ఐవైఆర్ కృష్ణారావు (ఫైల్ ఫొటో)
సాక్షి, విజయవాడ: శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి దారుణమని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారని మండిపడ్డారు. జీవో 76 అమలు చేస్తున్నామని ప్రభుత్వం లీకులిస్తోందన్నారు.
1986 దేవాదాయ చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం సవరించిందని గుర్తు చేశారు. దీని వల్ల చిన్న చిన్న ఆలయాలు మూతపడ్డాయని తెలిపారు. 2007లో ఈ చట్టాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సవరించారని వెల్లడించారు. 1986 చట్ట సవరణతో మిరాశీ పోయిందని, 2007 చట్ట సవరణతో మరోసారి మిరాశీ అంశంపై స్పష్టంత వచ్చిందన్నారు. దీనిని అర్ధం చేసుకోవడానికి ముఖ్యమంత్రికి సమయం లేకుండా పోయిందన్నారు.
చంద్రబాబు తాను పనిచేయడం కన్నా.. చేస్తున్నాననే దానికే ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. బ్రాహ్మణులతో బ్రాహ్మణులతో తిట్టించాలనే పాలసీలని పెట్టుకున్నారన్నారు. కరుడుకట్టిన కులస్వామ్యంతో తెలుగుదేశం పార్టీ నడుస్తోందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కౌంటర్ దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఆగమ పరీక్షలో ఫెయిలైన వారిని ప్రధాన అర్చకుడిగా నియమిస్తారా అని ప్రశ్నించారు. వారసత్వానికి కూడా సమర్ధత వుండాలన్నారు. శాతవాహన కాలేజీని ఆక్రమించేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే మద్దుతు రావడం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment