సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. విద్యార్థి అమర్నాథ్ హత్య దురదృష్టకరమని తెలిపారు. ఎవరి ఇంట్లోనూ ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారు. ఈ మేరకు మంత్రి మంగళవారం మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ ఆదేశాలతో బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల సాయం అందించామని పేర్కొన్నారు. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దోషులకు శిక్షపడేలా చేస్తామని తెలిపారు. పరామర్శ పేరుతో బాబు డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
‘శవరాజకీయాలు చంద్రబాబుకు అలవాటు. కులాలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తి చంద్రబాబు. బాబు మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. బాధిత కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి పాలిటిక్స్ చేస్తున్నారు. చనిపోయిన వారింటికి వెళ్లి ఓట్లు అడుక్కునే దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు. వారింటికి వెళ్లి ఓట్లు అడగటం ఏంటి?. తనకు అండగా ఉండాలని కోరడం సిగ్గుచేటు. శవాలపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబువి పనికిమాలిన రాజకీయాలు. రాజకీయాలతో తమకు సంబంధం లేదని అమర్నాథ్ తల్లి చెప్పారు.
పొర్లుదండాలు పెట్టినా బీసీలు టీడీపీకి ఓట్లేయరు. చంద్రబాబు చేసే శవ రాజకీయాలు జనం చూస్తూనే ఉన్నారు. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖని చూస్తే పవన్ రాజకీయాలు వదిలేసి పారిపోతాడు. సినిమాలు లేక ఇక్కడకు వచ్చిన రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదువుతున్నాడు. ఎమ్మెల్యేగా గెలుపొందలేని పవన్ సీఎం కావాలని కలలు కంటున్నాడు. 175 నియోజకవర్గాలలో గెలుస్తానని చంద్రబాబు అంటున్నారు. అసలు అన్ని సీట్లలో పోటీ చేసే దమ్ము ఉందా? అంతమంది అభ్యర్థులు మీకు ఉన్నారా?.
వంగవీటి మోహన రంగా హత్యకు చంద్రబాబు కారణమని చేగొండి హరిరామజోగయ్యే అన్నారు. ఆ సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి పార్టీకి ఓటెయ్యమని పవన్ ఎలా అడుగుతున్నాడు? చంద్రబాబు విదిల్చే కాసులకు కక్కుర్తి పడి టీడీపీకి ఓటెయ్యమని ఎలా అడుగుతున్నాడు? కాపులంతా అందుకే పవన్‌ను ఛీ కొడుతున్నారు.’ అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment