కేంద్ర సహాయంపై ఇంత వక్రీకరణా? | IYR Krishna Rao Review On Central Government Role In Ap | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 19 2018 12:37 AM | Last Updated on Wed, Dec 19 2018 12:37 AM

IYR Krishna Rao Review On Central Government Role In Ap - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం సెక్షన్‌ 46 కింద రెవె న్యూలోటు భర్తీ గురించి ఏమున్నది కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది వాస్తవానికి అపోహకు ఉన్న తేడా ఏంది అనే అంశాన్ని సాక్షి పత్రికలో ఇంతకు ముందు విశదీకరించటం జరిగింది. ప్రస్తుత వ్యాసంలో వెనుకబడిన ప్రాంతాలకు సహాయ సహకారం కింద పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఏమున్నది కేంద్రం నుంచి ఎటువంటి సహా యం అందింది అనే అంశాన్ని పరిశీలిద్దాం. వెనుకబడిన ప్రాంతాలకు సహాయం చేయడం అనే అంశాన్ని పునర్విభజన చట్టంలో రెండు ప్రాంతాలకూ వర్తించి పేర్కొనడం జరిగింది. సెక్షన్‌ 46 కింద కేవలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయలసీమ ఉత్తర కోస్తా ఆం‍ధ్రా  జిల్లాల వరకే ఈ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని పరిమితం చేయడం జరిగింది.

కానీ సెక్షన్‌ 94లో ఈ అంశాన్ని తెలంగాణలో, ఆంధ్రాలోని వెనకబడిన జిల్లాలలో భౌతిక సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయాన్ని అందించే విధంగా ప్రస్తావించారు. ఈ రెండు సెక్ష న్లలోని అంశాలను అన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం గుర్తించిన వెనకబడిన జిల్లాలకు సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఆరు సంవత్సరాల కోసం ఒక ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక విధానాన్ని రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అలా గుర్తించిన 7 ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు, తెలంగాణలో గుర్తించిన 9 వెనకబడిన జిల్లాలకు ఈ అభివృద్ధి ప్రణాళిక వర్తిస్తుంది. తదనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగేళ్లకు ఆంధ్ర రాష్ట్రానికి మూడేళ్లకు ఏడాదికి 50 కోట్ల చొప్పున ప్రతి జిల్లాకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. 

అయితే కేంద్రం నుంచి ఏపీకి 4వ సంవత్సరానికి ఇచ్చిన గ్రాంట్‌ను కొన్ని విధానపరమైన అంశాల దృష్ట్యా వెనక్కు తీసుకున్నామని, తగిన సమయంలో తిరిగి ఇవ్వటం జరుగుతుందని ఈ మధ్యనే లిఖితపూర్వకమైన జవాబు ద్వారా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ సభ్యులు రామమోహన్‌ నాయుడికి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అంతకు ముందు ఇచ్చిన గ్రాంట్ల వినియోగ పత్రాన్ని సమర్పించినా దానికి సంబంధించిన కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని దీనిని బట్టి అర్థం అవుతుంది. ఈ ప్యాకేజీ నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు ఆరేళ్లకోసం రూపొందించింది కనుక నాలుగేళ్లకు మాత్రమే కాకుండా మిగిలిన రెండేళ్ల మొత్తాలు కూడా కొన్ని రోజులు అటూఇటుగా రావటం అయితే తథ్యం.

ఈ వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ విషయంలో విమర్శలు చేసే వారు ప్రధానంగా ప్రస్తావించే అంశం, పునర్‌ విభజన చట్టంలోని సెక్షన్లను ఆనాటి ప్రధానమంత్రి మన్మో హన్‌ సింగ్‌ పార్లమెంటులో ఇచ్చిన వాగ్దానాలతో కలిపి చదవాలని, ఆయన బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీని పేర్కొన్నారని ఆ స్థాయిలో నిధులు విడుదల చేయాలని పేర్కొంటారు. వీరు ఇందులో ప్రధానంగా విస్మరించిన అంశం ఏమిటంటే బుందేల్‌ఖండ్‌ లాంటి ప్యాకేజీలలో ప్రభుత్వం అప్పటికే అమలు చేస్తున్న ఇతర అభివృద్ధి కార్యక్రమాల మొత్తాన్ని కూడా భాగంగా చూపెడతారు. మహాత్మాగాంధీ ఉద్యోగ హామీ పథకం లాంటి పలు కార్యక్రమాల ద్వారా కేంద్రం నుంచి ఆయా జిల్లాలకు విడుదలయ్యే నిధులను కూడా ఈ ప్యాకేజీలో భాగంగా చూపెట్టి ప్యాకేజీ స్థాయిని పెంచడం జరుగుతుంది. ఆ వివిధ కార్యక్రమాల కింద వచ్చే నిధులను కలపకపోతే ఆ రాష్ట్రాలకు కూడా ఈ స్కీమ్‌ కింద వచ్చే నిధులు మనకన్నా ఎక్కువ ఏమీ ఉండవు. దీన్ని విస్మరించి బుందేల్‌ఖండ్‌లాంటి ప్యాకేజీలకి విపరీత ప్రచారమివ్వటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే.

94వ సెక్షన్‌లో పరిశ్రమల రాయితీలను కూడా పేర్కొనడం జరిగింది. తదనుగుణంగా పైన గుర్తిం చిన వెనకబడిన జిల్లాలకు 2015– 20 మధ్య పెట్టిన పరిశ్రమలపై అదనంగా 15 శాతం తరుగుదల (de- preciation) 15 శాతం ఏర్పాటుచేసిన యంత్రాల పైన పెట్టుబడి అలవెన్స్‌ పొందే అవకాశాన్ని కల్పిం చడం జరిగింది. ఇదే 94వ సెక్షన్‌లో కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిలో అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టు, సెక్రటేరియట్‌ లాంటి భవనాలతో పాటు ముఖ్యమైన మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని పేర్కొనడం జరిగింది. దీనికనుగుణంగా రూ. 1,500 కోట్ల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందించడం జరిగింది.

రాష్ట్రంలో అసత్య ప్రచారాలతో ఏర్పడిన అపోహకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని సెక్షన్లతోపాటు ఆనాటి ప్రధాని మన్మో హన్‌ ప్రకటనకు అనుగుణంగా గత నాలుగేళ్లనుంచి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ మాత్రం కేంద్రం ఇచ్చిన సహా యాన్ని పూర్తిగా విస్మరించి పరిశీలనలో ఉన్న అంశాలనే భూతద్దంలో చూపెడుతూ ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నది.

ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఈ–మెయిల్‌ : iyrk45@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement