
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలబిరుసుతో వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా హైకోర్టు ఎక్కిన చంద్రబాబు వైఖరిని ఆయన తప్పుబట్టారు. ‘ఎన్నికల సంఘంతో చంద్రబాబు దురుసు ప్రవర్తన.. సీబీఐ పట్ల మమతా బెనర్జీ తీరు కన్నా ఘోరంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ సంస్థ. ఎవరు తప్పుడు సలహా ఇచ్చారోగాని చంద్రబాబును ముంచేశారు. తప్పుడు, తలబిరుసు ప్రవర్తనకు జీవితంలోని మర్చిపోలేని గుణపాఠం తప్పద’ని జీవీఎల్ ట్వీట్ చేశారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలన్న సీఈసీ ఆదేశాలు పాటించకుండా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంపై రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విటర్‌లో స్పందించారు. ‘ఎన్నికల సమయంలో డీజీపీగా సీఎస్ ఉండటం నాకు తెలిసి సవాళ్లతో కూడిన విషయం. నాకు తెలిసి సీఎస్, డీజీపీ ఈ సమయంలో ఎన్నికల సంఘం పరిధిలో ఉంటారు. టీఎన్ శేషన్ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. మరి వారే ఎన్నికల సంఘంపై కోర్టు కేసు ఎట్లా వేస్తారు? నాకు తెలియని న్యాయపరమైన అంశాలు దీంట్లో ఉన్నాయా’ అని ఐవైఆర్ ప్రశ్నించారు.
(చదవండి: ఈసీకి ఎదురుతిరిగిన ఏపీ ప్రభుత్వం)
Comments
Please login to add a commentAdd a comment