మాట్లాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి. చిత్రంలో పవన్‌కల్యాణ్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తదితరులు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాలకోసం అన్ని పార్టీలు కలసిపోరాడాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. జాతీయస్థాయిలో ఐక్యంగా పోరాడితేనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలమన్నారు. విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ఉండవల్లి మంగళవారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు రావాల్సి ఉందని సూత్రప్రాయంగా లెక్కతేల్చామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసికట్టుగా పనిచేయాలన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయన్నారు. నాలుగున్నరేళ్లలో కేంద్రమేమీ ఇవ్వలేదన్నారు. నిధుల కోసం ఐక్య పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. విభజన హామీల సాధనకోసం సమష్టి పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సమావేశంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, బీజేపీ తరఫున ఐవైఆర్ కృష్ణారావు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించకుండా నాలుగున్నరేళ్ల విలువైన కాలాన్ని వృథా చేసి ప్రజలను మోసగించిన టీడీపీతో కలసి వేదిక పంచుకోమని చెబుతూ వైఎస్సార్‌సీపీ ఈ భేటీలో పాల్గొనేందుకు నిరాకరించింది.
బీజేపీ పాల్గొంటున్నందుకు నిరసనగా సీపీఎం బహిష్కరించింది. కాగా, ఐవైఆర్ కృష్ణారావు విడిగా మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.16 లక్షల కోట్లు రావాలని రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులు చెప్పగా.. తాను వ్యతిరేకించానన్నారు. దీనిపై టీడీపీ నేతలు ప్రజెంటేషన్ ఇస్తామన్నారని, అలాగైతే తాము కూడా కేంద్రమిచ్చిన నిధులపై వివరాలిస్తామనడంతో వారు వెనక్కు తగ్గారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment