రాష్ట్ర విభజన అనంతరం 2014–15 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ రెవెన్యూ లోటు వెలితిని ఆనాడు గవర్నర్ 16 వేల కోట్లుగా అంచనా వేశారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో ఆదాయం అంచనాల కన్నా ఎక్కువ పెరగటం వలన, ఖర్చు అదుపులో ఉండటం వలన 2014 డిసెంబర్ నాటికి ఈ రెవెన్యూ లోటు మూడు నాలుగు వేల కోట్ల కన్నా ఎక్కువ ఉండదని తేటతెల్లమైంది. కానీ 2015 జనవరి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెంచి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అమలు చేయడానికి డబ్బులు వెచ్చించి ఈ లోటును 16,078 కోట్లకు పెంచడమైంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టవచ్చనే అవాస్తవిక ధీమాతో రెవెన్యూ లోటు పెంచి ఈ మొత్తాన్ని భర్తీ చేయవలసిందిగా కేంద్రాన్ని కోరటం జరిగింది. స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాల అమలు ఖర్చును కేంద్ర ప్రభుత్వం నెత్తి మీద రుద్దటానికి ప్రయత్నించి విఫలమైంది. ఇది ఈ అంశంపై అపోహకు, వాస్తవానికి ఉన్న తేడా.
దాదాపు నాలుగున్నర సంవత్సరాల పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభజన ఆంధ్ర ప్రాంతంలోని ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగింది కనుక వారిని శాంతపరచడానికి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో కొన్ని హామీలను, మరికొన్ని హామీలను ఆ నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెం టులో చేసిన ప్రకటనలోనూ పొందుపరచటం జరి గింది. ఈ హామీల అమలు ఏ విధంగా ఉన్నది, ఇంకా ఏమేమి అమలు చేయాలనే అంశాలను పరిశీలిద్దాం. ఈ వ్యాసంలో రాష్ట్ర పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 46 కింద పొందుపరిచిన విధంగాను, ప్రధాని మన్మో హన్ సింగ్ పార్లమెంట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడిన రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేసిందనే అంశాన్ని పరిశీలిద్దాం.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 46.. రెండు వేర్వేరు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కనుక వాటికి వేరువేరుగా తమ సిఫార్సు ఇవ్వవలసిందిగా 14వ ఆర్థిక సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వం కోరాలని చెబుతుంది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘాన్ని అభ్యర్థించడం జరిగింది. ఈ రెండు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి ఆర్థిక సంఘం సిఫార్సులు ఇవ్వటానికి వెసులుబాటు కల్పిస్తూ వారి కాల పరిమితిని కూడా పొడిగించటం జరిగింది.
తదనుగుణంగా 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తిరుపతిలోనూ తెలంగాణ రాష్ట్రంతో హైదరాబాద్‌లోనూ భేటీ అయింది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి 14వ ఆర్థిక సంఘం 2015 నుంచి 2020 వరకు ఐదు సంవత్సరాల కాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 21,113 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు భర్తీకి గ్రాంటుగా సిఫారసు చేయడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలు కాకుండా ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు అయ్యే 5 సంవత్సరాలకు రెవెన్యూ లోటు గ్రాంటు వచ్చిన ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ మిగులు కలిగే ఉండే రాష్ట్రంగా నిర్ధారించి ఆర్థిక సంఘం ఎటువంటి రెవెన్యూ లోటు భర్తీ గ్రాంట్లను తెలంగాణ రాష్ట్రానికి సిఫారసు చేయలేదు.
14వ ఆర్థిక సంఘం 2015 నుంచి 2020 వరకు గల రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి సిఫార్సు చేసింది కనుక ఇక మిగిలిపోయింది 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ లోటు భర్తీ. ఈ అంశం విభజన చట్టంలోని 46వ సెక్షన్‌లో ప్రస్తావించిన ఈ అంశాన్ని గురించి మరింత వివరణ...æ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనలో ఉంది. మొదటి సంవత్సరంలో వచ్చే నిధుల వెలితిని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుం దని ఆయన ప్రకటించడం జరిగింది. తదనుగుణంగా ఆనాడు గవర్నర్ మొదటి సంవత్సరంలో రెవెన్యూ పరంగా వచ్చే వెలితిని 16 వేల కోట్లుగా అంచనా వేశారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం అంచనాల కన్నా ఎక్కువ పెరగటం వలన, ఖర్చు అదుపులో ఉండటం వలన 2014 డిసెంబర్ నాటికి ఈ రెవెన్యూ లోటు మూడు నాలుగు వేల కోట్ల కన్నా ఎక్కువ ఉండదని తేటతెల్లమైంది. జనవరి మాసం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెంచి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అమలు చేయడానికి డబ్బులు వెచ్చించి ఈ లోటును 16,078 కోట్లకు పెంచడం జరిగింది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టవచ్చును అనే అవాస్తవిక ధీమాతో రెవెన్యూ లోటు పెంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మొత్తాన్ని భర్తీ చేయవలసిందిగా కోరటం జరిగింది. కాగ్ వారు కూడా నిర్ధారించారు గనుక ఈ మొత్తాన్నిభర్తీ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా అనుకూలంగా మరిచిపోయినా ప్రధానమైన అంశం ఏమిటంటే కాగ్ వారు కేవలం లోటు ఎంత అనేది నిర్ధారిస్తారు కానీ దానిలో ఎంత భర్తీకి అర్హత కలిగి ఉంటుందనేది మాత్రం కేంద్రం నిర్ణయించాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం పై విధంగా 16,078 కోట్లకు రెవెన్యూ లోటు కింద భర్తీ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ పంపిన ప్రతిపాదన క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం తాము కేవలం విభజన వలన ఏర్పడిన లోటును మాత్రమే భర్తీ చేస్తాం కానీ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడం ద్వారా ఏర్పడిన లోటును భర్తీ చేయమని ఆ రకంగా చేసేటట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇటువంటి ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేశారు. పంపిన ప్రతిపాదన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత విభజన వలన ఏర్పడిన లోటును 4,117 కోట్లుగా నిర్ధారించి అంతవరకు నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయం గా కేంద్ర ప్రభుత్వం 2015–16 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిర్ధారించిన లోటు 6,609 కోట్లు కనుక దానిని ప్రాతిపదికగా తీసుకుని 2014 సంవత్సరంలో విభజన తరువాత పది నెలల సమయానికి అదే నిష్పత్తిలో నిధులు విడుదల చేయటానికి సంసిద్ధత తెలియజేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్న విధంగా 16 వేల 78 కోట్లు విడుదల చేయాలని వాదించడం మొదలెట్టింది. చివరికి విభజన అంశాల అమలు గురించి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా 2014–15 సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద ఇవ్వవలసిన మొత్తం రూ.4,117 కోట్లుగా పేర్కొనడం జరిగింది. స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాల అమలు ఖర్చును కేంద్ర ప్రభుత్వం నెత్తి మీద రుద్దటానికి ప్రయత్నించి విఫలమైంది. ఇది ఈ అంశంపై అపోహకు, వాస్తవానికి ఉన్న తేడా.
వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
ఈ–మెయిల్ : iyrk45@gmail.com
Published Sun, Dec 9 2018 3:00 AM | Last Updated on Sun, Dec 9 2018 3:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment