
సాక్షి, విజయవాడ : అమరావతి కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన డిజైన్లన్నీ గ్రాఫిక్సేనని.. రాజధాని పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకావిష్కరణ జరిగింది. విజయవాడ బందరు రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉండవల్లి హాజరై ప్రసంగించారు.
‘రాజధాని ఎక్కడ కట్టాలనే దానిపై ముందు శివరామకృష్ణన్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నిదేదిక నచ్చని చంద్రబాబు టీడీపీ నాయకులతో ప్రత్యేకంగా ఓ కమిటీ వేశారు. రైతుల నుంచి భూముల లాక్కుంటూ.. రైతుల త్యాగాలని సీఎం ప్రచారం చేసుకుంటున్నారు. బాబు చేసేది తప్పని శివరామకృష్ణన్ ఏనాడో చెప్పారు. ఐవైఆర్ నిజాలు మాట్లాడుతున్నారు కాబట్టే చంద్రబాబుకు మండిపోతుంది. దయచేసి అమరావతిని దెయ్యాల నగరంగా మార్చకండి’ అని ఉండవల్లి మాట్లాడారు. అంతకు ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని ఆవిష్కరించగా.. వడ్డే శోభనాద్రీశ్వరరావుకు ఐవైఆర్ అంకితమిచ్చారు. ఇక పుస్తకావిష్కరణలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, పలువురు రిటైర్డ్ అధికారులు పాల్గొని ప్రసంగించారు.
అమరావతి ఎక్స్‌క్లూజివ్ రాజధాని
అమరావతి ఎంపిక వెనుక రహస్య ఎజెండా ఉందని ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఉద్ఘాటించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని ఆయన పేర్కొన్నారు. పాలక వర్గ విధేయుల రియల్ ఎస్టేట్.. వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా అమరావతిని ఎంచుకున్నారే తప్ప.. ఇది ఎంత మాత్రం ప్రజా రాజధాని కాదని ఆయన స్పష్టం చేశారు. అసలు సారవంతమైన రాజధాని ఎంపిక చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. శోభనాద్రీశ్వరావు రైతుల కోసం పాటుపడుతున్న వ్యక్తి అందుకే ఆయనకు పుస్తకాన్ని అంకితమిచ్చినట్లు ఐవైఆర్ వెల్లడించారు.
ఇక పుస్తకంలో ఆయన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. ‘అమరావతి ఏ రకంగానూ ప్రజా రాజధాని కాదు. ఇది ఎక్లూజివ్ రాజధాని. తన జాతి బలమైన సమర్థన ఉండటం వల్లే చంద్రబాబు అమరావతిని ఎంపిక చేశారు. ప్యూహాలు పన్ని కుటిలనీతి ఉపయోగించారు. మాదాపూర్ హైటెక్ సిటీ రియల్ ఎస్టేట్ తరహా నమునాలా అమరావతిని ఎంపిక చేశారు’ అని పేర్కొన్నారు.
బుద్దిపోనిచ్చుకోని టీడీపీ... ఐవైఆర్ కృష్ణారావు పుసక్తకావిష్కరణకు టీడీపీ పోటీనిచ్చింది. ప్రజారాధానిపై కుట్ర పేరిట సీనియర్ నేత వర్ల రామయ్య పుస్తకావిష్కరణ చేపట్టారు. ఈ రెండు ఒకేసమయంలో చేపట్టడంతో బందర్ రోడ్డులో పోలీసులు భారీగా మోహరించారు.