
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో తెరవెనుక జరుగుతున్న వాస్తవ బాగోతం జనంలోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం మీడియా ద్వారా మేనేజ్ చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మీడియాను మేనేజ్ చేసే విధానమే ఆంధ్రప్రదేశ్‌కు శాపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ వనరులు లేకుండా మహా రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న హడావుడే భవిష్యత్తులో రాష్ట్రానికి గుదిబండగా మారబోతోందని హెచ్చరించారు.
ఆయన రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి ఎంవీ కృష్ణారావు ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి అజేయ కల్లం, ప్రముఖ పాత్రికేయులు కింగ్‌షుక్‌నాగ్, భండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నగర నిర్మాణంలో తెరవెనక ఏదో జరుగుతోందన్న అనుమానం ప్రజల్లో బలంగా ఉందని, కానీ అదేంటో వారు గుర్తించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తున్న ప్రసార మధ్యమాల ద్వారా ప్రజల్లోకి వాస్తవాలు వెళ్లకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవం తెలియాలంటే ఇక పుస్తకం రాసి వారికి అందించటమే ఆయుధంగా భావించి తాను ఈ పుస్తకాన్ని వెలువరించానని వెల్లడించారు.