తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించి కార్యకర్తలను విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్కే
తాడేపల్లిరూరల్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నారా లోకేశ్‌కు ఓ న్యాయం.. సామాన్యులకో న్యాయమా అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. పోలీసులను ఉసిగొల్పి తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, అక్రమ కేసులకు భయపడబోమని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పోలకంపాడు పాఠశాల వద్ద పోలింగ్ రోజు తమ పార్టీవారిని కొట్టి, వారిపై తప్పుడు కేసులు బనాయించి శనివారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలుసుకున్న ఆర్కే పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
లోకేశ్ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి క్రిస్టియన్‌పేటలో ఎన్నికలు జరుగుతున్న పాఠశాల వద్ద నుంచి 10 అడుగుల దూరంలో ధర్నా చేస్తే కేసు ఎందుకు పెట్టలేదు.. దాన్ని ప్రశ్నించినవారిపై ఎందుకు నమోదు చేశారు, ఎవరు ఫిర్యాదు ఇచ్చారు అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనికి పోలీసులు స్పందిస్తూ.. తమ దగ్గర వీడియోల ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే, అక్కడ మీకు లోకేశ్ కనిపించలేదా? టీడీపీ కార్యకర్తలు కనిపించలేదా అని పోలీసులను ప్రశ్నించిన ఆర్కే పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. ఎన్నికల రోజు మంగళగిరి నార్త్ జోన్ డీఎస్పీ, ఇతర సిబ్బంది చేసిన హడావుడి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై చేసిన లాఠీచార్జి లోకేశ్ పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించిన ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జరిగిన ఘటనపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. లోకేశ్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశామని ఆర్కేకు పోలీసులు వివరణ ఇచ్చారు.
టీడీపీ కార్యకర్తల హడావిడి..
అన్యాయంపై పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే ఆర్కే ధర్నా చేస్తుండగా, వైఎస్సార్‌సీపీ నేతలు తమను కొట్టేందుకు వేరే ప్రాంతాల నుంచి జనాల్ని తీసుకొచ్చారని, వారు తమ ఇళ్లను ధ్వంసం చేసి కొట్టారంటూ కొంతమంది మహిళలు హడావిడి సృష్టించారు.
డీఎస్పీకి టీడీపీ జీతం ఇస్తుందా?
మంగళగిరిలో లోకేశ్ పోటీలో ఉండటంతో స్థానిక డీఎస్పీ పసుపుజెండా కప్పుకుని, టీడీపీ జీతగాడిగా పనిచేస్తున్నారని ఆర్కే మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి డీఎస్పీ తన కిందిస్థాయి సిబ్బందిని బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. డీఎస్పీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. లేనిపక్షంలో న్యాయపోరాటానికి సిద్ధమవుతామని ఆర్కే హెచ్చరించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment