సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో మొదటి దశలోనే ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు ఇంకా 40 రోజుల సమయం ఉంది. అయితే ఎన్నికల్లో ఏయే స్థానాల్లో ఏయే పార్టీ అభ్యర్థులు ఎంత మెజార్టీతో గెలుస్తారు.? ఎవరు ఓడతారు.? ఓడితే ఎంత మెజార్టీతో ఓడతారు.? ఇలా బెట్టింగ్ రాయుళ్ల పెందెలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్ల ఫోకస్ అంతా మంగళగిరిపైనే ఉంది. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పోటీచేస్తుండడం... ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండడంతో ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అనే అంశాలపై బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయి.
వైఎస్సార్ సీపీపైనే బెట్టింగ్ రాయుళ్ల చూపు..
నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లున్నాయి. ఇక్కడ 85 శాతం పోలింగ్ నమోద అయింది. క్షేత్ర స్థాయిలో ఓటర్ పల్స్‌ని పసిగట్టిన పంటర్లు మాత్రం వైఎస్సార్ సీపీపైనే పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. లోకేశ్ గెలుస్తాడు అని బెట్టింగ్ వేసే వారికి ఒకటికి 1.5 నుంచి రెండు రెట్లు ఇస్తామంటున్నారు. (ఉదాహరణకు లోకేశ్ వైపు రూ.లక్ష పందెం కాస్తే లక్షా యాభైవేల నుంచి రెండు లక్షలు ఇచ్చే అవకాశం ఉంది). భారీగా పోలింగ్ నమోదవడంతో పాటు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలు, ఎస్సీలు ప్రతిపక్షం వైపు మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు.
లోకేశ్‌ను దెబ్బతీసిన ద్వితీయ శ్రేణి నాయకులు..
స్వయంగా సీఎం తనయుడు, టీడీపీ భవిష్యత్ నాయకుడిగా భావించే లోకేశ్ బరిలో ఉండడంతో సాధారణంగానే ఆ పార్టీ ఇక్కడ గెలుపుపై తీవ్ర కసరత్తు చేసింది. అయితే ఎలక్షన్ ముందు రోజు చాలా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు లోకేశ్‌కు హ్యాండ్ ఇచ్చారు. డబ్బులు అందగానే వారి ‘దారి’ వారు చూసుకున్నారు. దీనికి తోడు లోకేశ్ గెలిస్తే తాడేపల్లి మండలంలో కొండలపై ఉన్న వారి ఇళ్లను తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. వీరంతా గంపగుత్తగా ఆర్కేకు వైపు మొగ్గు చూపినట్లు తెలసుస్తోంది. అలాగే భూ సేకరణ వల్ల ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగిన రైతులు, ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చి నష్టపోయిన రైతులు... చేనేతలు ఇలా అందరూ టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్కే గెలిస్తే మంత్రి పదవి..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించడంతో అప్పటిదాకా ఉన్న సమీకరణాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆర్కే మంత్రిగా ఉంటే తమ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తటస్త ఓటర్లు భావించారు. దీంతో అన్ని వర్గాల ఓటర్లతో స్పష్టంగా ఆర్కేను గెలిపించుకుందామనే భావన వ్యక్తమవడంతో లోకేశ్ ఓడిపోతారనే ప్రచారం జోరుగాసాగుతోంది.
ఎన్నికలకు వారంముందు వరకు..
ఎన్నికలకు వారం ముందు వరకు నియోజకవర్గంలో ఓటరు నాడి అంతుపట్టకుండా ఉంది. బలాబలాలు సమానంగా కనిపించాయి. అయితే చివరిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారం, ఆర్కేకు మంత్రి పదవి హామీ ఇవ్వడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి బలం చేకూరింది. దీంతోనే పంటర్లు ఆర్కేపైనే పందెం కాసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి పోలింగ్ రోజు లోకేశ్ నానా హంగామా చేయడంతో బెట్టింగ్ రాయుళ్లు అతడి గెలుపుపైఅంచనాకు వచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment