గుంటూరు రూరల్ ఎస్పీతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి తదితరులు
సాక్షి, గుంటూరు/అమరావతి : ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడటంలో కోడెల శివప్రసాదరావు రాష్ట్రంలోనే నంబర్ వన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. కోడెల పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని గంటన్నర పాటు లోపల ఉండిపోయారని.. సీనియర్ నాయకుడై ఉండి ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంతో పాటు, గొడవకు సంబంధంలేని అంబటి రాంబాబు వంటి నేతలపై ఆయన కేసులు నమోదు చేయించడం దారుణమన్నారు. గుంటూరు జిల్లాలో ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై చేసిన దాడులు, పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మర్రి రాజశేఖర్ అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ బృందం ఆదివారం రాత్రి గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబును కలిసి జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, టీడీపీ నేతలను అరెస్టు చేయకుండా వదిలేస్తున్నారంటూ ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులు జరిగిన సంఘటనలపై నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ ఎస్పీకి వినతిపత్రం అందించారు. ఆ తర్వాత పార్టీ జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
టీడీపీకి పోలీసుల అండ వల్లే దాడులు
టీడీపీ నేతలకు పోలీసులు అండగా నిలవడం వల్లే దాడులు జరిగాయని, అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. సత్తెనపల్లి, వేమూరు, గురజాల నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బరితెగించి దాడులకు తెగబడ్డారని, అక్కడి పోలీసులు సైతం వారికి వత్తాసు పలుకుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు.. మేరుగ నాగార్జునపై హత్యాయత్నానికి పాల్పడిన వారిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం ఏమిటని బొత్స ప్రశ్నించారు. గురజాలలో కాసు మహేష్‌రెడ్డిపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడితే వారి వద్ద మారణాయుధాలు లేవంటూ నామమాత్రపు కేసులు నమోదు చేసిన పోలీసులు.. కోడెల వ్యవహారంలో మాత్రం హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమన్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని, వారు ఆ పనిచేయకపోతే తామే చేస్తామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచి పద్ధతి కాదని.. తాము సంయమనం పాటిస్తున్నామన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నారని, దానిపై చర్యలు తీసుకోని కోడెల.. స్పీకర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని బొత్స అన్నారు. సభాపతి హోదాను ఆయన దిగజార్చారని ఆరోపించారు.
టీడీపీ ఏజెంట్లలా పోలీసులు
గురజాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. గురజాలలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు టీడీపీకి ఏజెంట్లులా పనిచేశారని మండిపడ్డారు. గురజాలలో టీడీపీకి, వైఎస్సార్‌సీపీకి మధ్య పోటీ జరగలేదని.. వైఎస్సార్‌సీపీకి, పోలీసులకు మధ్య పోటీ జరిగిందన్నారు. గురజాల సీఐ దగ్గరుండి మరీ ముస్లింలపై దాడులకు టీడీపీ నేతలను ఉసిగొల్పారని, ఇలాంటి వారిని మార్చాలని ఎన్నికల ముందే ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఇలాంటి వారిని వదిలేదిలేదని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
దళిత మహిళనైన తనపై పెదపరిమి గ్రామంలో 51, 52 పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ గూండాలు దౌర్జన్యానికి పాల్పడి దాడులకు తెగబడటం దారుణమని తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. వీరిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఎస్పీని కలిసిన వారిలో గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్, జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మేరుగ నాగార్జున, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోశయ్య, చంద్రగిరి ఏసురత్నంతోపాటు పార్టీ నేతలు లేళ్ళ అప్పిరెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, ఆతుకూరి ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.
రిగ్గింగ్ అనుమానంతోనే ఓటర్లు తిరగబడ్డారు
పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి కోడెల తలుపులు వేసుకుని కూర్చుంటే లోపల రిగ్గింగ్ చేస్తున్నాడనే అనుమానంతోనే ఓటర్లు తిరగబడ్డారని, అంతే తప్ప ఇదేదో పథకం ప్రకారం జరిగిన సంఘటన కాదని స్పష్టంచేశారు. దాడి జరిగితే ఆసుపత్రికి వెళ్లకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా 24గంటల తరువాత ఘటనతో సంబంధంలేని వ్యక్తితో ఫిర్యాదు చేయిస్తే హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారని అంబటి ప్రశ్నించారు. కోడెల బూత్ ఆక్రమణకు పాల్పడ్డారని తమ పోలింగ్ ఏజెంట్ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. అలాగే, 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ పోలీసుల ఎదుటే టీడీపీ నేతలు ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం చేస్తుంటే ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదని మండిపడ్డారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు
గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ (ఏప్రిల్ 11) రోజున, పోలింగ్ అనంతరం టీడీపీ శ్రేణులు చేసిన దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేశారు. ఈ కమిటీ మూడు నియోజకవర్గాల్లో పర్యటించి.. ఆయా గ్రామాల్లో కోడెల శివప్రసాద్, ఆయన అనుచరులు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులపై వాస్తవాలు తెలుసుకోవడంతో పాటు, దాడుల్లో గాయపడిన, నష్టపోయిన వారికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇస్తుంది. అనంతరం ఈ కమిటీ పార్టీ అధ్యక్షుడికి సమగ్ర నివేదిక అందజేస్తుంది. మర్రి రాజశేఖర్ నేతృత్వంలోని ఈ కమిటీలో లావు శ్రీకృష్ణదేవరాయలు, అంబటి రాంబాబు, కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మహమ్మద్ ఇక్బాల్, అంజాద్ బాషా, నవాజ్ సభ్యులుగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment