
సాక్షి, విజయవాడ : రాజధాని విషయంలో గతంలో చేసిన తప్పునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునరావృతం చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గురువారం విజయవాడలో ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకావిష్కరణ అనంతరం పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘ధనమే రాజకీయాలను శాసిస్తే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. పాలకులు అభివృద్ధి అనే బాధ్యతతో పని చేయాలి. మానవత దృక్పథాన్ని ప్రదర్శించాలి. ప్రజా దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలి. కేంద్రీకృత నిర్ణయాలే రాష్ట్ర విభజనకు కారణం అయ్యాయి. చంద్రబాబు హైదరాబాద్‌ను నిర్మించానని చెప్పుకుంటున్నారు. కానీ, ఆయన సైబరాబాద్‌ను నిర్మించారు. ఔటర్ రింగ్‌రోడ్‌తో అభివృద్ధి ఎంత జరిగిందో.. విధ్వంసం కూడా అంతే జరిగింది. చిన్న రైతుల నుంచి భూముల్ని కొనుగోలు చేశారు. వారి కళ్ల ముందే వాటి విలువ కోట్ల రూపాయాల్లోకి చేరింది. అభివృద్ధిలో తాము భాగస్వామ్యం కాలేదన్న భావన అక్కడి ప్రజల్లో పెరిగిపోయింది. దీంతో ఆంధ్రా వాళ్లపై రైతులకు కోపం వచ్చేసింది. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే జరుగుతోంది.
‘అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే మళ్లీ ఉద్యమాలు చెలరేగే అవకాశం ఉంది. రాయలసీమ, కళింగ ఉద్యమాలు రావొచ్చు. రాజధాని తమదీ అన్న భావన ప్రజలందరిలో కలిగించకపోతే మంచిది కాదు. పాలకులు చేస్తున్న తప్పిదాలు, అసమానతల వల్ల అస్థిత్వ పోరాటాలు ప్రారంభమవుతాయి. మొదట్లో మంగళగిరిలో అటవీ భూమి 1800 ఎకరాలు తీసుకుంటే సరిపోద్దని చెప్పారు. నిజానికి పెద్ద రాజధాని అవసరం లేదు. పరిపాలన నగరం ఉంటే చాలు. సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఐదు, పది సంవత్సరాల్లో నిర్మిస్తామని చెబుతున్నారు. కానీ, నేను మళ్లీ చెబుతున్నా రాత్రికి రాత్రి మహానగరాలను నిర్మించలేరన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలి’ అని పవన్ అన్నారు. ఇక రాజధాని నిర్మాణం కూడా ప్రత్యేక హోదా లాంటి బలమైన అంశమేనన్న అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేశారు.