సాక్షి, అమరావతి: ‘మంగళగిరి ప్రజలకు ఇది మంచి అవకాశం. ప్రజలు ఆలోచించి.. మంచి అభ్యర్థికి ఓటు వేయాలి. అర్హతలేని రాజకీయ వారసులను ఓడించాలి’ అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు పిలుపునిచ్చారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావుతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు.
మంగళగిరిని ‘మందలగిరి’గా మార్చేస్తారేమో!
‘మంగళగిరికి ఈ ఎన్నికల్లో చాలా ప్రాధాన్యముంది. అధికార బలంతో, ధనబలంతో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి గెలవాలనుకుంటున్నారు. స్థానికేతరుడైన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీచేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. భూ వ్యాపారం చేసుకోడానికి, వేలకోట్ల నల్లధనం దాచుకోడానికే ఆయన ఇక్కడికి వచ్చారు. అవినీతి సొమ్మంతా ఇక్కడ పెట్టుబడి పెట్టారు. మంగళగిరిపై లోకేష్‌కు ఎలాంటి ప్రేమలేదు. అభివృద్ధి పేరుతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారు’ అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
మంగళగిరి పేరును మందలగిరిగా పేరు మార్చే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. నారా లోకేష్ అమాయకుడేమీ కాదని, రాష్ట్రంలో అవినీతి, అక్రమాలన్నింటికీ ఆయన సూత్రధారి అని మండిపడ్డారు. లోకేష్ అంటే లోకాన్ని దోచేటోడని, ఈ నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ ఇట్లో జరిగిన ఐటీ సోదాలను టీడీపీ నేతలు అడ్డుకున్న తీరు అమానుషమని మండిపడ్డారు. అడ్డకున్న వారిపై కేసులు నమోదుచేసి అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఉగ్రవాదులుగా టీడీపీ నేతలు మారారని ధ్వజమెత్తారు. టీటీడీని రాజకీయ దళారులకు అప్పజెప్పి టీడీపీ రాజకీయం చేస్తోందని, టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ వెంటనే రాజీనామా చెయ్యాలని అన్నారు. అన్య మతుస్తుల తరఫున ప్రచారం చేసే వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా నియమించడం వెనక చంద్రబాబు ఉద్దేశం ఏమిటన్ని ప్రశ్నించారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అని, ఆ పార్టీకి ప్రస్తుత ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా రాదని జీవీఎల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment