సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పనితీరు చాలా విచిత్రంగా ఉంటుందని విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. విభజన అంశాలతోపాటు ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై ఐవైఆర్ తాను రాసిన ‘నవ్యాంధ్రలో నా నడక’ పుస్తకంలో ఒక అధ్యాయాన్ని కేటాయించారు. తాను పని చేసిన కాలంలో సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో అనుసరించిన విధానాలను ఆయన అందులో ప్రస్తావించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
అధికారులపైకి నెట్టేసి తప్పుకుంటారు..
‘చంద్రబాబు ఏపని చేయాలనుకున్నా, ఎవర్ని నియమించాలనుకున్నా ముందు రోజు ఆ విషయంపై లీకులు ఇస్తారు. వాటిని ఆయనకు అనుకూలంగా ఉండే పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తాయి. దానిపై వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇది చంద్రబాబు సాధారణంగా అనుసరించే పద్ధతి. ఒకవేళ ఆ నిర్ణయం వివాదాస్పదంగా మారితే అందుకు బాధ్యతను ఎవరో ఒకరిపై తోసేసి తాను మాత్రం సురక్షితంగా ఉండాలని ప్రయత్నిస్తారు. చాలాసార్లు నిర్ణయాలకు బాధ్యతను అధికారులపైనే తోసేస్తారు. ఇది ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరించారు. ఉదాహరణకు గతంలో చంద్రబాబు అదనంగా మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు పెద్ద గందరగోళం చెలరేగింది. మర్నాడు ఇది ఎవరు, ఎందుకు చేశారు? అని సీఎం ఆరా తీసి కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. మూడో రోజు తర్వాత ఆ కమిషనర్‌ను ఆ పదవి నుంచి తప్పించి పోస్టింగ్ ఇవ్వకుండా ఎక్కడో సర్దుబాటు చేశారు. నిజానికి అదనంగా మద్యం షాపులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబే.’
కావాలనే లీకులు..
‘నన్ను సీఎస్‌గా నియమించే విషయంలో కూడా చంద్రబాబు అదే పద్ధతి అనుసరించారు. నన్ను చీఫ్ సెక్రటరీగా, రాముడును డీజీపీగా, మరొకర్ని ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించనున్నట్లు లీక్‌లు వచ్చాయి. ఈ జాబితా గవర్నర్‌కు అందచేసి ఆమోదం పొందాలి. రెండో రోజు జాబితాను పరిశీలించాక.. ‘‘ఆ ఇంటెలిజెన్స్ అధికారి పేరు తీసేయండి. ఆయనపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది...’’ అని ముఖ్యమంత్రి అన్నారు. అదృష్టవశాత్తు నామీద వ్యతిరేక ఫీడ్‌బ్యాక్ రాలేదు. సాయంత్రం జరిగిన ఆంతరంగిక చర్చల్లో మీపట్ల ఏదీ వ్యతిరేక సమాచారం అందలేదనుకుంటా అని ఒక మిత్రుడు అనడంతో ఊపిరి పీల్చుకున్నా.
ఈ పద్ధతి అజేయ్ కల్లాం విషయంలో కూడా జరిగింది. ఆయన్ను చీఫ్ సెక్రటరీగా మొదట నెల పాటు నియమించి తర్వాత ఆర్నెల్లు పొడిగించాలని తొలుత నిర్ణయించారు. కానీ రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త చీఫ్ సెక్రటరీగా దినేశ్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు చెప్పారు. బహుశా రాత్రిపూట జరిగిన చర్చల్లో అజేయ్ కల్లాంను సీఎస్‌గా పంపకూడదని నిర్ణయించి ఉంటారు. కేంద్రం అజేయ్ కల్లాంకు ఆర్నెల్ల పొడిగింపునకు సుముఖంగా లేదని, ఈ నేపథ్యంలో నెల రోజుల కోసం సీఎస్‌గా నియమించే బదులు నేరుగా దినేశ్‌కుమార్‌కు ఇవ్వాలనుకుంటున్నామని లీకులు సృష్టించారు. దీంతో కల్లాం సీఎంను కలవడంతో ఆయనకు నెల పాటు సీఎస్‌గా అవకాశం ఇచ్చారు. అదే జీవోలో కల్లాం రిటైర్‌మెంట్ తర్వాత దినేశ్‌కుమార్‌ను సీఎస్‌గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతం బాబు పద్ధతిని స్పష్టం చేస్తోంది. ఇష్టంలేని వారి మనోస్థైర్యం దెబ్బతినేలా లీకులు ఇచ్చి చివరకు వేటు వేస్తారు’ అని పేర్కొన్నారు.
లీకులతో షురూ!
Published Tue, Dec 4 2018 5:27 AM | Last Updated on Tue, Dec 4 2018 5:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment