ఏ సమస్యల పరిష్కారానికైనా కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్ పేర్కొన్నాడు. విభజనానంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో చాలా చిక్కుముళ్లు ఏర్పడటం వాస్తవమే కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తుతం ఉన్న సుహృద్భావ వాతావరణం మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి అత్యంత అనుకూలతను ఏర్పరుస్తోంది. ఉద్యోగుల విభజన వంటి కొన్ని అంశాలు గతంలోనే దాదాపుగా పరిష్కృతమయ్యాయి. మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి చెందిన సంస్థల విభజన. కోర్టుల వరకు వెళ్లిన షెడ్యూల్ 10కి చెందిన సంస్థల విభజన అంశాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పరిష్కరించుకోవచ్చు. ఇక 9వ షెడ్యూల్‌కి చెందిన వాణిజ్యపరమైన సంస్థల విషయంలో కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు.
సాధారణంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అంత సులభంగా పరిష్కారం కావు. పంతాలు, పట్టింపులు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి మామూలుగా అంత ప్రధానం కాని అంశాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రాష్ట్రాల విభజనలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా విభజన రెండు ప్రాంతాల సమ్మతితో జరగనప్పుడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన రెండు ప్రాంతాల సమ్మతితో జరగలేదు. విభజన జరిగే నాటికి కే చంద్రశేఖరరావు అప్పుడే ఉద్యమ నేతగా ఉద్యమాన్ని నడిపి అధికార బాధ్యతలు చేపట్టారు.
ఉద్యమ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఉద్యమానికి కారణభూతమైన అంశాలు వారి ఆలోచనలను ప్రభావితం చేయటం సహజమే. విభజన చట్టం లోపభూయిష్టంగా, అస్పష్టంగా ఉండటం కూడా విభజన అంశాల పరిష్కారంలో సమస్యలకు కారణమైంది. కాలక్రమేణా ఆవేశాలకు బదులు ఆలోచనలు ప్రధాన భూమిక పోషించే కొద్దీ సమస్యల పరిష్కారానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. సమస్యల పరిష్కారానికి కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్ మహనీయుడు పేర్కొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి నేడు ఇలాంటి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది . కేసీఆర్, జగన్‌మోహన్ రెడ్డి మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణమే ఈ సమస్యల పరిష్కారానికి సరైన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది.
ఉద్యోగుల విభజన పూర్తయినట్లే!
నేడు మిగిలి ఉన్న విభజన సమస్యల పరిష్కారాన్ని గురించి ఆలోచించే ముందు గత ఐదేళ్లలో ఈ అంశాల పరిష్కారంలో పురోగతిని సమీక్షించుకుందాం. ప్రప్రథమంగా పరిష్కారమైన అంశం అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన. దీనికోసం కేంద్ర ప్రభుత్వమే ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. చాలా త్వరగా మొదటి ఆరునెలల్లోనే అఖిల భారత సర్వీసు అధికారుల విభజన పూర్తయి రెండు రాష్ట్రాలకు వాళ్ళ కేటాయింపు అయిపోయింది. సరైన విధానాన్ని కమిటీ అనుసరించలేదని భావన కొందరు అధికారులకు ఉన్నా, వారు వారి రాష్ట్ర కేడర్లలో ఇమిడిపోయి పనిచేయడం ప్రారంభించారు. ఇక రెండో ప్రధాన అంశం ఉద్యోగుల విభజన.
దీనికోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి కమలనాథన్ గారి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒకవైపు ప్రత్యేక తెలంగాణకు, మరొక వైపు సమైక్యాంధ్రాకు జరిగిన ఉద్యమాలలో ఉద్యోగస్తులు ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యంలో విభజన అంశంలో నిర్ణయాలు కొన్ని వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్నందున ఉద్యోగస్తుల కేటాయింపు చాలా జటిలమైన సమస్యగా తయారైంది. కానీ కమలనాథన్ ఆధ్వర్యంలో కమిటీ చాలా ఓర్పుతో ఈ జటిలమైన సమస్యను పరిష్కరించింది. ఈరోజు కోర్టు సమస్యల దృష్ట్యా ఆగిపోయిన ఒకటి రెండు కేడర్లు తప్పితే మిగిలిన అన్ని కేడర్ల అధికారులను, ఇతర సిబ్బందిని రెండు రాష్ట్రాల మధ్య కేటాయించారు. ఇది ఒక క్లిష్ట సమస్యను విజయవంతంగా పరిష్కరించినట్లేనని చెప్పాలి.
ఇక పరిష్కారం కాకుండా మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి చెందిన సంస్థలు. షెడ్యూల్ 10 సంస్థలన్నీ ప్రధానంగా శిక్షణ నైపుణ్య తర్ఫీదు కోసం ఏర్పాటు చేసిన సంస్థలు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ సంస్థలను పొందుపరిచేటప్పుడు చాలా పొరపాట్లు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘంలాంటి రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి చట్టబద్ధమైన మహిళా సంస్థల దాకా అన్నింటిని ఈ షెడ్యూల్లో పొందుపరచారు. రెండు రాష్ట్రాల మధ్య ఒక సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి ఈ సంస్థలకు సంబంధించిన విభజన ప్రధాన పాత్ర చోటుచేసుకుంది. దీనికి కారణం విభజన చట్టం చాలా లోపభూయిష్టంగా ఉండటమే.
ఆస్తుల పంపకంలో ఇచ్చిపుచ్చుకోవచ్చు
విభజన చట్టంలోని సెక్షన్ 75ను అనుసరించి ఇవి తమకే వర్తిస్తాయి కాబట్టి తెలంగాణ ఆరవ భాగంలోని ప్రకరణలకు అనుగుణంగా ఈ సంస్థలు తమవేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాదించింది. చివరకు ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఈ సంస్థలు రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, దానిలో కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్ని కల్పిస్తూ వెసులుబాటు కల్పించారు. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థల మూలనిధిని రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికపై కేటాయిస్తూ ఆస్తులు ఈ సంస్థలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి అని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా లేవంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కేసు వేసింది. ఈ అంశాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవచ్చు. ఈ సంస్థలను కొత్త రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు నిధుల అవసరం ఎంతైనా ఉంది.
ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం గానీ, తెలంగాణ గానీ సమకూరిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొని ఆ నిధులతో ఈ సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. దీనికి అనుగుణంగా ఎక్కడి సంస్థలు ఆ రాష్ట్రంలోనే ఉండిపోతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన నిధులు ఏపీకి వస్తాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఇదే ఉత్తమమైన మార్గం. ఇక రెండవ ప్రధాన అంశం షెడ్యూల్ 9 సంస్థల విభజన. ఇవి అన్నీ వాణిజ్యపరమైన సంస్థలు. ఈ సంస్థల విభజనకు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ షీలా భిడే నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 90 సంస్థల్లో 40 సంస్థలకు ఆ కమిటీ తన సిఫార్సులను అందజేసింది.
మంచి వ్యక్తిత్వం, నిబద్ధత కలిగిన అధికారిణి షీలా భిడే. ఆ కమిటీ సిఫార్సులను రెండు రాష్ట్రాలు ఆమోదించి ఈ అంశాన్ని కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ వాణిజ్యపరమైన సంస్థల ప్రధాన కార్యాలయాలు విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికపై రెండు రాష్ట్రాల మధ్య విభజితమవుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాకు వచ్చే ఆస్తులను తెలంగాణ రాష్ట్రం మార్కెట్ ధరకు తీసుకుంటే ఉత్తమం. ఆ వచ్చిన నిధులతో ఈ సంస్థల కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది అంగీకారయోగ్యం కాకపోతే పరస్పర అవగాహనతో కొన్ని భవనాలను తెలంగాణ, కొన్ని భవనాలను ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన భవనాలను మార్కెట్ ధరకు అమ్ముకుని ఆ వచ్చిన నిధులతో ఈ సంస్థలను స్వరాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభిస్తుంది.
పరస్పర అవగాహన తప్పనిసరి
ఇక చట్టంలోని లోపం మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించి వాయిదా వేసిన పన్నులు, వారి ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున ఇక్కడే చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి చట్టంలోని ఈ లోపాన్ని సవరించవలసిందిగా అభ్యర్థించింది. చట్టసవరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది కనుక తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛందంగా ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయటం మంచి సంకేతాలను పంపిస్తుంది. ఇది వివాదాలకు తావు లేని అంశం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ బాకీలను తెలంగాణ చెల్లిం చాలని, లేదు.. ఆంధ్రప్రదేశే మాకు చెల్లించాలని ఒక వివాదం నడుస్తూ ఉన్నది. సామరస్యపూర్వక వాతావరణంలో ఈ అంశాన్ని పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. నాకు తెలిసి నేను ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ అంశంపై జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా పద్ధతుల్లో చెల్లించటానికి సమయం అడిగింది కానీ ఈ బాకీలు సరికావని ఏనాడు పేర్కొనలేదు.
చాలా జటిలమైన సమస్య వెంటనే పరిష్కారం అవడానికి అవకాశం లేని సమస్య నదీ జలాల పంపిణీ. ఇది కేవలం తెలంగాణ–ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. నదీ పరీవాహక ప్రాంతానికి చెందిన అన్ని రాష్ట్రాలకు చెందిన అంశం. రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఎన్ని వివాదాలు ఉన్నాయో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య కూడా అన్ని వివాదాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కేవలం నిపుణులతో కూడిన కమిటీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించవలసి ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారం లభించటానికి కొంత సమయం పట్టవచ్చు.
రెండు రాష్ట్రాలలో ఈ విభజన అంశాల పరిష్కారానికి ఏర్పడిన కమిటీలోని అధికారులకు సర్వీసులో సమర్థులైన, నిష్పాక్షికతకు పేరొందిన ఆఫీసర్లుగా మన్నన ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాల పరిష్కారాన్ని వీరికి వదిలేసి వారి సూచనలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తే త్వరితగతిలో అందరికీ ఆమోదయోగ్యంగా పరస్పర అవగాహనతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
ఈ–మెయిల్ : iyrk45@gmail.com
Comments
Please login to add a commentAdd a comment