
ఎన్నికల సమయం వచ్చింది. మేనిఫెస్టోల జాతర మొదలైంది. హామీలు ఇవ్వడంలో అశలు చూపెట్టడంలో ఎవరు ఎవరికీ తగ్గాల్సిన అవసరం లేదు. కాబట్టి నింగిన ఉన్న చంద్రుడ్ని కూడా తెచ్చి చేతులో పెడతామనే విధంగా వివిధ పార్టీలు వారి వారి ఎన్నికల ప్రణాళికలతో ప్రజలను మభ్య పెట్టే విధంగా తమ హామీలను, వాగ్దానాలను గుప్పిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే వీటన్నింటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తా యని ప్రజలు ప్రశ్నించడం లేదు. పార్టీలు సమాధానం చెప్పటం లేదు. అవినీతి రహిత పాలన, జవాబుదారీతనంతో కూడిన పాలన, దేశ అభివృద్ధిని క్రమశిక్షణతో, శ్రమతో సాధించే పాలనను గురించి ఎక్కడైనా పేర్కొన్నారు ఏమోనని అన్ని పార్టీల మేనిఫెస్టోలను భూతద్దం వేసుకొని చూసినా∙కనిపించే అవకాశాలు మృగ్యం.
ఈనాడు అన్ని పార్టీల మేనిఫెస్టోలలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు తొలి బీజం ఇంగ్లండ్‌లో 1942లో పడింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇంగ్లండ్‌లో విలియం బేవరిడ్జ్ అనే వ్యక్తి ఈ సంక్షేమ పథకాల అమలుకు ఒక ప్రణాళికను రూపొందించారు. ఆయన దృష్టిలో ప్రధానంగా ఐదు సమస్యలను పరిష్కరించగలిగతే అది సంక్షేమ రాజ్యం ఏర్పాటుకు తోడ్పడుతుంది. అవి అనారోగ్యం, అవివేకం, ఆర్థికంగా దీనస్థితి, సోమరితనం మొదలైనవి. సంక్షేమ కార్యక్రమాలలో ఆయన విశ్రాంత ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వికలాంగులకు ప్రత్యేకమైన అలవెన్స్ ఇచ్చే విధానాన్ని రూపొందించారు. చిన్న పిల్లలకు, అంద రికీ వర్తించే విధంగా జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ నాటికీ ఇంగ్ల్లండ్‌లో ఈ జాతీయ ఆరోగ్య విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తూ వస్తున్నారు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం సంక్షేమ కార్యక్రమాల అమలు కమ్యూనిస్టు దేశాల్లోనూ ప్రజాస్వామిక దేశాల్లోనూ విస్తృతంగా అమలు కావడం జరిగింది.పెట్టుబడిదారీ దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ పరిరక్షణకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక రక్షణ కవచంగా భావించడం జరిగింది. నియంతృత్వ దేశాల్లో కూడా నియంతలు ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా చూసుకోవడానికి ఒక స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఈనాడు స్కాండినేవియన్ దేశాలలో చాలా విస్తృత ప్రాతిపదికన ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. దేశ బడ్జెట్లో సింహభాగం దీని కోసమే ఖర్చు చేయడం జరుగుతున్నది. జర్మనీలాంటి దేశాలలో లబ్ధిదారులు కూడా కొంత ఖర్చు భరించే విధంగా రూపొందించడం జరిగింది. ఇంగ్లండ్ లాంటి దేశాలలో ఈ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఒకసారి అమలు చేస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ఉపసంహరించటం కష్టతరమవుతుంది. ఈజిప్ట్ దేశంలో ఆహారపదార్థాలపై రాయితీల తొలగింపు సమయంలో జరిగిన కొట్లాటలే దీనికి నిదర్శనం. చాలాకాలం అమలు అయినప్పుడు ప్రజలు ఈ రాయితీలను ఒక హక్కుగా భావించే ప్రమాదం ఉంది.
ఏ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్నా వనరులు చాలా అవసరం. ఎవరి చేతిలో మంత్రదండం లేదు. స్కాండినేవియన్ దేశాలలో జాతీయ ఉత్పత్తిలో ఎక్కువ భాగం సంక్షేమ కార్యక్రమాల మీద ఉపయోగించుకుంటున్నారు. ప్రతి దేశంలోనూ సంక్షేమ కార్యక్రమాలకు భవిష్యత్తులో ఆదాయాన్నిచ్చే ప్రాజెక్టుల మీద పెట్టుబడులకు మధ్య సమతుల్యం పాటిస్తూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి సమతుల్యం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిస్తే ఆ ఖర్చులు భరించలేక మొత్తం ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉంది. అలవికాని హామీలు ఎన్నికల సమయంలో ఇవ్వటం, వాటిని చూసి మోసపోయి ప్రజలు ఓట్లు వేయడం ఆపైన రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలను మర్చిపోవడం, మర్చిపోక పోయినా అమలుచేయడానికి తగిన వనరులు లేకపోవడంతో చేయగలిగిందేమీ లేక చేతులెత్తేయడం జరుగుతుంది.
ఇటువంటి పరిస్థితుల నుంచి బయట పడాలంటే ఎన్నికల మేనిఫెస్టోలకు బడ్జెటింగ్ అవసరం. ప్రతి రాజకీయ పార్టీ తాము చేసే వాగ్దానాలకు ఎంత ఖర్చవుతుంది. దానికి కావలసిన వనరులు ఎక్కడ నుంచి సమకూర్చుకుంటారు అనే అంశాన్ని మేనిఫెస్టోలో స్పష్టంగా తెలియచేయాలి అనే నిబంధన ఉండాలి. ఎన్నికల సంఘం ఈ అంశంపై దృష్టి పెట్టి అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలకు అనుబంధంగా వనరుల సేకరణ విధానాన్ని వివరిస్తూ బడ్జెటింగ్ వివరాలను పొందుపరచాలి అనే నిబంధన విధిస్తే మేనిఫెస్టోలకు ఒక ప్రాధాన్యం సంతరించుకుంటుంది. అప్పుడు ప్రజలు కూడా మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను పరిశీలించి ఓటు వేయవచ్చు.
ఐవైఆర్ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి- iyrk45@gmail.com