అయిదేళ్లు సాగినదంతా దోపిడీనే | IYR Krishna Rao Interview With Sakshi | Sakshi
Sakshi News home page

అయిదేళ్లు సాగినదంతా దోపిడీనే

Published Sun, Apr 7 2019 9:39 AM | Last Updated on Sun, Apr 7 2019 9:39 AM

IYR Krishna Rao Interview With Sakshi

ఏ పని చేసినా దానివల్ల నాకేమిటి? రాజకీయంగా, ఆర్థికంగా నాకేమొస్తుంది? అనే స్వార్థ కోణంలోనే చంద్రబాబు నిత్యం ఆలోచిస్తారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే అభిలాష ఆయనకు ఏ కోశానా లేదు. కేవలం ఎన్నికల్లో ఓట్లు పొందాలనే స్వార్థంతోనే కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్‌తో పాటు ఇటీవల వివిధ కులాలు, వర్గాలకు 31 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. సాగు నీటి ప్రాజెక్టులను కుంభకోణాలమయంగా మార్చేశారు. ఇష్టమొచ్చినట్లు అంచనాలు పెంచేయడం.. అందినకాడికి దోచేయడం చందంగానే ఈ ఐదేళ్లూ ప్రభుత్వం నడిచింది. ప్రభుత్వ భూములే కాకుండా దేవుళ్ల మాన్యాలు కూడా కొట్టేసేలా సాగిన కుట్రలకు లెక్కే లేదు. ప్రయివేటు విద్య, వైద్య రంగాలను నెత్తిన పెట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రులను, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. బాబు అవినీతి, అక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆదాయం లేదని బీద అరుపులు అరుస్తూనే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ, దీక్షలు, విహారయాత్రల పేరుతో లెక్కలకందనంత దుబారా చేశారు. అనుకూల మీడియాను వినియోగించుకుని చేయనిది చేసినట్లు, లేనిది ఉన్నట్లు ప్రచారం చేసుకోవడంలో గోబెల్స్‌ను చంద్రబాబు ఎప్పుడో మించిపోయారు. 

సాక్షి, అమరావతి : ‘ఎక్కడైనా తప్పులు బయటపడితే విచారణ జరిపించి దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉంటుంది. అయితే, ఇందుకు పూర్తి విరుద్ధంగా కుంభకోణాల్లో వాస్తవాలు బయటకు పొక్కకుండా చంద్రబాబు పాతరేశారు. విశాఖపట్నం భూ కుంభకోణం, అమరావతి ల్యాండ్‌ స్కాం, విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసులు ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు. లోతుగా దర్యాప్తు జరిపిస్తే పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయనే ఉద్దేశంతో వీటన్నింటినీ తూతూమంత్రం విచారణలతో ‘మమ’ అనిపించేశారు. ఒకరిద్దరు చిన్నవారిపై చర్యలు తీసుకోవడం ద్వారా విచారణ జరిపించినట్లు అనుకూల మీడియాలో పెద్దఎత్తున వార్తలు రాయించుకున్నారు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వ నిజ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు విభజిత ఆంధ్రప్రదేశ్‌ మొట్టమొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రిటైర్డు) ఐవైఆర్‌ కృష్ణారావు.

అంతేకాదు... బాబు జమానాలోని పక్షపాతాన్ని, పచ్చి నిజాలను పూసగుచ్చినట్లు కుండబద్ధలు కొట్టారు. ‘ఆయన ఎంతసేపూ తమ వర్గం, తమ కాంట్రాక్టర్లు, తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యక్తుల మేలు కోసమే పాటుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో గతంలో సఖ్యతగా ఉన్నది కూడా రాష్ట్రానికేదో మేలు చేయాలని కాదు. వాళ్ల అనుకూలురుకు కేంద్రంలో కాంట్రాక్టులు ఇప్పించుకోవడం, కావాల్సిన పనుల కోసమే. నాలుగేళ్లు వాళ్ల దృష్టి దానిపైనే ఉంది. అలాకాకుండా రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాలపై దృష్టిపెట్టి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడి ఉండేదని’ ఐవైఆర్‌ విశ్లేషించారు. ఈ అయిదేళ్ల టీడీపీ పాలనలో ఏం జరిగింది? రాష్ట్రం పురోగమనంలో ఉందా? తిరోగమనంలో ఉందా? అందుకు కారణాలేమిటి? రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలి? తదితర అంశాలపై ఐవైఆర్‌ అభిప్రాయాలివి..

ప్రభుత్వ డేటాను వాడుకోవడం పెద్ద తప్పు
రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎంత దరిద్రంగా సాగుతుందో చెప్పడానికి ఐటీ గ్రిడ్‌ వ్యవహారమే నిదర్శనం. సహజంగా పాలనలో సీఎం సమావేశానికి కూడా అన్ని విభాగాల వారు రారు. కానీ, ఎవరో అనామకుడు ఒక ప్రతిపాదన తెచ్చిస్తే దానిని పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలన్నిటితో సమావేశం పెట్టారు. కమిటీ ఏర్పాటు చేసి వారిచేత పని చేయించారు. పోనీ, ఆ ప్రతిపాదన పెట్టింది ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్‌లాంటి పెద్ద సంస్థలు కాదు. రోడ్డున పోయే దానయ్య ప్రతిపాదనకు ఇంత ప్రాధాన్యం ఇచ్చి మొత్తం ప్రభుత్వ డేటాను వాడుకుని పార్టీ పరంగా లబ్ధి పొందాలని చూడటం చాలా పెద్ద తప్పు. ఇది చాలా దూరం వెళ్తుందని నేను భావిస్తున్నా. దోపిడీ కోసం ఇసుకను సాధనంగా వాడుకున్నారు.

బాబు పాలన గురించి చెప్పాలంటే
‘ఇసుక పాలసీ’ చూస్తే చాలు. ఇసుకను ఎలా డీల్‌ చేయాలో ఐదేళ్లలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయినా ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లడుగుతారనేది అతి ముఖ్యమైన ప్రశ్న. వాస్తవానికి ఒక పద్ధతి ప్రకారం సాఫీగా జరిగిపోతున్న దానిని... వారి దోపిడీ కోసం చెడగొట్టారు. తాము వెనకుండి దండుకునేందుకు మొదట ‘డ్వాక్రా సంఘాలకు ఇసుక సరఫరా బాధ్యతలు’ అప్పగించినట్లు తెరపైకి తెచ్చారు. వాస్తవంగా అక్కడ డ్వాక్రా లేదు. మహిళలు లేరు.

ఆ ముసుగులో తెలుగుదేశం
నాయకులు వెనకుండి అనుచర, బంధుగణంతో అడ్డగోలుగా ఇసుక తవ్వించి అమ్ముకుని వేల కోట్లు దండుకున్నారు. మొత్తం గందరగోళం చేశారు. ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు. వీరి నిర్వాకానికి ఒక దశలో నిర్మాణ రంగానికి కూడా ఇసుక దొరకని పరిస్థితి తలెత్తింది. 

అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు..
బియ్యం ఉడికాయా? లేదో చెప్పాలంటే ఒకటి రెండు మెతుకులు పట్టుకుని చూస్తే చాలంటారు. బాబు పాలనలో ఈ విధంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఇలాంటివే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్‌ అంతా ఒక పెద్ద స్కామ్‌. ప్రతిచోటా ఇష్టమొచ్చినట్లు అంచనాలు పెంచేయడం, సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చేయడం, దోచేయడం. అయిదేళ్లుగా సాగుతున్నది ఇదే. ఈ నేపథ్యంలో పజలు బాగా ఆలోచించుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

కార్పొరేషన్లు ఎన్నికల కోసమే..
 ఈయన (చంద్రబాబు) మళ్లీ గెలిస్తే కాపు కార్పొరేషన్‌ ఉండదు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఉండదు. ఎన్నికల ముందుపెట్టిన మొత్తం కార్పొరేషన్లలో ఏ ఒక్కటీ ఉండదు. ఇవన్నీ ఎన్నికల అవసరం కోసం ఏర్పాటు చేస్తున్న సంస్థలు మాత్రమేనని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. వీటితో తమకేదో జరుగుతుంది, ఒరుగుతుంది, అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు. మళ్లీ  గెలిస్తే అన్నింటినీ తీసేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో బాబు తొమ్మిదేళ్ల పాలనలో  అనుసరించిన విధానాలను గుర్తు చేసుకున్న వారెవరికైనా ఈ విషయం బోధ పడుతుంది. జంధ్యాల సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ ‘నాకేంది?’ అనే తరహాలో చంద్రబాబు ఆలోచనంతా సాగుతుంటుంది. ప్రతి సమస్యకు, ప్రతి విధానానికి, ప్రతి అంశానికి నాకేంటి? పొలిటికల్‌గా నాకేంటి? అనే ఆయన ఆలోచిస్తుంటారు. ప్రజలకు మేలు చేస్తే ఆటోమేటిగ్గా రాజకీయంగా అనుకూల ఫలితాలు ఉంటాయనే విశాల దృక్పథం ఏనాడూ లేదు. ఆలయాలు, «ధార్మిక సంస్థలంటే ఆయనకు ఏమాత్రం పవిత్రతగాని, భక్తి గాని ఉన్నట్లు లేదు. ఈనాం చట్టాన్ని ఇప్పటికిప్పుడు ఎన్నికల ముందు మార్చి అతి పెద్ద కుంభకోణం చేయబోతున్నారు. దేవుడి మాన్యాలు కొట్టేయడానికి పెద్ద పన్నాగం పన్నారు. దీనిని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న గ్రామంలో రూ.5 వేలు తీసుకునే అర్చకుడికి సాయం చేయడానికి ఈయనకు మనసు రాదు. అందులోనూ నాకేంటి? అని ఆలోచించే రకం.

ప్రభుత్వ విద్యను నాశనం చేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్‌ విద్యను నెత్తిమీద పెట్టుకుని ప్రభుత్వ విద్యను, కార్పొరేట్‌ ఆస్పత్రులను భుజాన మోస్తూ ప్రభుత్వ ఆస్పత్రులను భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే పేదలు భయపడేంతగా పరిస్థితిని దిగజార్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత రాష్ట ఆదాయం, పన్నుల్లో వాటా పెరిగాయి. అయినా దానిని విద్య, వైద్యంపై ఖర్చు పెట్టలేదు.  

కప్పిపుచ్చుకోవడానికి కొత్త సాకులు..
ఇటీవలి గుంటూరు, విశాఖపట్నం సభలు విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏమీ మోసం చేయలేదని ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇంకో సాకు కోసం చూసుకుంటున్నారు. కేసీఆర్‌ను తీసుకెళ్లి అక్కడపెట్టి, రాష్ట్రం మీద ఏదో కుట్ర జరుగుతోందని చెప్పి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కచ్చితంగా ఇందులో విఫలమవుతారు. ఎందుకంటే చంద్రబాబు ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు కావు. ఆయన పార్టీ ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు కావు. రాష్ట్రం ఆయన కంటే, ఆయన పార్టీ కంటే చాలా పెద్దది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అనుకూల మీడియా ద్వారా పదికి వందసార్లు చెప్పి, వాళ్లు వందకు వెయ్యిసార్లు చెబితే ప్రజలు మోసపోతారనే భ్రమల్లో ఉన్నారు. అది ఎన్నటికీ జరగదు.
   
బోగాపురాన్ని అడ్డుకున్నారు
పని లేనప్పుడు, పని చేయనప్పుడు, వాస్తవంగా ప్రగతి సాధించలేనప్పుడు వైఫల్యాన్ని వేరొకరిపై నెట్టుతుంటారు. బోగాపురం ఎయిర్‌పోర్టు టెండరు రద్దు  చంద్రబాబు అవినీతి విధానానికి పరాకాష్ట. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు టెండరు వచ్చింది. దానితో త్వరగా ఒప్పందం కుదుర్చుకుని పనులకు అనుమతించి ఉంటే చక్కటి అద్భుతమైన విమానాశ్రయం రూపుదిద్దుకుని ఉండేది. అయితే, కమీషన్ల కోసం, కావాల్సిన వారికి కాంట్రాక్టును కట్టబెట్టడం కోసం బాబు ఈ టెండరును రద్దు చేశారు. ఈ ప్రభుత్వం ఎలా, ఎందుకు నడుస్తోందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. 

ఒక్క ఓడ రేవునైనా నిర్మించారా?
వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చంద్రబాబు వెయ్యిసార్లు పైగా చెప్పి ఉంటారు. ఇక్కడ మంచిగా ఓడరేవులు కట్టుకోవచ్చని చెబుతుంటారు. అయిదేళ్లలో కట్టిన ఓడరేవు ఒక్కటి చూపించమనండి. నిజంగా ఆ ఉద్దేశం ఉంటే ఈ సమయం ఎక్కువే కదా? మచిలీపట్నం ఓడరేవును అప్పటికే నవయుగ వారికి ఇచ్చారు. తలచుకుంటే భావనపాడు పూర్తి చేసి ఉండవచ్చు. కేంద్రం కోరినట్లు దుగరాజుపట్నంకు ప్రత్యామ్నాయంగా రామాయపట్నంను చూపించి ఉంటే అదీ వచ్చి ఉండేది. మూడు ఓడ రేవులు వచ్చే అవకాశం ఉన్నా ఒక్కటీ కట్టకుండా... ‘ఐదేళ్లుగా రోజూ మాకు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని’ చెప్పుకుంటూ ఉంటే లాభం ఏముంటుంది?

రియల్‌ ఎస్టేట్‌తో దండుకోవడమే లక్షం..
ఈనాం భూములుగానీ, ప్రభుత్వ భూములు గానీ, దేవుని భూములుగానీయండి ఏవైనా భూముల మీద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి దండుకోవడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగానే సదావర్తి భూములపై కన్నేశారు. అదృష్టవశాత్తు కోర్టుల జోక్యంతో సదావర్తి భూములు వారి పాలుకాకుండా కొంతవరకు ఆగాయి. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. 

చెడు జరిగితే ఇతరులపై నెట్టేస్తారు..
మంచి జరిగితే అంతా తన ప్రతిభ అని ప్రచారం చేసుకోవడం, ఏదైనా నిర్ణయం వివాదాస్పదమైతే అధికారులపై నెట్టేయడం ఆయనకు ఆది నుంచి అలవాటే. ఇది ఆయన విధానం కూడా. గతంలో చంద్రబాబు అదనంగా మద్యం దుకాణాలకు అనుమతివ్వాలని నిర్ణయించడం పెద్ద వివాదమైంది. మర్నాడు ఇది ఎవరు, ఎందుకు చేశారు? అని సీఎం ఆరా తీసి కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. తర్వాత ఆ కమిషనర్‌ను తప్పించి పోస్టింగ్‌ ఇవ్వకుండా ఎక్కడో సర్దుబాటు చేశారు. నిజానికి ఈ నిర్ణయం తీసుకున్నది చంద్రబాబే. 

మీడియాను అడ్డుపెట్టుకుని..
కాగితాల పైన కంపెనీలు సృష్టించి టీడీపీ నాయకులు అన్ని ప్రధాన ప్రాంతాల్లో అత్యంత విలువైన భూములను కబ్జా చేసేశారు. విశాఖపట్నంలో, అమరావతిలో ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. విశాఖపట్నంలో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములను కూడా వెనక్కు తీసుకుని ఆక్రమణదారులకు కట్టబెట్టే దుష్ట పన్నాగం సాగింది. ఏదైనా కుంభకోణం కొద్దిగా బయటకు పొక్కితే విచారణ జరిపించి దోషులను శిక్షించే పరిస్థితి లేదు. కాల్‌మనీ రాకెట్‌ను ఇలాగే తొక్కిపెట్టేశారు. విశాఖ భూముల కుంభకోణాన్ని, అమరావతి రియల్‌ ఎస్టేట్‌ కుంభకోణాన్ని పక్కకు పెట్టేశారు. అనుకూల మీడియా ఉన్నది కాబట్టి వ్యతిరేక వార్తలు రాకుండా, పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగులోకి రాకుండా ఎక్కడికక్కడ మూసేశారు. ఎదుటివారి విశ్వసనీయతను దెబ్బతీస్తూ కాలయాపన చేశారే గాని ఒక మంచి పారదర్శక పాలన ఇవ్వాలని ఏ రోజూ ప్రయత్నం చేయలేదు.

అంతా తనవారికోసమే
ఎంతసేపటికి తను, తన వర్గం, తనవాళ్లు... అనే చంద్రబాబు ఆలోచిస్తారు. వారి మేలు కోసం పనిచేయడం తప్పితే బాబు చేస్తున్నదేమీ లేదు. చేయాలన్న అభిలాష కూడా లేదు. చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ. వినేవారుంటే చెప్పిందే చెబుతుంటారు. చేసే పనులకు చెప్పే మాటలకు ఏమాత్రం పోలిక, పొంతన ఉండదు.

బాండ్లదంతా డాంబికమే..
అమరావతి కోసమంటూ బాండ్లుజారీ చేసి రుణం తీసుకున్నారు.దానికి ఎక్కడా లేనంత అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. బాండ్లను మార్కెట్‌లో అమ్ముకుంటే లాభ పడేది కొన్నవారే. సర్కారుకు ఏమీ రాదు. దానికి సీఎం ముంబై వెళ్లి మార్కెట్‌లో గంట కొట్టి అదో పెద్ద అద్భుతంలా రాష్ట్రమంతా ప్రచారం చేసుకున్నారు. అక్కడ ఏమీ లేదు. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. 

అభివృద్ధిని చేజేతులా పాడు చేశారు
కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చక్కటి ప్రణాళికతో అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని చేజేతులా నాశనం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బును సరిగా వినియోగించుకోలేదు. అనవసరంగా నిందలు, అభాండాలు వేసి వారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకున్నారు. తను చేసిన పనులను చెప్పుకొని ఎన్నికలకు పోతే నెగ్గలేమని గుర్తించారు. అందుకని ఏదో ఒక నెపం కోసం వెదుకుతున్నారు. మొన్నటివరకు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి లబ్ధి పొందాలని చూశారు. దానిని ప్రజలు తెలుసుకున్నారు. 

కల్పిత వృద్ధి చూపారు
చంద్రబాబు చెబుతున్న అభివృద్ధి అంతా బూటకమే. ఇందుకు రాష్ట్రంలో తక్కువగా ఉన్న మానవాభివృద్ధి సూచికలే నిదర్శనాలు. శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌), మాతా మరణాల రేటు (ఎంఎంఆర్‌) జీవిత కాలం (లైఫ్‌ ఎక్స్‌పెక్టెన్సీ)లను మానవాభివృద్ధి సూచికలకు ప్రామాణికాలుగా తీసుకుంటారు. వీటన్నింటా మనం వెనుకబడే ఉన్నాం. సీఎం చెబుతున్నట్లు నిజంగా జరిగి ఉంటే ఆ ప్రగతి మానవాభివృద్ధి సూచికల్లో ప్రతిబింబించాలి కదా? కానీ, రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తి గతం కంటే గణనీయంగా తగ్గింది. బాబు మార్కు గొప్ప అభివృద్ధి ఇదేనేమో.! జాతీయ ఉత్పత్తి అంకెలను ఎంతంటే అంత పెంచేసి, దొంగ లెక్కలు చూపించి 10 నుంచి 15 శాతం వృద్ధి ఉందని చెబుతున్నారు. జాతీయ ఉత్పత్తి పెరిగితే పన్ను రాబడి నిష్పత్తి కూడా అదే స్థాయిలో ఉండాలి కదా? మరి ఎందుకు లేదు? ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయం పెరిగితే ల్లలను 
బాగా చూసుకుంటారు. అందువల్ల వారి మరణాలు తగ్గాలి. ప్రసవానంతర మరణాలు తగ్గాలి. మరి ఆ సంఖ్యలో ఏ విధమైన మార్పు లేదు. ఊరికే జాతీయ అభివృద్ధి పెరిగింది... పెరిగింది... అంటే అంతకంటే అబద్ధం మరొకటి ఉండదు. 

బాబు సమస్య రెండు రాష్ట్రాల సమస్యా?
ప్రతిసారి తన సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించి ప్రయోజనం పొందాలని ఎత్తుగడలు వేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. అక్రమార్కులపై ఆదాయ పన్ను శాఖ తనిఖీలు చేస్తే తన వర్గీయులను కేంద్రం వేధిస్తోందంటారు. తనపై దాడికి వస్తే ప్రజలు రక్షణగా నిలవాలంటారు. దానిని కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదంగా చెప్పుకొంటారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తే ఆంధ్ర – తెలంగాణ సమస్యగా చెబుతారు. ప్రభుత్వ సమాచారం లీకైన ఐటీ గ్రిడ్‌ గురించి మాట్లాడినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యంటారు. అసలు పదేళ్ల హక్కు ఉన్న  హైదరాబాద్‌ను ఏపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం లేదు. అయితే, తనకు సమస్య (ఓటుకు కోటి కేసు) వచ్చినందున హఠాత్తుగా విజయవాడలో వాలారు. ప్రజాస్వామ్యానికి మనకు తెలిసిన నిర్వచనం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల అనేది. చంద్రబాబు దానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. కొంతమంది డబ్బులు వసూలు చేస్తారు. కొంత మంది దానిని ఖర్చుపెడతారు. ఇదే డెమోక్రసీ అన్నది బాబు మాట. ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. 

పట్టపగ్గాల్లేని దుబారా
లోటు బడ్జెట్, డబ్బులు లేవని గొంతు చించుకుని అరుస్తున్నవారు ఎవరైనా పాలనలో  కచ్చితమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. కానీ, రాష్ట్రంలో
పై నుంచి కింద వరకు అటువంటి విధానం కనిపించడం లేదు. పైపెచ్చు అప్పు చేసి పప్పు కూడు చందంగా విపరీతమైన దుబారా సాగుతోంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. 

పోలవరం, రాజధాని విహార యాత్రలు సర్కారు మితిమీరిన దుబారాకు నిదర్శనాలు. పోలవరంలో గాని, రాజధానిలో గాని నిజమైన ప్రగతి ఉంటే ఎవరినీ తీసుకెళ్లి చూపించాల్సిన అవసరం ఉండదు. అభివృద్ధి జరిగితే వారు ఎలాగైనా తెలుసుకుంటారు. సాగర్‌ నిర్మాణమే ఇందుకు నిదర్శనం. ఇక్కడ పోలవరంలో గాని, అమరావతిలో గాని జనం వెళ్లి చూడాల్సిన స్థాయిలో జరుగనందునే విచ్చలవిడిగా సర్కారు సొమ్ము ఖర్చు చేస్తూ విహార యాత్రకు తీసుకెళ్తున్నారు. చూపెట్టేందుకు ఏముందక్కడ?పోలవరంలో కొంత పెడుతున్నందున కొంత పని జరుగుతుంటుంది. ఎవరైనా వెళ్లి చూసి రావచ్చు. సర్కారు తీసుకెళ్లడం ఏమిటి?

ఏది ధర్మం? ఎవరిమీద పోరాటం?
ధర్మ పోరాట దీక్షలంటూ ఆందోళన చేస్తున్నారు. ఏది ధర్మం? ఎవరిమీద పోరాటం? ధర్మం మనవైపు ఉంటే కదా పోరాటం చేయడానికి?ఇచ్చినవన్నీ ఇవ్వలేదని చెబుతున్నారు. తప్పుడు లెక్కలు చూపించి కేంద్రాన్ని ప్రజల ముందు దోషిలా నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. దాని నుంచి ఏమీ రాదని తెలుసు. అయినా అంతంత డబ్బు ఖర్చు పెట్టడమన్నది చాలా అవాంఛనీయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement