్పిదమే పతన కారణమా?
Published Thu, Apr 25 2019 2:16 AM | Last Updated on Thu, Apr 25 2019 2:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment