
ముప్పాళ్ల(సత్తెనపల్లి): ‘‘మర్డర్లు అన్నా.. మానభంగాలన్నా మాకు లెక్క కూడా లేదు... మా బాబు గారు (చంద్రబాబు) తలుచుకుంటే ఈ ఐదేళ్ళలో మీరు రోడ్లపై కూడా తిరిగేవారు కాదు... మనలో ఒకరిని లాగి పుల్లలు పెట్టి వాళ్లు గెలవాలని చూస్తున్నారు.. మేం చెబుతున్నాం... ఏ ఊళ్ళో ఎవడూ ఏమీ చేయలేడు.. మేం తలుచుకుంటే మాకు అధికారం లేకపోయినా ఈ సెంటర్‌లో మేం ఏదైనా చేయగలం.. ఆపే మగాడు లేడు...’’ అంటూ తెలుగుదేశం పార్టీ ముప్పాళ్ల మండల మాజీ అధ్యక్షుడు రావిపాటి దేవేంద్రరావు ఆవేశంతో ఊగిపోయారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల తహసీల్దారు కార్యాలయం సమీపంలో సత్తెనపల్లి –నరసరావుపేట ప్రధాన రహదారిపై వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు ఆదివారం తగులబెట్టారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ నాయకులు తీవ్ర అసహనంతో వైఎస్సార్‌సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగటం గమనార్హం. టీడీపీ చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులను సాక్షాత్తూ ఎస్సై జి.ఏడుకొండలు అడ్డుకుని టీడీపీ వారికి వెన్నుదన్నుగా నిలిచారు. ‘ఈ ఎన్నికల్లో మేం 110 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తాం... మనల్ని ఏం చేయలేరు..’ అని టీడీపీ మండల అధ్యక్షుడు పాపారావు ఈ సందర్భంగా అన్నారు. ముప్పాళ్ళ ఎస్సై తన సిబ్బందితో దగ్గరుండి మరీ దిష్టిబొమ్మ దహనం చేయించటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఉందో.. టీడీపీ పర్యవేక్షణలో ఉందో అర్థం కావటం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment